Tuesday, November 10, 2015

స్కూళ్ల నిధులు లాక్కున్న సర్కారు

అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని చోద్యం జరిగింది. స్కూళ్లకు మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు.. తేరగా వాటి నిధులే మింగేసింది. పైగా నిధులు ఖర్చుచేయలేదని కుంటిసాకులు చెబుతోంది. సర్కారు ఇచ్చిన నిధులతో పాటు, వాటిపై వచ్చిన వడ్డీ కూడా లాగేసుకోవడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. ఆర్భాటంగా ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి దివాలాకోరు పద్ధతులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
        ప్రతి స్కూలుకు స్కూల్ ఖర్చులు, కరెంట్ బిల్లు, సిబ్బంది జీతాల కోసం సర్కారు రెండు గ్రాంటులు ఇస్తోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు ఇచ్చారు. అయితే చాలా పాఠశాలలు ఇంకా ఈ నిధులను వాడుకోలేదు. ఇదే అదనుగా భావించిన స్కూళ్లకు సమాచారం లేకుండా స్కూల్ ఖాతాలో ఉన్న నిధులను వెనక్కితీసుకుని, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారి ఖాతాకు జమ చేసింది. ఈ విషయం తమకు కూడా తెలియదని ఎస్ఎస్ఏ అధికారి చెప్పడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
       అధికారులకు కూడా తెలియకుండా నేరుగా బ్యాంకులతో మాట్లాడి 25 కోట్ల నిధులు వెనక్కుతీసుకోవడంపై జిల్లాలో నిరసన వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా స్కూళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి పంపులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని చెబుతుంటే.. వాటి కోసం ఇచ్చిన నిధులను కూడా లాక్కోవడమేంటని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే కనునిప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Monday, November 9, 2015

పచ్చ ప్రభుత్వానికి బాక్సైట్ పంచ్

ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు పోరాటాలు చేసిన చంద్రబాబు.. సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు వచ్చేలా చేయడంపై మన్యంలో ఉద్యమం రాజుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యమకారులు.. గతంలో మాదిరిగా ఉధ్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు బాక్సైట్ ఉద్యమానికి మావోయిస్టులు కూడా మద్దతు పలకడంతో.. వేడి మరింతగా రాజుకుంటోంది.
             బాక్సైట్ తవ్వకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తమ అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోవడం లేదని.. మన్యంలో తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ముందుకెళితే తాము పార్టీని వీడాల్సి వస్తుందని చెప్పినా.. చంద్రబాబు మొండి పట్టు పట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల బాక్సైట్ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షం అండగా నిలుస్తోంది. వైసీపీకి మన్యంలో లభించిన అపూర్వ స్వాగతం.. బాక్సైట్ విషయంలో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చాటిచెబుతోంది. 

రాజధానిలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం గాలికి..!

రాజధానికి త్వరగా తరలిరావాలని ఉద్యోగులను తొందరపెడుతున్న చంద్రబాబు సర్కారు.. వారికి మౌలికవసతులు కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉద్యోగుల నివాసానికి కీలకమైన ఇళ్ల నిర్మాణంపై సర్కారు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.  ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో.. ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
    పరిశ్రమలు, అస్మదీయులకు వేలాది ఎకరాలు దోచిపెడుతున్న చంద్రబాబు.. స్థలం లేదన్న సాగుతో పది వేల ఇళ్లు రద్దు చేసేశారు. ఇక కరకట్టపై అక్రమనిర్మాణాలు కడుతున్నారనే సాకుతో మరికొన్ని ఇళ్లు రద్దుచేశారు. అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు మాత్రం.. అదే కృష్ణా కరకట్టపై ప్రభుత్వమే అక్రమ నిర్మాణంగా నిర్థారించిన భవనానికి మరమ్మతు చేయించుకుని మరీ దర్జా ఒలకబోస్తున్నారు. సామాన్యుడికి నివాసాలు దూరం చేస్తూ సర్కారు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

ఒక ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన

రాయలసీమకు వరప్రదాయిని అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టుపై టీడీపీ సర్కారు శీతకన్నేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఈ ప్రాజెక్టుకు రెండుసార్లు పునాదిరాళ్లు వేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం కాలువ పనులు పూర్తిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దివంగత నేత వైఎస్ హయాంలో మూడొంతుల పనులు పూర్తిచేసినా... చంద్రబాబు మాత్రం మాటలతో పొద్దుపొచ్చుతూ అనంత జిల్లా రైతాంగాన్ని మభ్యపెడుతున్నారు.
      గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా టీడీపీకి బ్రహ్మరథం పట్టింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లా పచ్చపార్టీని బాగానే ఆదరిస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం అనంత జిల్లాకు చెప్పుకోదగ్గ మేలు చేసిన పాపాన పోలేదు. అనంత ఎన్టీఆర్ కు ఇష్టమైన జిల్లా అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు.. ఇరవై ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకుండా లోటు బడ్జెట్ సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. బాబు తీరుపై స్థానిక టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Sunday, November 8, 2015

చింతమనేనిపై అవ్యాజ ప్రేమ

అంగబలం, అర్థబలానికి తోడు అధికార బలం కూడా తోడుగా ఉంటే.. ఇక నేరం చేస్తే మాత్రం కేసులేముంటాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో పోలీసుల వ్యవహారశైలి ఇలాగే ఉంది. అభయారణ్యంలో అక్రమంగా రోడ్డు వేశారని రుజువైన, అదేమని ప్రశ్నించిన అధికారులపై చేయి చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చినా.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తే పరిశీలనలో ఉందని సమాధానం చెబుతున్నారు.
             చింతమేనిపై కేసు పెట్టకపోగా.. పోలీసులు వింత వాదన వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో కూడా అటవీ చట్టం కింద కేసు నమోదైందని, ఇప్పుడు కూడా అదే చట్టం కింద ఫిర్యాదు చేశారని, ఒకే చట్టం కింద రెండు కేసులెందుకనే ఆలోచనలో ఉన్నామని.. ఖాకీలు చట్టానికే కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రస్తుతం విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, వారు చెప్పినట్లుగా నడుచుకుంటామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
              ఇక చింతమనేని విషయంలో అటవీ, పోలీస్ అధికారుల తీరు మొదట్నుంచీ అనుమానాస్పదంగా ఉంది. చింతమేని కోమటిలంక రోడ్డుపై కన్నేశారని తెలిసినా, ఆయన అర్థరాత్రి వస్తారని తెలిసినా.. డీఆర్వో, పోలీసులు మౌనం వహించారు. అటవీ సిబ్బంది ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అధికారంలో ఉన్నవారికి మడుగులు వత్తితే.. అధికారులు కూడా శిక్ష అనుభవించక తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ముద్రగడ ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, కాపు సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి కాపు నేతలు సంఘీభావం తెలిపారు. కోనసీమతో పాటు పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి భారీగా కాపులు తరలివచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు సాధించుకోలేకపోతే భవిష్యత్తులో కాపులు దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముద్రగడ ఆందోళన వ్యక్తం చేశారు.
  ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని ముద్రగడ హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు మోసపూరిత హామీలిచ్చారని, ఈసారి వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాపు కార్పోరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి,, కేవలం వంద కోట్లే విదిలించారని ముద్రగడ గుర్తుచేశారు. కాపులపై చంద్రబాబు కపటప్రేమను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
   కాపు ఉద్యమ కార్యాచరణను నిర్ణయించడానికి జనవరి 31న భారీ బహిరగం సభ ఏర్పాటుచేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సభకు కాపులంతా పెద్దఎత్తున తరలివచ్చి.. ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని కోరారు.

రైతుల దెబ్బకు మంత్రి పరార్..!

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీరు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు మీదుగా పెదనందిపాడు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు, ప్రజలు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలిసిన మంత్రి కాన్వాయ్ ను మినీ బైపాస్ మీదుగా దారి మళ్లించారు
     పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది నియోజకవర్గంలో కొంతకాలంగా పంటలకు సాగునీరు, తాగడానికి తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మంత్రిని నిలదీద్దామనుకుంటే పోలీసులు కూడా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై రైతులున్నారని తెలిసి కూడా మంత్రి దొడ్డిదారిన వెళ్లడం. ఇలాంటి నేతలను గెలిపించడం తమ దౌర్బాగ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
        పంటలు పండక, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు కూడా సరిగా జరగడం లేదని నిరసన తెలిపారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడం సబబు కాదన్న పోలీసులతో.. రైతులకు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న రైతులు.. అక్కడ్నుంచి వెనుదిరిగారు.