Thursday, November 12, 2015

పంతుళ్ల కడుపులు మాడుస్తున్న సర్కారు

అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారి జీతాలకే ఎసరుపెట్టారు. విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలు గడిచినా.. కేవలం ఒకటిన్నర నెల జీతం మాత్రమే ఇచ్చి అధ్యాపకుల  కుటుంబాలను పస్తులుంచుతున్నారు. సమస్యను ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా, ధర్నాలు చేసినా ఫలితం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
            2000వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం లోకి వచ్చాక వారి మాట మరిచిపోయారు. నాలుగు నెలల తర్వాత మంత్రులు గంటా, యనమల, పల్లె, కామినేనితో సబ్ కమిటీ ఏర్పాటు చేసి.. కాంట్రాక్టు అధ్యాపకులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
             అయితే కమిటీ ఏర్పాటై సంవత్సరం గడిచినా ఇంతవరకూ అతీగతీ లేదు. ఎవర్నడిగినా సరిగా స్పందించడం లేదని, తమ పొట్టకొట్టడం న్యాయం కాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ చేసినా, చేయకపోయినా కనీసం తమ జీతాలైనా ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. చిత్తూరు పర్యటనకు వస్తున్న చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని చెబుతున్నారు.

అధికార పార్టీ లిక్కర్ దందా

 మద్యం టెండర్ల విషయంలో పచ్చ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. మద్యం వ్యాపారులను బెదిరించి కొన్ని దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా చేశారు. ఇక సిండికేట్ అయిన మద్యం వ్యాపారుల నుంచి తమ వంతు మామూళ్లు వసూలు చేస్తున్నారు. లిక్కర్ ను నియంత్రిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఊరూ వాడా ఊదరగొడుతున్న చంద్రబాబు.. తమ పార్టీ నేతలు లిక్కర్ దందా కొనసాగిస్తూనే.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు.
          అనంతపురం జిల్లాలో మద్యం టెండర్ల వ్యవహారం గమనిస్తే అధికార పార్టీ నేతల బాగోతం బయటపడుతుంది. జిల్లాలో మొత్తం 29 దుకాణాలకు టెండర్లు పిలవగా.. ఎనిమిది దుకాణాలకు ఒక్క టెండర్ కూడా రాలేదు. ఈ షాపుల వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని అందరూ భావిస్తున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన వ్యాపారులను బెదిరించి వెనక్కుపంపినట్లు ఆరోపణలున్నాయి.
        అధికార పార్టీ నేతల అక్రమాలకు అధికారులు కూడా అండగా నిలవడంతో.. మద్యం టెండర్లు దాదాపుగా ఏకపక్షంగా ముగిశాయి. మద్యం నుంచే ఖజానాకు భారీ ఆదాయం వస్తోందని చెప్పుకుంటున్న సర్కారు.. మద్యం టెండర్లలో అక్రమాలు జరిగి ఖజానాకు చిల్లు పడుతున్నా.. మనవాళ్లే కదా అని చూసీచూడనట్లు పోతోంది. పచ్చ తమ్ముళ్ల దోపిడీ ఇలాగే సాగితే.. ఖజానాకు పెద్ద చిల్లు పడుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు.

Wednesday, November 11, 2015

మన్యంలో బాక్సైట్ సెగలు

బాక్సైట్ తవ్వకానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ మన్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే ఐక్య ఉద్యమం దిశగా గిరిజనులు సంఘటితమవుతుంటే.. వారికి మద్దతుగా ఏయూలో విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. ఏయూలో విద్యార్థుల దీక్షలకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా గిరిజనుల పొట్ట కొట్టడానికి సర్కారు కంకణం కట్టుకుందని విమర్శలు వస్తున్నాయి.
             ప్రతిపక్షంలో ఉండగా గిరిజనులపై కపట ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు అసలు రంగు బయటపెట్టారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మన్సంలో బాక్సైట్ తవ్వకాలు జరగనీయమని వారు తేల్చిచెప్పారు. గిరినులను మన్యం నుంచి తరిమివేసే లక్ష్యంతో సర్కారు చర్యలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
             గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతితో వారి మనుగడనే ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు గిరిజన సలహా మండలి అనుమతులు అవసరం ఉండగా.. సర్కారు ఏకపక్షంగా జీవో జారీ చేసిందని ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతోందని, రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 

సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం

ఆరుకోట్ల రూపాయలు ఖర్చుచేసి వేసిన మంచి నీటి పైపులైన్లు.. కనీసం సంవత్సరమైనా పనిచేయాలి కదా. కానీ మన హైటెక్ సీఎం చంద్రబాబు హయాంలో మాత్రం ఐదు నెలలకే నీటి పైపులైన్లకు తూట్లు పడ్డాయి. పుష్కరనిధులతో ఆర్భాటంగా వేసిన పైపులైన్లకు అప్పుడే లీకేజీలు రావడం చూసి జనం విస్తుబోతున్నారు. ఈ చోద్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాల్టీలో జరిగింది.
           అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. పుష్కరాలకు ఇష్టానుసారంగా నిధులు ఖర్చుపెట్టిన సర్కారు.. వాటి అజమాయిషీ సరిగా చేయలేదనడానికి ఈ పనులే నిదర్శనమంటున్నారు. అనవసరంగా ఖర్చు పెట్టడం, డబ్బులు వృథా చేయడం, అంతా అయిపోయాక నిధుల్లేవంటూ చేతులెత్తేయడం సర్కారుకు అలవాటుగా మారిందన్న విమర్శలున్నాయి.
         మంచినీటి పైపులైన్లు నరసాపురం మున్సిపాల్టీ పరిధిలో వేసినా.. మున్సిపాల్టీ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఇంజినీర్లు కూడా పరిశీలించాల్సి ఉంది. పుష్కరాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వమే కాబట్టి.. నిధులు సద్వినియోగం అయ్యాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతిసారీ లోటు బడ్జెట్ అంటూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు సర్కారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా తమ వంతు అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. 

సర్కారు పుణ్యంతో దీపావళికి పస్తు

ఔట్ సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం. ఇది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వల్లించిన చిలక పలుకులు. కానీ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఇవన్నీ మరిచిపోయారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్నవారని కూడా ఊడపీకుతున్నారు. కొంతమందిని తీసేయడం కుదరకపోతే.. వారికి జీతాలు ఇవ్వకుండా నానా పాట్లకు గురిచేస్తున్నారు.
              కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్ వాడీలు, ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. వీరి జీతాలు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల లోపే ఉన్నా.. సర్కారు మాత్రం బడ్జెట్ లేదంటూ కుంటిసాకులు చెబుతోంది.
             వందల కోట్లతో అమరావతి శంకుస్థాపన ఆర్భాటంగా నిర్వహించిన ప్రభుత్వానికి తమ ఆకలి తీర్చడానికి చేతులు రావడం లేదని అంగన్ వాడీలు మండిపడుతున్నారు. నెలకు ఐదు వేల రూపాయలతో బతకడమే కష్టమని, అలాంటిది ఆరు నెలలుగా జీతాలు రాకపోతే మనుషులు ఎలా బతుకుతారన్న కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి పొట్ట గొడుతున్న సర్కారు.. తమను పండగ రోజు కూడా పస్తు పడుకోబెట్టిందని మండిపడుతున్నారు. 

Tuesday, November 10, 2015

గుంటూరు సాక్షిగా మిత్రభేదం

ఏపీలో టీడీపీ, బీజేపీ మైత్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మొదట్లో కేంద్రంపై నమ్మకంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు ప్రతిపక్షాల విమర్శల్ని కూడా లెక్కచేయకుండా మోడీని వెనకేసుకొచ్చారు. అయితే శంకుస్థాపనకు వచ్చి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇవ్వడం అవమానకరమని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా గుంటూరు తమ్ముళ్లు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
     ఎన్నికలు పూర్తయ్యాక మొదటిగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివిధ కార్యక్రమాల్లో టీడీపీ సర్కారుపై విమర్శలు చేశారు. తర్వాత తెలుగుదేశం నేతలు కూడా దీటుగా స్పందించారు. అయితే మిగతా జిల్లాల నేతల సంగతి ఎలా ఉన్నా.. గుంటూరు నేతలు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. గల్లా జయదేవ్ ప్రధాని పర్యటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, నర్సరావుపేట ఎంపీ రాయపాటి ఏకంగా ప్రధానిపై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.
        బీహార్ ఫలితాల తర్వాత వినుకొండలో పర్యటించిన రాయపాటి.. ఏపీ ప్రజల ఉసురు తగిలే బీజేపీ మట్టిగొట్టుకుపోయిందని ఆరోపించారు. బీహార్, కశ్మీర్ కు ప్యాకేజీ ఇచ్చి, ఏపీకి మట్టి, నీళ్లు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని రాయపాటి పరోక్షంగా క్లాస్ పీకారు. రాయపాటి కామెంట్లు టీడీపీలో కలకలం రేపాయి. బీజేపీ నేతల స్పందనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. మొత్తానికి గుంటూరు మిర్చి ఘాటు మరిగిన తమ్ముళ్లు.. ఎక్కువకాలం బీజేపీని ఉపేక్షించరనడానికి.. రాయపాటి వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మిల్లర్లతో బాబు మిలాఖత్

రైస్ మిల్లర్లో సీఎం చంద్రబాబు మిలాఖత్ అయ్యారని వైసీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్ర ఆరోపించారు. లెవీ ఎత్తివేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, వ్యాపారులు యథేచ్ఛగా దోచుకుంటున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనే నాథుడే లేడని, రవాణా ఖర్చులు కూడా రైతులే చెల్లించాల్సిన దుస్థితి ఉందని నెహ్రూ మండిపడ్డారు.
        రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు విదేశాలకు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. రాజధాని మత్తులో ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారించాలనే ఆలోచన చేయడం లేదన్నారు. రుణమాఫీ పేరుతో ఊరూరా గొప్పలు చెప్పుకుంటూ.. ఇప్పటికి కేవలం 9 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, రైతులు పద్నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తూ నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయని, రైతులు కష్టాలు పడుతున్నారని, సీఎం స్పందించకపోతే తగిన గుణపాఠం తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతైనా బాబుకు కనునిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు కూడా మోడీ తరహాలో నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.