Saturday, November 14, 2015

జీవీఎంసీలో మిత్రభేదం

ఏరు దాటే దాకా ఏరు మల్లన్న.. ఏరు దాడాక ఓడ మల్లన్న. ఇది ఓ సామెత. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో తెలుగు తమ్ముళ్ల తీరు చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఇప్పటిదాకా బీజేపీతో అంటకాగి, కీలకమైన విశాఖ ఎంపీ సీటును కూడా బీజేపీకి కట్టబెట్టి.. అదేమంటే మిత్రధర్మమని గొప్పలు చెపుకున్న టీడీపీ.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు బీజేపీకి కట్టబెట్టాలని కొంతకాలంగా ఆందోళన చెందుతోంది. అయితే బీహార్ ఎన్నికలు టీడీపీ నెత్తిన పాలు పోశాయి.
            బీహార్ ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో.. మిగతా తెలుగు తమ్ముళ్ల సంగతి ఏమోకానీ.. గ్రేటర్ విశాఖ టీడీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటివరకు జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు బీజేపీకి ఇవ్వాలని చర్చలు జరిపిన నేతలు.. సీట్ల సంఖ్య బాగా తగ్గించేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువ మాట్లాడితే అసలు పొత్తే వద్దని కూడా మొండికేస్తున్నారు.
               టీడీపీ నేతల తీరును గమనిస్తున్న బీజేపీ.. అన్నీ తెలిసినా ఏమీ చేయలని స్థితిలో పడిపోయింది. అవసరమైతే తాము కూడా ఒంటరిగా పోటీ చేస్తామని అంతర్గతంగా కమలదళం మాట్లాడుకుంటున్నా.. విశాఖలో తమది వాపే కానీ బలుపు కాదని వారికీ తెలుసు. అవసరమైతే జాతీయ నేతలతో చంద్రబాబుకు చెప్పించి.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేయాలని, తెలుగు తమ్ముళ్ల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కమలదళం భావిస్తోంది. 

పశ్చిమలో ఆక్వా సెగలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ తలపెట్టిన ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జనం గొంతెత్తారు. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా భీమవరం మండల జొన్నలగరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు.. భారీగా తరలివచ్చారు. అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ.. చంద్రబాబును ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేయనీయమని తేల్చి చెబుతున్నారు.
             ఎక్కడో నివాసాలకు దూరంగా, సముద్రతీరంలో ఏర్పాటుచేయాల్సిన ఆక్వా ఫుడ్ పార్కును, నివాసప్రాంతాలు, పొలాల మధ్యలో ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమౌతోంది. ఆక్వా ఫుడ్ పార్క్ లో భారీగా అమ్మోనియం వాడతారని, దీని కారణంగా సమీప ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు విషపూరితమై, వ్యర్థాలన్నీ గొంతేరు డ్రైయిన్లో కలిసి.. సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడతారని ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ఆందోళన చెందుతోంది.
              ఈ నెల 17న శంకు స్థాపనకు వస్తున్న చంద్రబాబును అడ్డుకుంటామని స్థానిక మహిళలు చెబుతున్నారు. సీఎం తమ ఊరు వస్తే మంచి చేయడానికి రావాలని, అంతేగానీ అందరూ తాగే మంచినీళ్లను విషపూరితం చేస్తామంటే ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లూ తెలుగుదేశానికి ఇచ్చింది.. అభివృద్ధి చేస్తారనే గానీ.. తమ పొలాలు నాశనం చేయడానికి కాదని దెప్పిపొడుస్తున్నారు. 

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే తనయుడి ఘనకార్యం

ఇతరులకు శ్రీరంగనీతులు చెబుతారు కానీ.. తనయుడు వేస్తున్న రోడ్డులో లోపాలు కనిపించడం లేదా.. అని  మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి కాంట్రాక్టు తీసుకుని రోడ్డు వేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణం నాసిరకంగా ఉంటోందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు రాచమల్లు ప్రసాదరెడ్డి రంగంలోగి దిగారు. 
            క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డును పరిశీలించిన వైసీపీ నేతలకు.. స్థానికులు చేస్తున్న ఫిర్యాదులు చాలా తక్కువని తేలింది. అసలు రోడ్డు నిర్మాణంలో ఎవరైనా తారు వాడతారు. కానీ కొండారెడ్డి మాత్రం తారే వాడటం లేదన్న విషయం నేతల దృష్టికి వచ్చింది. కంకరకు నల్లరంగు వేసి మాయ చేస్తున్నారని, తారు కంటే ఆయిల్ ధర తక్కువగా ఉండటమే దీనికి కారణమని పరిశీలనలో తేలింది. 
               అధికార పార్టీ నేతలు రోడ్లు కాంట్రాక్టుకు తీసుకుంటే పనులు ఇలాగే ఉంటాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఈ విధంగా దోచుకుతింటున్నారని విమర్శించారు. వరదరాజులరెడ్డికి దమ్ముంటే తనయుడికి బుద్ధి చెప్పి నాణ్యమైన రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. నిప్పులాంటి మనిషినని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రొద్దుటూరు రోడ్డు చూసి అవినీతి జరగలేదని గుండె మీద చేయ్యేసుకుని చెప్పగలరా అని సవాల్ విసిరారు. 

Friday, November 13, 2015

అంగన్ వాడీ కేంద్రాలకు సర్కారు కోతలు

మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషించే అంగన్ వాడీ కేంద్రాల విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రకరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు అంగన్ వాడీలే అన్ని అవసరాలు తీరుస్తుంటారు. అలాంటి అంగన్ వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా సర్కారు సగానికి సైతం కోత విధించింది. అదేమంటే పెరిగిన పప్పుల ధరలను కారణంగా చూపింది. సర్కారు నిర్ణయంతో తూర్పుగోదావరి జిల్లాలోని చిన్నారులు ఆకలితో అలమటిస్తారని ఆందోళన వ్యక్తమౌతోంది.
         అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం ఇస్తారు. మూడేళ్ల వరకు చిన్నారులకు మూడు కేజీల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చుకుని విద్యాబుద్ధులు నేరతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. అయితే ఇప్పుడు కందిపప్పు ధర పెరిగిందనే సాకుతో అరకేజీ కోత విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
             విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రేపటి పౌరులను బలహీనులుగా తయారుచేస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు అన్నం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు బీదఅరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ టూర్లు, ప్రత్యేక విమానాలు అంటూ అనవసర ఖర్చు చేసే చంద్రబాబు.. చిన్నారుల నోటి దగ్గర కూడు లాగేయడం దౌర్భాగ్యమని విమర్శిస్తున్నారు.

ప్రైవేటు ప్రతిభకే పట్టం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి విద్యార్థుల్ని ఆకర్షించాల్సిన ప్రభుత్వం.. ప్రతిభా అవార్డులకు కూడా కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులను ఎంపిక చేసి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని అవమానిస్తోంది. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, స్వయంకృషి, పట్టుదలతో మంచి మార్కులు సాధించే విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ప్రతిభ అవార్డుల్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఆ అవార్డుల ఎంపికలో కూడా కార్పొరేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్ని చిన్నచూపు చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
           స్వయంగా సొంత జిల్లా చిత్తూరులో మూడో వంతు ప్రతిభా అవార్డులు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల విద్యార్థులకే దక్కడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా అధికారులు పంపించిన జాబితాను తనిఖీ చేయాల్సిన పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా మొద్దునిద్ర పోతున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి ప్రతిభా అవార్డులతో ఏ ఉపయోగం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
          చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ప్రతిభా అవార్డుల్లో చాలావరకు ప్రైవేట్ విద్యార్థులకే ఇచ్చిన అధికారులు.. ఉన్న కొంతమంది ప్రభుత్వ విద్యార్థులకు కూడా సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యం వహించారు. ప్రతిభా అవార్డుకు అర్హత ఉన్న ఓ విద్యార్థి తండ్రి డీఈవో కార్యాలయానికి వచ్చి అవార్డు గురించి వాకబు చేసినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. ఆయన నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రతిభా అవార్డులు ఇస్తూ ప్రైవేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తే ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఇన్ పుట్ సబ్సిడీకి దిక్కులేదు

ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలు పండించే రైతుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోగా.. తర్వాతి పంటకు విడుదలైన ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. జిల్లాలకు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు.
            అనంతపురం జిల్లా ఇన్ పుట్ సబ్సిడీ కోసం రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తే.. మీకేం ఇబ్బందని నిలదీశారు. వారం రోజుల్లో ఇస్తామని జాయింట్ డైరక్టర్ చెప్పినా.. ఇలా చాలాసార్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అధికారులు రైతుల్ని మభ్యపెట్టడంలో చంద్రబాబును మించిపోయారని మండిపడ్డారు. రైతులపై ఎలాగో సర్కారుకు చిన్నచుపే కాబట్టి.. ఇచ్చినా.. ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు.
            అనంతపురం జిల్లాలకు 500 కోట్ల పైచిలుకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైందని, దీన్ని రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. చివరకు కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లో వేస్తామని తూతు మంత్రపు హామీ ఇచ్చారు. వారం రోజుల తర్వాతైనా రైతు ఎకౌంట్లో డబ్బు పడుతుందో లేదో అనుమానమేనని రైతు సంఘాలు నేతలు చెబుతున్నారు. 

Thursday, November 12, 2015

రెయిన్ గన్ రాజకీయం

సర్కారు నిధులు స్వాహా చేయడానికి అధికార పార్టీ నేతలు కొత్తదారులు వెతుకున్నారు. రైతుల పేరు చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయం మొదలుపెట్టారు. స్వయంగా సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రెయిన్ గన్లపై ఆసక్తి చూపకపోయినా.. ప్రత్తిపాటి మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రెయిన్ గన్లు రైతులకు సరఫరా చేస్తామని, దీంతో వర్షాభావం ఉన్నా మంచి దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
          ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. వరికి, పత్తికి ప్రస్తుత దశలో రెయిన్ గన్లతో ఉపయోగం లేదని, పైగా ఇప్పటికే పొట్ట దశలో ఉన్న వరి పంటపై రెయిన్ గన్లు ఉపయోగిస్తే.. రంగు మారి గిట్టుబాటు ధర కూడా రాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి అన్నీ తెలిసినా సదరు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడానికే హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
         ఆరు నెలల క్రితం ఇదే తరహాలో వరి బాగా పండించే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు డయ్యర్లు సరఫరా చేశారు. ధాన్యం ఎండబెట్టే యంత్రాలు అప్పట్లో ఉపయోగపడవని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా ప్రభుత్వంతో సబ్సిడీ కూడా ఇప్పించారు. అయినా రైతులు ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో సంబంధిత కంపెనీ నష్టపోతోందని చెప్పి.. వాటిని మార్కెట్ కమిటీలతో కొనిపించారు. ఇప్పటికి అవి అలంకార ప్రాయంగానే ఉన్నాయి. రెయిన్ గన్ల వెనుక కూడా ఇలాంటి రాజకీయమే ఉందని అధికారులు గుసగుసలాడుతున్నారు.