Tuesday, November 17, 2015

ఆక్వాపార్కుకు పోలీసుల వత్తాసు

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాపార్కు వద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఆందోళన చేస్తున్న కే.బేతపూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. పోలీసులతో గ్రామస్తులు తగాదాకు దిగడంతో.. ఎస్సై వచ్చి కానిస్టేబుళ్లను తీసుకెళ్లారు.
                 సామాన్యులను కాపాడాల్సిన పోలీసులు ఆక్వాపార్కు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ.. గ్రామంలో భయాందోళనలు కలిగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పకుండా.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇదంతా ఆక్వాపార్కు యాజమాన్యం ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు.
                  మరోవైపు ఆక్వాపార్కు నిర్మాణంపై ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు వివరణ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి కాలుష్య సమస్య రాదని నమ్మించే ప్రయత్నం చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే సీఎం రాలేదని చెప్పుకొచ్చారు. స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్తున్నారని, టీడీపీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్లు వస్తున్నాయి. 

Monday, November 16, 2015

సీఎం హామీలు నీటిమూటలే..!

ఎన్నికల్లో అవి చేస్తాం.. ఇవి చేస్తాం అని హామీ ఇవ్వడం.. గెలిచాక వాటిని మర్చిపోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ విద్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగాకులు ఎక్కువే చదివారు. తాను రాయలసీమ బిడ్డనని, ఆ గడ్డకు అన్యాయం చేయనని చెప్పుకునే చంద్రబాబు.. సీమకు ముఖద్వారం లాంటి కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోతోంది. ఇప్పటికి ఏడుసార్లు కర్నూల్లో పర్యటించిన సీఎం.. మొత్తం 51 హామీలు ఇవ్వగా.. కేవలం నాలుగు హామీలు మాత్రమే కార్యరూపం దాల్చడంపై విస్మయం వ్యక్తమౌతోంది.
                     కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, పరిశ్రమలు పెడతామని, పంచాయతీ రోడ్లు వేయిస్తామని, ఇలా నోటికొచ్చిన హామీలన్నీ బాబు ఇచ్చేశారు. అయితే కనీసం పంచాయతీ రోడ్లకు కూడా దిక్కులేదని కర్నూలు వాసులు లబోదిబోమంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయిన కర్నూలుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని నేతలు మొత్తుకుంటున్నా.. సర్కారులో మాత్రం చలనం రావడం లేదు.
             సీఎం హామీలకు అనుగుణంగా కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం, అక్కడ అవి పెండింగ్ పడటం రొటీనైపోయింది. కనీసం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నిధుల విడుదల చేయకపోవడంతో.. ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు మాత్రం హామీలు అమలుచేస్తున్నామని ఆత్మవంచన చేసుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. 

తోకముడిచిన తాండవాసురులు

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఇసుకాసురులు తోక ముడిచారు. తాండవ నదీగర్భంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజా క్షేత్రస్థాయి తవ్వకాలపై సాక్ష్యాలు ఇవ్వడంతో.. నివేదిక ఇవ్వాల్సిందిగా హైకోర్టు అధికారులను ఆదేశించింది. తనిఖీల కోసం అధికారులు వస్తున్నారని సమాచారం తెలిసిన ఇసుకాసురులు అక్కడ్నుంచి జారుకున్నారు.
                తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని రూరల్, తుని పట్టణ పరిధిలో తాండవ నది ప్రవహిస్తోంది. తాండవ నది రిజర్వాయర్ నుంచి అరవై ఐదు వేల మంది ప్రజలకు నీళ్లు అందుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి, పంటభూములు కోతకు గురవుతున్నాయి. అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో.. దాడిశెట్టి రాజా నేరుగా కోర్టును ఆశ్రయించారు.
             విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ ప్రాజెక్టు నుంచి తుని మీదుగా పెంటకోన వరకు తాండవ నది ప్రవహిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాండవ నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిందని చెబుతున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న పచ్చ చొక్కాలు.. సహజవనరులను కూడా వదలడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

తుంగభద్రకు సర్కారు తూట్లు

అనంతపురం జిల్లాకు వరప్రదాయిని అయిన తుంగభద్రా నది నీళ్లు తేవడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు. పెన్నహోబిలం డ్యామ్ నుంచి అదనపు వాటా సాధించడంలో విపలమైన జిల్లా టీడీపీ నేతలు.. హంద్రీ - నీవా ద్వారా వచ్చిన 2.3 టీఎంసీలతోనే జిల్లాలో చెరువులన్నీ నింపాలని అధికారులకు హుకుం జారీ చేశారు. అయితే జిల్లాలో మొత్తం 49 నుంచి 60 వరకు చెరువులున్నాయని, వీటన్నింటినీ నింపాలంటే కనీసం 5 టీఎంసీలు నీళ్లు కావాలని అధికారులు అంటున్నారు.
                   దివంగత నేత వైఎస్ హయాంలో పెన్నహోబిలం డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు పది టీఎంసీల నీళ్లు అదనంగా కేటాయించారు. అయితే చంద్రబాబు సర్కారు వైఎస్ ఇచ్చిన జీవోకు తూట్లు పొడిచి అనంతకు మొండిచేయి చూపింది. దీంతో హంద్రీ నీవా ద్వారా వచ్చే అరకొర నీటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడలేని అధికార పార్టీ పెద్దలు.. తమపై ఒత్తిడి తెస్తున్నారని అధికారులు వాపోతున్నారు.
              గతంలో ఓసారి 4.5 టీఎంసీలు ఇచ్చినా కూడా కేవలం 60 శాతం చెరువులే నిండాయి. అలాంటిది ఇప్పుడు 2.3 టీఎంసీల నీటితో అన్ని చెరువులు నింపడం సాధ్య కాదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలోనే టీడీపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. అయితే అధికార పార్టీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తోంది జనం మండిపడుతున్నారు. 

Sunday, November 15, 2015

చిలకలూరిపేటలో రేషన్ బియ్యం మాఫియా

రేషన్ పంపిణీలో అవకతవలకలు చెక్ పెడతామని ఈపాస్ విధానాన్ని అమలుచేస్తున్నఏపీ  సర్కారు.. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కితగ్గడం లేదు. పైగా ఈపాస్ విధానం వచ్చాక ఖజానాకు బోలెడు డబ్బు ఆదా అవుతోందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఇదంతా బూటకమేనని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడుతున్న అక్రమ బియ్యం నిల్వలు సర్కారును వేలెత్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బియ్యం మాఫియాకు కేంద్రస్థానంగా మారింది. 
               పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు... ఇలా జిల్లా ఏదైనా.. ఎక్కడ అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నా.. సరుకు మాత్రం చిలకలూరిపేట వ్యాపారులదే అని తేలుతోంది. ముందు కోస్తాలోని నాలుగు జిల్లాలకే పరిమితమన రేషన్ బియ్యం మాఫియా అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారుల అండతో.. రాయలసీమ జిల్లాలకు కూడా విస్తరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
                    చిలకలూరిపేటలో బియ్యం దందా నడుస్తోందని, దీనికి టీడీపీ నేతల దన్ను ఉందని రెవెన్యూ అధికారులకు తెలిసినా.. ఏమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారని విమర్శలున్నాయి. కొంతమంది అధికారులు కూడా నేతలతో చేతులు కలిపి పర్సంటేజీలకు అలవాటు పడటంతో.. ఇక దళారులు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి కొనసాగుతోంది. త్వరలో బియ్యం ధరలు పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నా.. సర్కారు మాత్రం అక్రమ రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయకుండా చోద్యం చూస్తోంది. 

అన్నమో రామచంద్రా..!

మధ్యాహ్న భోజన పథకం నిధుల కొరతతో అలమటిస్తోంది. మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మే నుంచి బిల్లులు విడుదల కాలేదని, పైగా పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా డబ్బులు పెంచలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నిధులు ఇచ్చినప్పుడే కొన్నిచోట్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడి పిల్లలను పస్తులించిన సందర్భాలున్నాయి. ఇక ఐదు నెలల నుంచి బిల్లులే రాకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
             సర్కారు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో పప్పు, సాంబారు తప్పనిసరి. అయితే ధరలు పెరిగిపోవడంతో.. నిర్వాహకులు బెల్లం అన్నం, పెరుగన్నంతో సరిపెడుతున్నారు. ఇక వారానికి రెండుసార్లు గుడ్డు వడ్డించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ గుడ్డు ధర కొండెక్కి ఐదు రూపాయలకు చేరుకోవడంతో.. ప్రస్తుతం నెలకు రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు.
                 బిల్లుల విడుదల, ధరల పెరుగుదల గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతమంది పిల్లల్ని బడి మానిపించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శలు వస్తున్నాయి.  

సర్కారు సౌజన్యంతో సంక్షేమ హాస్టళ్లు ఖాళీ

పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సర్కారు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చేరకపోయినా పట్టించుకోవడం లేదు. కనీసం విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో ఆరా తీసే తీరిక కూడా సీఎంకు గానీ, మంత్రులకు కానీ లేదు. అదేమంటే వాళ్లే చేరకపోతే మేమేం చేస్తామని అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు అధ్వాన్నంగా ఉండటమే కారణమని విద్యార్థులు చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
               సాధారణంగా సంక్షేమ హాస్టళ్ల సంఖ్య పంచాలని ఎప్పుడూ నిరసనలు జరుగుతూ ఉండేవి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పరిమితికి మించి ఉన్నారని కూడా గతంలో వార్తలు రావడం మామూలే. చాలా సందర్భాల్లో అధికారులు తామిక చేర్చుకోలేమని చేతులెత్తేశారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కరవు జిల్లా అనంతపురంలో పనుల్లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నా.. పిల్లల్ని మాత్రం వసతిగృహాల్లో చేర్చేందుకు ముందుకు రావడం లేదు.
                 వసతి గృహాల్లో పిల్లల చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపడం లేదని నిరసన వ్యక్తమౌతోంది. వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నా, చదువుకోకపోయినా ఒక్కటే అనేంతగా నాసిరకమైన ప్రమాణాలున్నాయి. విద్యార్థుల చదువులపై అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఆ మాత్రం దానికి తమ పిల్లల్ని ఎక్కడో దూరంలో ఉండే హాస్టళ్లలో చేర్పించడం ఎందుకని తల్లిదండ్రులు భావిస్తున్నారు.