Thursday, November 19, 2015

నిధులున్నా నీరసం

మహిళలకు తొలిసారి స్వయంసహాయ సంఘాలను పరిచయం చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో స్త్రీశక్తికి నిరాదరణ దక్కుతోంది. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన స్త్రీశక్తి భవానాల నిర్మాణం నాలుగేళ్లైనా అతీగతీ లేదు. పోనీ కాంగ్రెస్ వాళ్లు అవినీతి చేశారనుకున్నా.. కనీసం తమ హయాంలో అయినా పూర్తవ్వాలి కదా.. అంటే టీడీపీ నేతల దగ్గర సమాధానం లేదు.
                 పశ్చిమగోదావరి జిల్లాలో మండలానికొకటి చొప్పున స్త్రీశక్తి భవనాలు మంజూరయ్యాయి. ముందుగా భవనానికి 25 లక్షల చొప్పున కేటాయించారు. తర్వాత రేట్ల పెరగడంతో.. అదనంగా అన్ని భవనాలకు కలిపి 1.40 కోట్లు విడుదలయ్యాయి. అయితే పుష్కలంగా నిధులున్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ లోపించడంతో.. వారి ఇష్టారాజ్యం అయిపోయింది.
                ఏపీ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో అవినీతి మరింత పొంగి పొర్లుతోంది. అందర్నీ అవినీతిపరులని తిట్టే తెలుగు తమ్ముళ్లు.. తాము మాత్రం అవినీతి సామ్రాట్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. స్త్రీశక్తి భవనాల్లో సగం చోట్ల తుదిదశలో ఉండగా..  మిగతా చోట్ల మాత్రం పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు మొత్తుకుంటున్నా సర్కారు నిర్లక్ష్యం వహించడంతో.. స్త్రీశక్తి కాగితాలకే పరిమితమౌతోంది. 

కడపలో లిక్కర్ దందా

ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో ఖజానాకు చిల్లు పడటమే కాకుండా.. మద్యప్రియలు జేబుకు కూడా చిల్లు పడుతోంది. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేసి, ప్రైవేటు వారికి లీజుకు ఇవ్వడంతో.. వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎమ్మార్పీ ధరకు అమ్ముతామని చెప్పి, ఆమేరకు పన్నులు కడుతున్న వ్యాపారులు.. మద్యాపాన ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ భారీ లాభాలు కళ్లజూస్తున్నారు.
                 వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే దందా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడక్కడా తూతూమంత్రంగా దాడులు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు చేసే దోపిడీతో పోలిస్తే అధికారులు జరిమానాలు పదో వంతు కూడా కాదని సమాచారం.
             ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తేయడం వెనుక పచ్చచొక్కాలు కీలక పాత్ర పోషించిన సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లో కూడా చాలామంది వారి అనుయాయులేనని, అధికారపార్టీతో మనకు గొడవెందుకని అధికారులు కూడా కిమ్మనట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం షరామామూలుగా దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. 

Wednesday, November 18, 2015

సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డుకు గండి

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లకు కూడా గండిపడింది. అయితే కొన్ని రోడ్లకు సహజంగా గండి పడగా.. చాలాచోట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. గుంటూరు జిల్లా నగరం మండలంలో ఓ రోడ్డుకు పడిన గండి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎప్పుడో వేసిన రోడ్లకు గండి పడిందంటే అర్థముంది కానీ.. రెండు నెలల క్రితం గండి పడటమేమిటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
               నగరం మండల కేంద్రం నుంచి కారంకివారిపాలెం వెళ్లే దారిలో రెండు నెలల క్రితం బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఈరోడ్డు మార్గంలో మూడుచోట్ల మురుగుతూములున్నాయి. ఇవి ఉన్న చోట కల్వర్టులు నిర్మించాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే అధికారులు మాత్రం షరా మామూలుగా వారి సూచనలు పట్టించుకోలేదు. వారం రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండంతో.. బీటీరోడ్డులో మురుగుతూములు ఉన్నచోట.. రోడ్డు కోతకు గురై గండి పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
                   పంటకాలువపై అడ్డంగా చెట్లు వేసి కేవలం పాదచారులు మాత్రమే రాకపోకలు సాగించగలుగుతున్నారు. ఈ రోడ్డులో ఇంకా రెండుచోట్ల తూములున్నాయని, అక్క కూడా రోడ్డు కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ నియంత్రించలేకపోయినా.. కోరి విపత్తులను కొనితెస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 

కోర్టు చొరవతో కదలుతున్న డొంక

తూర్పుగోదావరి జిల్లా తాండవ నదిలో ఇసుకాసురులకు హైకోర్టు ఉత్తర్వులు షాకిచ్చాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇసుక దొంగలంతా గప్ చుప్ గా పరారయ్యారు. తాండవనదీ పరీవాహక ప్రాంతానికి వచ్చిన అధికారులు అక్కడేమీ కనిపించలేదు. అయితే మొత్తం 59 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వినట్లు నిర్థారించారు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు 24 లక్షల రూపాయలు సీనరేజీ చెల్లించాల్సి ఉండగా.. ఏమీ కట్టలేదని తేలింది.
      అయితే తనిఖీలకు వెళ్లిన అధికారులతో పాటు ఇసుక అక్రమాలకు వత్తాసు పలుకుతున్న నేతలు కూడా వెళ్లడం వివాదాస్పదమైంది. హైకోర్టు అధికారులు నివేదిక అడిగిన తరుణంలో.. నేతలు వారిని మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా అధికారులే మేనేజ్ చేయాలని పచ్చచొక్కాలు అధికారులను వేపుకుతింటున్నాయి.
         మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరుపై అధికార వర్గాల్లో నిరసన వ్యక్తమౌతోంది. అటు కోర్టు, ఇటు టీడీపీ నేతలు మధ్యలో తాము చస్తున్నామని మొత్తుకుంటున్నారు. గత కాంగ్రెస్ హయాం అవినీతి మయం అని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. హస్తం నేతలకే దిమ్మ తిరిగేలా ఇసుక దోచుకున్నారని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇసుకతో ఈరేంజ్ లో బిజినెస్ చేయొచ్చని అన్ని పార్టీలకు టీడీపీ నేతలు మార్గనిర్దేశం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

అనంతలో అంతులేని అవినీతి

నిప్పులాంటి మనిషిని అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాటలు ఒట్టిమాటలే అని తేలిపోతోంది. అనంతపురం జిల్లాలో అవినీతి జలగలు తాండవిస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. బాధ్యులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారుల అవినీతికి, పచ్చ చొక్కాల పర్సంటేజీలు తోడవడంతో వ్యవహారం గప్ చుప్ గా సాగిపోతోంది.
     అనంతపురం కార్పొరేషన్ డబ్బులో ప్రజాప్రతినిధులకు డీజిల్ పోయించినా, కస్తూర్బా స్కూళ్లలో వసతులు సరిగా లేవని ఫిర్యాదులు వచ్చినా, ఎంపీ నిధులతో షెడ్డు నిర్మించి కార్పొరేషన్ అధికారులు సొమ్ము చేసుకున్నా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో కుంభకోణాలు జరిగినా, వీటన్నింటికీ పక్కా సాక్ష్యాలున్నా తమ్ముళ్లు లైట్ తీసుకుంటున్నారు. సర్కారు కూడా ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది.
           కరవు జిల్లాగా పేరుబడ్డ అనంతపురంలోనే ఈ స్థాయి అవినీతి జరుగుతుంటే.. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితేంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.ప్రజోపయోగ కార్యక్రమాలకు డబ్బుల్లేవని బీద అరుపులు అరిచే ప్రభుత్వం.. అవినీతిని మాత్రం ఇష్టారాజ్యంగా ప్రోత్సాహిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

Tuesday, November 17, 2015

తెలుగు తమ్ముళ్ల రూటేవేరు

టీడీపీ సర్కారు హయాంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలపై కూడా ఆగడాలు మితిమీరుతున్నాయి. తప్పులు చేసిన అధికార పార్టీ నేతలను వెనకేసుకొస్తున్న సర్కారు.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా రోడ్డు వేయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యల్లేవు కానీ, ప్రజల పక్షాన పోరాడుతున్న ఎమ్మెల్యేలు కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
         గుడివాడ వైసీపీ ఆఫీస్ సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసులు కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొడాలి నానికి ఆఫీస్ ఓనర్ ఇచ్చిన గడువు ఇంకా ఉన్నప్పటికీ.. పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల ప్రోద్బలం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
             పేర్నినాని కూడా రాజధాని భూసేకరణ విషయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో తెలుగు తమ్ముళ్లపై ఆయన్ను టార్గెట్ చేశారు. మచిలీపట్నంలో మద్యం షాపుల్లో తనిఖీలకు వెళ్లిన అధికారులు.. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో నానిని అరెస్ట్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ సభల్లో భూసేకరణపై ఆందోళన చేయిస్తున్నారని పేర్నినానిపై కక్ష పెంచుకున్నారని వైసీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. 

బాక్సైట్ జీవో రద్దు తాత్కాలికమా..? శాశ్వతమా..?

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వాకలను నిలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా జీవో రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వకపోవడంతో పాటు.. పనులు ఆపేయాలని మాత్రమే సీఎం అన్నట్లు వార్తలు రావడంతో.. సందేహాలు మొదలయ్యాయి. జీవో రద్దు తాత్కాలికమా, శాశ్వతమా అని ఉద్యమకారులు చర్చించుకుంటున్నారు. 
                   ప్రస్తుతానికి పనులు ఆపేయాలని సీఎం ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యమ విజయమేనని, అయితే టీడీపీ సర్కారును నమ్మడానికి వీల్లేదని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఉద్యమ కమిటీ తీర్మానించింది. పైకి జీవో రద్దు చేశామని చెప్పి, ఏ అర్థరాత్రో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపే అవకాశం ఉందని అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తీర్మానించారు. 
                   ఏజెన్సీలో ఉన్న విలువైన బాక్సైట్ గనులపై కన్నేసిన బడాబాబులు సర్కారుపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారు. వీరికి కొందరు ప్రభుత్వపెద్దలు కూడా వత్తాసు పలుకుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉద్యమవేడి కారణంగా తవ్వకాలు నిలిపేసినా, పరిస్థితి సద్దుమణిగాక చూసుకుందామనే ధోరణిలో బడాబాబులు ఉన్నట్లు తెలుస్తోంది.