Monday, December 28, 2015

అనంతలో జలగరళం

మినరల్ వాటర్ పేరుతో అనంతపురం జిల్లాలో విక్రయిస్తున్న నీటిపై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిలో కరిగిన ఘన పదార్ధాల శాతం చాలా తక్కువగా ఉంటోందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులతో పాటు రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో పది మినహా మిగతా ప్లాంటులనన్నీ బీఐఎస్ అనుమతి లేకుండా వెలసినవే కావడంతో.. యథేచ్ఛగా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నాయి.

తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘనపదార్ధాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఉపయోగకరమైన పదార్ధాలను మనం నీటిద్వారానే గ్రహిస్తుంటాం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయి. సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికరమైన పదార్థాలు నీటిలో కలుస్తున్నాయి. హానికారకాలను తొలగించే ప్రక్రియలో వాడే ఫిల్టర్లు టీడీఎస్ లను నామమాత్రపు స్థాయికి తగ్గింస్తుండటం కొత్త సమస్యకు దారితీస్తోంది.

పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటికి వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం రసాయనాలు కలుపుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో ప్రయోగశాల ఉండాలని నిబంధనలు చెబుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పబ్లిక్ హెల్త్ అధికారులకు అన్నీ తెలిసినా.. చోద్యం చూస్తున్నారు. 

రొయ్యకు రోగం

 గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏపీలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు.

రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. అధికారులు కూడా సరిగ్గా సహకరించడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. 

Sunday, December 27, 2015

సర్దుబాట్లపై స్పష్టతేదీ?

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది.

 సర్దుబాటు బదిలీలకు సంబంధించి కృష్ణా జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది.  ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

 ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

బెజవాడ స్వచ్ఛ ర్యాంకెంతో?

స్వచ్ఛభారత్ మిషన్ సిటీ ర్యాంకింగ్ సర్వేకు రంగం సిద్ధం చేసింది. దేశంలో మొత్తం 75 నగరాలను ఎంపిక చేయగా ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు కార్పొరేషన్లను ఎంపిక చేశారు. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే ఏజెన్సీ జనవరి రెండో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. ఈక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు మూడు సర్కిళ్ల పరిధిలో 18 ప్రాంతాలను ఎంపిక చేశారు.

బహిరంగ మల, మూత్ర విసర్జన, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, వాణిజ్య కేంద్రాల్లో టాయ్‌లెట్స్ నిర్మాణం, ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లు పరిశుభ్రం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో చెత్త తరలింపు, బిహేవియర్ బేస్డ్ కమ్యూనికేషన్, పబ్లిక్ టాయ్‌లెట్స్ పరిశుభ్రత, మురికివాడల అభివృద్ధి, రవాణా అంశాలపై ప్రధానంగా సర్వే చేయనున్నారు. 18002672777 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అభిప్రాయాలను తెలియజేయవచ్చు.  వచ్చిన ర్యాంకింగ్ ఆధారంగా సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

విజయవాడలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఇంటింటి చెత్త సేకరణ 40 శాతానికి మించడం లేదు. 6,500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించగా స్థలాభావం కారణంగా 1,150 మాత్రమే నిర్మాణం చేశారు. కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహణ గాలికి వదిలేశారు. చెన్నై తరహాలో రాఘవయ్య పార్క్‌లో నిర్మాణం చేసిన నమ్మా టాయ్‌లెట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారు. ఈక్రమంలో నగరం ర్యాంకింగ్‌లో వెనుక బడుతోందనే భయం అధికారుల్ని వెంటాడుతోంది.

కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.

మహిళలకు ఇసుక్ రీచ్ లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అంగన్ వాడీలకు జీతాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంగన్ వాడీలను గతంలో గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు.. ఇప్పుడు వారి ఉద్యోగాలు తొలగిస్తూ.. జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంగన్ వాడీల ఉసురు తగిలే చంద్రబాబు గతంలో అదికారం కోల్పాయారని, ఈసారి కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

Friday, December 25, 2015

నాసిరకం చంద్రన్న కానుకలు..!


 
ఏపీ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్‌మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున  అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు.

ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్‌మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ చాలా ప్రాంతాల్లో సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు.




గొడ్డు చాకిరీకి బహుమానం తొలగింపా..?

రాష్ర్ట ప్రభుత్వం మహిళలు, రైతులు ఉసురు పోసుకుంటోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత  మాత్రం మంచిది కాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంగన్వాడీల చేత గొడ్డు  చాకిరీ చేయించుకుని వారు పడుతున్న కష్టానికి ఫలితం ఇవ్వలేదు సరికదా ఇప్పుడు వారిని విధుల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు.  ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించి వారిని విధుల్లోంచి తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు.   అంగన్వాడీలకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు నిలవాలని కోరారు.

ఆడవారిని కండతడి పెట్టించారని, వారి ఉసురుతో రాజకీయ పతనం తధ్యమని జోస్యం చెప్పారు.
మరోవైపు  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నిబంధనలు పెట్టి ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని, అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టం లేదా? లేక చెల్లించేందుకు డబ్బులు లేవా? అని బేబీనాయన ప్రశ్నించారు.. ఇన్ని నిబంధనలు మునుపెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పండించిన పంటను తీసుకోకపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కౌలురైతులకు కార్డులుండాలని, ఎకరాకు 25 క్వింటాళ్లే తీసుకురావాలనే నిబందన  పెట్టి వారికి ఇబ్బందులకు గురి చేస్తుండడం అన్నాయమన్నారు.   క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల గురించి పరిశీలన చేయాలన్నారు. నిబంధనలను సడలించి రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని  డిమాండ్ చేశారు.