Monday, December 28, 2015

మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటేది..?

సింగపూర్ సంస్థలు రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులను సింగపూర్ తో పాటు ఏపీ సర్కారు కూడా మరిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్డీఏ వెబ్ సైట్లో పొందుపరిచిన మాస్టర్ ప్లాన్ లో భూములిచ్చిన రైతులకు ఎక్కడ భూములిస్తారనే విషయంపై స్పష్టత లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని పరిధిలో తొమ్మిది నగరాలు వస్తాయని, వాటి వివరాలు సవివరంగా ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు అవసరమైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములకు  చోటు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూసమీకరణ అయ్యేదాకా రైతులు త్యాగధనులంటూ కీర్తించిన చంద్రబాబు.. ఇప్పుడు  మాస్టర్ ప్లాన్ కు గప్ చుప్ గా ఆమోదముద్ర వేశారని ఆరోపిస్తున్నారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు వరుసగా 125, 500, 1000 గజాల స్థలంలో ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, రైతులకు కేటాయించే స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తారనే విషయాల కోసం సీఆర్డీఏ వెబ్ సైట్ చూసిన రైతులకు నిరాశే మిగిలింది. మాస్టర్ ప్లాన్ ఆమోదించాక ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం.. రైతులను నట్టేట్లో ముంచే ప్లాన్ లో ఉన్నట్లుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment