Tuesday, December 8, 2015

మామూళ్ల మత్తులో కల్తీ గాలికి..

విజయవాడలో కల్తీ మద్యం ఐదుగురి ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో.. ఎక్సైజ్ అధికారులు తనిఖీల పేరుతో ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. నిజానికి ఎక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారో, ఎలా కల్తీ చేస్తున్నారో పోలీస్, ఎక్సైజ్ అధికారులు అందరికీ తెలుసు. అయితే ప్రతి నెలా ఐదో తేదీ నాటికి రెండు శాఖలకు మామూళ్ల కవర్లు వెళ్లిపోవడంతో.. నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు.
        ఏపీ తాత్కాలిక రాజధానిలో అనుమతి లేని బార్లు, వైన్ షాపులకు లెక్కేలేదు. అనుమతి ఉన్న వాటిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ముఖ్యంగా మూడు సిండికేట్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధికార పార్టీ నేతల బార్ల జోలికి అస్సలు వెళ్లని పోలీసులు.. ఇతర బార్ల నుంచి మామూళ్లు తీసుకుని గమ్మునుంటున్నారు.
      చాలా బార్లలో మందుబాబులకు మత్తెక్కగానే.. చీప్ లిక్కర్ పోసేసి ఖరీదైన మద్యమే పోశామని నమ్మిస్తున్నారు. మరికొన్నిచోట్ల మత్తు కోసం మంచినీళ్లలో మిథైల్ ఆల్కహాల్ కలుపుతున్నారు. ఇక మరికొంతమంది అతితెలివి ప్రదర్శిస్తూ ఒడిషా, జార్ఖండ్ నుంచి నాన్ డ్యూటీ మద్యం తెచ్చి.. లూజులో విక్రయిస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు.. సాధారణంగా మత్తులో జోగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు.

No comments:

Post a Comment