Wednesday, December 16, 2015

కాల్ మనీ కేసులో డాబుసరి దాడులే..!



వందల్లో వ్యాపారులు.. కోట్ల విలువైన ఆస్తుల తాలూకు పత్రాలు.. వేల సంఖ్యలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు.. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల్లో దొరుకుతాయని ఆశించిన పోలీసు పెద్దలకు నిరాశే మిగిలింది. పోలీసు దాడుల్లో ఆశించిన పత్రాలు, వ్యక్తులు పట్టుబడకపోవడంపై  అంతర్మథనం చెందుతున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పరారయ్యారా? లేక దాడుల సమాచారాన్ని అధికారులు లీకు చేశారా? అనే అనుమానాలు పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.

పటమట పంట కాల్వ రోడ్డులోని యలమంచిలి రాము ముఠా కాల్‌మనీ ముసుగులో సెక్స్ దందా నిర్వహించడంపై నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. అప్పు ఇచ్చిన ముసుగులో చట్ట వ్యతిరేక దందాకు దిగుతున్న ముఠాల ఆటకట్టించాలని నిర్ణయించుకొని ప్రత్యేక బృందం ద్వారా కాల్‌మనీ వ్యాపారుల సమాచారం సేకరించారు. రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా నగరంలో నిర్వహించిన దాడుల్లో పోలీసు పెద్దలు ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పట్టుబడిన ఆస్తుల విలువ రూ.500 కోట్లు కూడా ఉండదని అధికార వర్గాల సమాచారం. వేలకోట్లలో ఆస్తులు పట్టుబడతాయని భావించిన అధికారులకు ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు.


దాడుల విషయం ముందుగానే లీకైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పోలీసు దాడులు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఇంట్లో కనిపించిన కాల్‌మనీ వ్యాపారులు ఉదయానికల్లా ఎలా మాయమయ్యారనేది స్థానికుల ప్రశ్న. ముందస్తు సమాచారం లేకుంటే వెళ్లడం సాధ్యపడదనేది పలువురిలో నెలకొన్న అభిప్రాయం. కొన్ని దాడులు మొక్కుబడిగా జరిగినట్టు చెపుతున్నారు. దొరికిన డాక్యుమెంట్లలో కొన్నింటిని స్వాధీనం చేసుకొని మిగిలినవి వదిలేసి వచ్చారనేది బాధితుల ఆరోపణ.


No comments:

Post a Comment