Monday, November 30, 2015

ఉపాధ్యాయులకు సర్కారు వాత

ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హడావిడిగా టీచర్ల బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ.. తమ తప్పును ఉపాధ్యాయులను నెత్తికి రుద్దేసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీలు జరిగాయి కాబట్టి ఆ ఉపాధ్యాయులందరికీ వేతనం నిలిపేయాలని ఖజనాకు ఉత్తర్వులందాయి. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు చూసి ఉపాధ్యాయులు విస్తుబోతున్నారు.
          శాఖల మధ్య సమన్వయ లేమికి ప్రభుత్వం భాద్యత వహించాలి గానీ, నిబంధనల ప్రకారం బదిలీ అయిన తమకు జీతం ఆపేయడమేమిటని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెల జీతాలు ఆగిన నేపథ్యంలో జీతాలు వచ్చేవరకు టీచర్లు స్కూళ్లకు వెళతారా.. లేదంటే నిరసన తెలుపుతారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
         అర్థసంవత్సర పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో సర్కారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం బాగాలోదేని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అనుమతి తీసుకోకపోతే.. విద్యాశాఖ ఇప్పుడైనా ఫైల్ ఖజానాకు పంపించవచ్చని, అదేమంత పెద్ద తప్పిదం కాదని, ఏదో ఓ సాకు చూపి జీతాలు ఆపాలనే ఇలా చేస్తున్నారేమోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకే సుఖం లేదు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం మాటేమో గానీ.. ఉద్యోగులకే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా అందరూ సుఖమైనదిగా భావించే ప్రభుత్వోద్యాగాన్ని కూడా పచ్చచొక్కాలు ప్రత్యక్ష నరకంగా మార్చేశారు. తమదైన రాజకీయ పద్ధతుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం, ఎదురుతిరిగిన వారిని శంకరగిరిమాన్యాలు పట్టించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
          సాక్షాత్తు సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే గత ఏడాది కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. గతంలో కూడా ఉద్యోగ వ్యతిరేక సీఎంగా ముద్రపడ్డ చంద్రబాబు. ఇప్పుడు మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు చేయడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పినా.. ఉన్నతాధికారులు వేధిస్తున్నారని వాపోతున్నారు.
          టీడీపీ హయాంలో అధికార పార్టీ అండ చూసుకుని కొందరు ఉన్నతాధికారులు కూడా రెచ్చిపోవడం అనవాయితీ అయిపోయింది. సీఐలు ఎస్సైలను బూతులు తిట్టడం, ఎస్సైలు కిందిస్థాయివారిపై కోపం చూపించడం, రెవిన్యూ శాఖలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లు, కారుణ్య నియామకాల కోసం అడిగితే దారుణమైన మాటలు ఇవన్నీ చిత్తూరు జిల్లాలో కామన్ సీన్. సీఎం ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే టీడీపీకి సొంత జిల్లాలో ఘోర పరాభవం తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

కలెక్టర్ కు షాకిచ్చిన జన్మభూమి కమిటీ

ఏపీలో అధికార పార్టీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు ఎంత బాగా పనిచస్తున్నాయో అనంతపురం జిల్లా కలెక్టర్ సాక్షిగా బట్టబయలైంది. వికలాంగుడికి పించన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీకి.. ఆధార్ కార్డు లేదని అద్భుతమైన సాకు చూపించింది. ఓవైపు కోర్టులు ఆధార్ తప్పనిసరి కాదని చెబుతున్నా అధికారులు మాత్రం ఒంటెత్తుపోకడ పోతున్నారనడానికి ఇదే నిదర్శనం.
          అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమానికి ఓ వికలాంగుడు హాజరయ్యాడు. కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్న వికలాంగుడు.. తనకు ఆధార్ లేదని పెన్షన్ నిలిపేశారని ఫిర్యాదు చేశాడు. వికలాంగుడు మరుగుజ్జు కావడంతో అతడ్ని తన టేబుల్ పై కూర్చోబెట్టుకున్న కలెక్టర్.. ఆన్ లైన్ లో ఎంపీడీవోతో మాట్లాడి ఆరా తీశారు. ఆధార్ ను కూడా నమోదు చేయించారు. ఇకపై ఏ ఇబ్బంది ఉన్నా తన దగ్గరకు రావాలని సూచించారు.
      అయితే వికలాంగులందరూ కలెక్టర్ కు వస్తారా, వచ్చినా కలెక్టర్ తో మాట్లాడే వీలు చిక్కుతుందా అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఏవో ఒక్క కేసు చూసి కలెక్టర్ న్యాయం చేస్తే సరిపోదని, జిల్లావ్యాప్తంగా జన్మభూమి కమిటీల బాగోతం ఇలాగే ఉందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. పచ్చచొక్కాల పైత్యం ముదరక ముందే కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటే కలెక్టర్ కు కూడా ముప్పు తప్పదనే సంగతి బహిరంగ రహస్యమే.

Sunday, November 29, 2015

పోర్టుపై ప్రైవేటు పెత్తనం

ఏపీలో జలరవాణాకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న సర్కారు.. ఆ సాకుతో ప్రైవేటువారికి ఆధిపత్యం కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పోర్టులో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు, కార్మికుల పొట్ట కొట్టడానికి కూడా ప్రణాళిక సిద్ధమైపోయింది. కేంద్రం చట్టం, రాష్ట్రం పాలసీ రెండూ అమల్లోకి వస్తే ఇక పోర్టులో కార్మికుల గతి అథోగతే అవనుంది.
       విశాఖ పోర్టులో ఇన్నర్, అవుటర్ హార్బర్లున్నాయి. వీటిలో మొత్తం 24 దాకా బెర్త్ లు ఉన్నాయి. విదేశాల్లో నౌకారవాణా 40 శాతం ఉంటే.. మన దేశంలో 7 శాతమే ఉంది. రోడ్డు రవాణాతో పోలిస్తే సగం ఖర్చుకే నౌకారవణా సాధ్యామౌతుంది. ఈ సాకుతో కేంద్ర పోర్టు ట్రస్టు చట్టానికి సవరణ చేసి, పోర్టులను ట్రస్టుల మాదిరి కాకుండా కంపెనీలుగా మార్చాలని ప్లాన్ చేస్తోంది.
       పోర్టులు కంపెనీలుగా మారితే ప్రైవేటు వారి గుత్తాధిపత్యం పెరిగి కార్మికుల ఉపాధికి గండి పడుతుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా పోర్టులు అభివృద్ధి అయ్యే మాట నిజమే అయినా.. ప్రజలతో సంబంధం లేని అభివృద్ధి ఎవరి కోసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. యంత్రాలతోనే అభివృద్ధి పనులు చేసి, కొందరు పెద్దలు బాగుపడటానికి సర్కారే చట్టసవరణ చేయడం శోచనీయమని విమర్శలు వస్తున్నాయి.

లైన్లో ఉండకపోతే పస్తులే

మధ్యాహ్న భోజన పథకంలో కొత్ పద్ధతులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైంది. పలు స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్నెంట్ అందుబాటులో లేదన్న వాస్తవాన్ని గుర్తించకుండా విద్యార్థుల హాజరు రోజుకు రెండుసార్లు ఆన్ లైన్లో నమోదు చేయాలనడం వివాదాస్పదమైంది.
            విజయనగరం జిల్లాలో మొత్తం మూడు లక్షల నలభై వేల మంది విద్యార్థులుండగా.. వారిలో 2.9 లక్షల మంది వివరాలు ఆన్ లైన్లో నమోదయ్యాయి. వీరిలో ఎనభై వేల మంది ప్రైవేట్ విద్యార్థులు, మిగతా వారు ప్రభుత్వ విద్యార్థులు. ఇంకా యాభైవేల మంది విద్యార్థుల వివరాలు అధికారులు నమోదు చేయలేదు. వీరంతా మధ్యాహ్న భోజన పథకానికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
            యాభై వేల మంది ఇరవై వేల మంది ప్రైవేట్ విద్యార్థులు కాగా. మిగతావారు ప్రభుత్వ విద్యార్థులు. ప్రభుత్వ విద్యార్థులకు నిబంధన ప్రకారం మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయాలి. అయితే సర్కారు అలసత్వం అధికారుల బాధ్యతారాహిత్యంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా స్కూళ్లలో ఉపాధ్యాయులే ఈ వివరాలు నమోదు చేయాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది.

పశువులకు మందుల కొరత

కరవుతో అల్లాడుతున్న రైతులకు పాడిపరిశ్రమ కూడా దన్నుగా నిలవలేకపోతోంది. పశువులకు వైద్యం చేయించాల్సిన సర్కారు.. డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఏపీలోని కడప జిల్లాలో పశువు కాపరుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పేరుకు పశువుల ఆస్పత్రులు చాలానే ఉన్నా.. అక్కడ సిబ్బంది మాత్రం ఉండటం లేదు.
           జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మినహా మిగతా చోట్ల పశువుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోగాలతో అల్లాడి పశువులు ప్రాణాలు కోల్పోతున్న సర్కారు చోద్యం చూస్తోంది. చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్నా మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో లేవు. ఇవి రెండూ ఉంటే వైద్యసిబ్బంది సొంత పనులు చేసుకుంటూ పశువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
            అధికారులను అదిలించాల్సిన సర్కారు కూడా సాధ్యమైనంత అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. పశుసంవర్థక శాఖలో అమల్లో ఉన్న వివిధ పథకాలకు మంగళం పాడింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది. రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని చెబుతున్న ఏపీ సర్కారు.. తాను చేయాల్సిన పనులు మాత్రం గాలి కొదిలేస్తోందని విమర్శలు వస్తున్నాయి. 

Saturday, November 28, 2015

పచ్చ చొక్కాలు.. మధ్యలో ఓ ఎస్పీ

గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ వ్యవహారశైలితో జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ముదిరాయి. రూరల్ ఎస్పీ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాటలకే విలువ ఇస్తున్నారని, జిల్లా మొత్తం ఆయన పెత్తనమే సాగుతున్నప్పుడు.. ఇక తాము ఎమ్మెల్యేలుగా ఎందుకని మిగతా నేతలు వాపోతున్నారు. వీరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ జయదేవ్ తోడుకావడంతో.. పంచాయతీ సీఎం వద్దకు చేరింది.
           దాచేపల్లిలో పేకాట క్లబ్ నడుస్తోందన్న సమాచారం తెలుసుకున్న మంత్రి.. తమ నియోజకవర్గంలో కూడా పేకాట క్లబ్ కు అనుమతి కోరారు. మంత్రి అయ్యుండి పేకాట క్లబ్ కు ఎలా అనుమతి అడుగుతారని ఎస్పీ ప్రశ్నించడంతో.. దాచేపల్లి సంగతేంటని మంత్రి ప్రశ్నించారు. దీంతో ఎస్పీ జిల్లాలోని పేకాట క్లబ్ ల వ్యవహారాన్ని సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. అసలు పేకాట క్లబ్బులన్నీ మూసేయాలని చంద్రబాబు ఆదేశించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
       చిన్నబాబు లోకేష్ అండతోనే యరపతినేని చెలరేగిపోతున్నారనేది టీడీపీ వర్గాల మాట. యరపతినేని మాటే వినాలని జిల్లా పోలీసులకు లోకేష్ మౌఖికమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేకాట క్లబ్ మూసివేత నిర్ణయం కూడా లోకేష్ దృష్టికి వెళ్లిందని, త్వరోలనే దాచేపల్లి పేకాట క్లబ్ మళ్లీ తెరుచుకుంటుందని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే సీఎం చంద్రబాబు అయినా.. లోకేష్ సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

చేనేత రుణమాఫీకి సవాలక్ష ఆంక్షలు

రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతల్ని అపహాస్యం చేసేలా నిబంధనలు విధించిన ఏపీ సర్కారు.. తాజాగా నేతన్నలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చేనేత రుణమాఫీ ఊసెత్తని బాబు సర్కారు.. ఇప్పుడు బ్యాంకులకు విడుదల చేసిన మార్గదర్శకాలు చూసి చేనేత కార్మికులకు కళ్లు తిరుగుతున్నాయి.
        చేనేత కార్మికుడు ఇప్పటికీ అదేవృత్తిచేస్తుండాలని, చనిపోయిన కార్మికుడికి రుణమాఫీ వర్తించదని, అతడి కుటుంబంలో డ్వాక్రా, వ్యక్తిగత రుణాలు తీసుకున్నా చేనేత మాఫీ వర్తించదని కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లె, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో యాభై వేల మంది చేనేత కార్మికులున్నారు.
        సర్కారు తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం తొంభై శాతం మందికి రుణమాఫీ కాదని అధికారులు తేల్చేస్తున్నారు. అయితే సర్కారు రూల్స్ పై చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగాన్ని దివాళా తీయించిన సర్కారు.. ఇప్పుడు రుణమాఫీ నిబంధనల పేరుతో మరోసారి నేత కార్మికుల జీవితాలను అపహాస్యం చేస్తోందని మండిపడుతున్నారు.

సంక్షేమానికి చెదలు

ఏపీలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిబ్బంది ఏటా పదవీ విరమణ చేస్తున్నా కొత్తవారిని నియమించకుండా.. సర్కారు కాలయాపన చేస్తోంది. కనీసం వర్కర్లను కూడా తీసుకోకుండా కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తూ మమ అనిపించడంతో.. హాస్టళ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి.
         ప్రతి హాస్టల్ కు వార్డెన్, వర్కర్, ఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి. కానీ 90 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంతో.. ఉన్నవాళ్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సాధారణంగానే వార్డెన్లు వాళ్లిష్టమైనప్పుడు హాస్టళ్లకు వెళుతుంటారు. అలాంటిది అదనపు బాధ్యతలంటే ఎంత బాగా పర్యవేక్షిస్తారో బహిరంగ రహస్యమే.
         హాస్టళ్లో పిల్లలకు ఆరోగ్య సమస్యలున్నాయా, ఫీజు రీయింబర్స్ మెంట్ వస్తోందా లేదా. స్కాలర్ షిప్పుల సంగతేంటి.. అని పట్టించుకునే వారే కరువయ్యారు. కాంట్రాక్టు వర్కర్లు కావడంతో వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా పనిచేస్తున్నారు. వీరిపై పర్యవేక్షణ కొరవడటంతో. విద్యార్థులు నష్టపోతున్నారు. సర్కారు తీరుపై హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Friday, November 27, 2015

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని

ఏపీ సర్కారు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఓవైపు రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తామని మాటలు చెబుతుంటారు. మరోవైపు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు మాత్రం పూర్తిచేయరు. నెల్లూరు జిల్లాలో భారీవర్షాలు కురిసినా ఆ జిల్లాకు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి ఉంది. సర్కారుకు, అధికారులకు ముందుచూపు లేకపోవడంతో యాభై టీఎంసీల నీరు సముద్రం పాలైంది.
       నెల్లూరు జిల్లాలో పది రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరో అల్పపీడనం రెడీగా ఉంది. జిల్లాలో స్వర్ణముఖి, సంగం, పెన్నా బ్యారేజీలు ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో ఏది పూర్తైనా కనీసం 15 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అయితే పదేళ్లుగా నడుస్తున్న సంగం బ్యారేజీ పనులు కూడా పూర్తికాకపోవడం పాలకుల నిర్యక్ష్యమేనని బహిరంగ విమర్శలు వస్తున్నాయి.
         కనీసం ప్రాజెక్టులు పూర్తికాకపోయినా.. తొలివిడత వరదను బట్టి నీళ్లు నిల్వచేయాలనే ఆలోచన కూడా అధికారులు చేయలేదు. ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అడ్డుపట్టి రింగ్ బండ్ లు ఏర్పాటుచేస్తే కనీసం కొంతైనా నీరు నిల్వ ఉండేది. అయితే అధికారులు మాత్రం ఇసుక బస్తాల మాటే మరిచిపోయారు. మొత్తం మీద సర్కారు, అధికారులు కలిసికట్టుగా భారీ వర్షాల వల్ల నెెల్లూరుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా జాగ్రత్తపడ్డారు. 

ఒంగోలులో అవినీతి మొక్కలు

నీరు చెట్టు కార్యక్రమం కింద మొక్కలు పెంచమని సర్కారు చెబితే.. అధికారులు మాత్రం అవినీతి మొక్కలను బాగా పెంచారు. పరిపాలనపరమైన అనుమతులకు, వచ్చిన మొక్కలకు పొంతన లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారుల బాగోతం.. ఇప్పుడు ఎంపీడీవోల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
        ప్రకాశం జిల్లాలో నీరుచెట్టు కార్యక్రమం కింద భారీగా మొక్కలు కొనుగోలు చేశారు. అన్నీ కడియం నర్సరీల నుంచి టెండర్ల ద్వారా తీసుకున్నారు. అయితే రైతు కడియం వెళ్లి మొక్క తెచ్చుకుంటే రవాణా ఛార్జీలతో కలిపి.. పదకొండు రూపాయలే అవుతుండగా.. అధికారులు మాత్రం ప్రతి మొక్కకూ పదమూడు రూపాయలు చెల్లిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడిన అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎక్కువధర చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
         ఆరేళ్ల క్రితం జరిగిన వనమహోత్సవంలో అవినీతి బయటపడటంతో.. విజిలెన్స్ విచారణ జరిగి ఎంపీడీవోలకు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఉపాధి హామీ ఫీల్డ్ స్టాఫ్ ను తొలగించారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటౌతుందని ఎంపీడీవోలు తలపట్టుకుంటున్నారు. అధికారులు రాజకీయ నేతల అండతో తప్పించుకుంటారని, ఏ అండా లేని తామే బలవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

క్యాష్ బ్యాక్.. సర్కారు సరికొత్త ఆఫర్

ప్రభుత్వ పాఠశాలలకు ఏపీ సర్కారు సరికొత్త స్కీమ్ ప్రకటించింది. పాఠశాలల్లో వాడని డబ్బులు ఉంటే వెనక్కిచ్చేయాలని కోరింది. ఏటా నిధులివ్వాల్సిన సర్కారు డబ్బులివ్వకపోగా.. ఉన్న నిధులు వెనక్కిచ్చేయమంటోందేమిటని ప్రధానోపాద్యాయులు లబోదిబోమంటున్నారు. సంక్షేమ రాజ్యం తెస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏలుబడిలో ఇలాంటి చోద్యాలకు కొదవేలేదు.
            ప్రభుత్వ పాఠశాలలకు మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఏటా యాభై వేల రూపాల నగదు ఇవ్వాలి. అయితే గత సంవత్సరం కేవలం నలభై ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. యాభై వేల రూపాయల్లోకూడా 75 శాతం కేంద్రనిధులు కాగా.. 25 శాతం నిధులు రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంది. స్కూళ్లకు డబ్బులు ఎగ్గొట్టిన సర్కారు.. గత ఏడాది నిధులను చాలా పాఠశాలల వాడుకోలేదని గమనించి అవి ఇచ్చేయమని కోరుతోంది.
              ఇచ్చిన నిధుల్లో ఇరవై ఐదు వేలు ప్రయోగశాలలకు, పరికరాలకు ఉపయోగించుకోవాలి. పదివేలు పత్రికలు, లైబ్రరీపుస్తకాలకు ఉపయోగించాలి. మరో పదిహేను వేలు మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించాలి. అయితే చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఏమీ చేయకుండా నిధుల్ని మురగబెడుతున్నారు. దీంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్టవేశాయి. ఇప్పుడు సర్కారుకు కూడా అలాంటివారిని ప్రోత్సహిస్తూ నిధులు వెనక్కివ్వమనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Thursday, November 26, 2015

రోడ్డు మేసేశారు

50 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు నెలల వ్యవధిలో నిర్మించిన రోడ్డు.. నాలుగు రోజుల వర్షానికే రంగు వెలిసిపోయింది. గతంలో కచ్చారోడ్డు ఉన్నా వాహనాలైనా తిరిగేవని, ఇప్పుడు పాదచారులు కూడా నడవలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి సమీపంలో రెండు ఎస్సీ కాలనీలకు వేసిన రోడ్డు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
        సాధారణంగా రోడ్డువేసేటప్పుడు మూడు లేయర్లలో మట్టి, కంకర, చిప్స్ వేయాలి. ప్రతి లేయర్ పూర్తయ్యక పూర్తిస్థాయిలో చదును చేయాలి. గ్రావెల్ కూడా నాణ్యమైనది అయ్యుండాలి. సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజినీర్లు రోడ్డు నిర్మాణం ప్రతి దశలోనూ పర్యవేక్షించాలి. ఇక్కడ ఆ పర్యవేక్షణ కరవవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమైపోయింది.
          మొదటి లేయర్ చిప్స్, రెండో లేయర్ కంకర వేసి, మూడో లేయర్ లో ఎర్ర గ్రావెల్ వేశారు. అయితే ఎర్రగ్రావెల్ నాణ్యత లేదని అధికారులు గుర్తించి కొంత మార్పించినా.. అది కూడా నాణ్యమైనది వేయాలి. ప్రతి లేయర్ కు రోలింగ్ చేయకుండా.. అంతా పూర్తయ్యాక చదును చేశారు. అందుకే మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు అంతా మట్టికొట్టుకుపోయి బురుదమయంగా మారింది. 

చెకింగ్ లకు చెక్

రవాణాశాఖ తనిఖీ కేంద్రాల్లో సిబ్బంది సరికొత్త దందాకు తెరలేపారు. రోజువారీ తనిఖీలు, వసూళ్లు తలనొప్పి ఎందుకని, నెలవారీ మామూళ్లు మాట్లాడేసుకున్నారు. దీంతో చెక్ పోస్టుల్లో అధిక లోడ్ తో వెళ్లే వాహనాలు, వాహనాల్లో ఏ సరుకు ఉందో కూడా తనిఖీ చేయకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా పంచలింగాల, డోన్ చెక్ పోస్టుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది.
            చెక్ పోస్టుల వల్ల రవాణా సిబ్బంది ఆశాఖ కమిషనర్ ఆదేశాలను కూడా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవాణాశాఖ అవినీతిపై ఫిర్యాదులు వెెల్లువెత్తడంతో ఇంటెజలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో విచారణలో మొదలైనట్లు తెలుస్తోంది. అయితే నెలవారీ మామూళ్లు కేవలం రవాణా శాఖ అధికారులకే కాదని, అందులో అధికార పార్టీ నేతలకూ వాటాలు ఉంటాయని కొంతమంది చెబుతున్నారు.
         చెక్ పోస్టుల వద్ద పనులు సరిగ్గా జరగడం లేదన్నవారు.. అక్కడ ఉండే సౌకర్యాలు, సిబ్బందిపైనా దృష్టిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇద్దరు అధికారులు, ఇద్దరు హోంగార్డులు చేయాల్సిన పని ఒకే అధికారి ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చెక్ పోస్టుల్లో వేబ్రిడ్జి సదుపాయం లేకపోవడంతో ఏ వాహనం ఎంత లోడ్ తో వెళ్తుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారుతోంది. 

రైతు బంధుతో ఫలితం శూన్యం

మార్కెట్ కమిటీలు రాజకీయ పునారావాస కేంద్రాలుగా మారాయి. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేవరకు మార్కెట్ యార్డుల్లో నిల్వచేయడానికి సదుపాయం ఉండాలి. నిల్వ చేసిన ధాన్యంపై రైతు బంధు పథకం కింద నామమాత్రపు వడ్డీకి రుణాలివ్వాలి, కానీ పచ్చచొక్కాల పుణ్యమా అని రైతు బంధు పథకం కూడా తెలుగుతమ్ముళ్ల మయమైపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న కృష్ణా జిల్లాలో కూడా పథకం తప్పుదోవ పడుతోంది.
            మార్కెట్ కమిటీల పరిధిలో ఆరు నుంచి ఏడు మండలాలు ఉంటున్నాయి. మార్కెట్ కమిటీ ఏర్పాటు సమయంలో మండలాలను పరిగణలోకి తీసుకుంటున్న సర్కారు.. తర్వాత ఛైర్మన్, కార్యదర్శితో పని జరిపించేస్తోంది. వీరు సభ్యులను సంప్రదించకుండా ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. దీంతో చాలామంది లబ్ధిదారులకు రైతుబంధు పథకం అందడం లేదు.
              కృష్ణా జిల్లాలో కేవలం రెండు వేల మంది రైతులకే రైతుబంధు పథకం కింద రుణం అందుతోంది. వీరు కూడా అధికారపార్టీలో ప్రాబల్యం ఉన్న బడారైతులు, భూస్వాములే అనేది బహిరంగ రహస్యం. అదేమంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులను ఉద్ధరిస్తామని గొప్పలు చెబుతున్న సర్కారు ఆచరణ ఎంత బాగుందో మార్కెట్ యార్డులను చూస్తే అర్థమాతోంది. 

Wednesday, November 25, 2015

టెన్త్ విద్యార్థులకు ఆన్ లైన్ తిప్పలు

సంక్షేమ పథకాల అమలులో అట్టడుగున ఉన్న ఏపీ సర్కారు.. విద్యార్థులను మాత్రం పీడిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆన్ లైన్లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని నిబంధన పెట్టింది. అయితే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు లేవు. కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో వీరంతా నెట్ సెంటర్ల ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు భారం అని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
           ఆన్ లైన్ అప్లికేషన్ కు ప్రతి స్కూల్ కు ఇచ్చిన యూజర్ నేమ్ నే పాస్ వర్డ్ గా ఇచ్చి వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. అయితే బయట ఇంటర్నెట్ సెంటర్లో.. అప్లికేషన్ కు పది రూపాయలు, ఫోటో, సైన్ స్కానింగ్ కు ఇరవై రూపాయలు చొప్పున మొత్తం ముప్ఫై రూపాయలు ఖర్చవుతోంది. అయితే ఇదే అదనుగా కొంతమంది టీచర్లు అదనపు మొత్తం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
       ఇంటర్నెట్ సెంటర్లు పట్టణాల్లోనే ఉన్నాయి. పల్లెల్లో అరకొరగా ఉన్నా.. అక్కడ నెట్ కనెక్ట్ అవదు. అయినా ఎప్పుడు పనిచేస్తుందో దేవుడికే తెలియాలి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులే ఉంటారు కాబట్టి.. వీరికి ఆన్ లైన్ భారంగా మారింది. అయితే ఆఫ్ లైన్లోనూ అప్లికేషన్లు ఇవ్వచ్చని అధికారులు చెబుతున్నా.. దీనిపై ప్రచారం మాత్రం చేయడం లేదు. మొత్తం మీద ఈసారి టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయకముందే చుక్కలు కనిపిస్తున్నాయి. 

పిఠాపురంలో పచ్చ చిచ్చు

ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం కత్తులు దూసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వర్మ ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవల మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశం మీదా ఎంపీ, ఎమ్మెల్యే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతున్నారు.
           గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్మకు పిఠాపురం టికెట్ ఇవ్వకపోవడంతో.. స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిన వర్మ.. మొదట్లో ఎంపీ తోటతో బాగానే ఉన్నారు. వర్మ ఒంటెత్తు పోకడలు నచ్చక కొంతమంది నేతలు తోట పంచన చేరడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఎన్నికల్లో తనకు సహకరించకుండా.. టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వానికి సహకరించిన సొసైటీ అధ్యక్షుల్ని వర్మ టార్గెట్ చేసి, పదవి పోయేలా చేశారు. దీంతో వివాదం మరింత రాజుకుంది.
           చివరకు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా వర్మే చక్రం తిప్పుతున్నారు. తోట కూడా అధిష్ఠానం వద్ద ఏమీ చేయలేకపోవడంతో.. ఏలేరు పరిధిలో పిఠాపురం సాగునీటి సంఘాల ప్రాతినిథ్యం తగ్గించారు. అయినా సరే ఏమాత్రం తగ్గని వర్మ.. ఏకంగా పిఠాపురం మున్సిపాల్టీ వ్యవహారాల్లో వేలు పెడుతూ.. తోటకు తలనొప్పిగా మారారు. తోట అనుచరుడైన మున్సిపల్ ఛైర్మన్ ఎప్పటికప్పుడు వర్మకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే గొడవలతో టీడీపీ శ్రేణులు కూడా రెండుగా చీలిపోయాయి. 

పాఠశాలలు.. నరకానికి నకళ్లు

ఏపీలో పాఠశాలలు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నా.. అధికారులు లంచాలు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులిస్తున్నారు. చిత్తూరు జిల్లాపీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో స్కూలు పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం పాలైంది. అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యం అలక్ష్యంతో నిండు నూరేళ్ల జీవితం గడపాల్సిన చిన్నారి కన్నుమూసింది.
             గుర్రంకొండలో ఇండియన్ పబ్లిక్ స్కూల్లో అప్సర అనే చిన్నారియూకేజీ చదువుతోంది. క్లాస్ రూంలో పాఠాలు చదువుతుండగా. ఉన్నట్లుండి పైకప్పు కూలింది. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే పైకప్పు కూలి నేరుగా అప్సర తల మీద పడటంతో.. బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించినా.. చికిత్స చేస్తుండగానే అప్సర మరణించింది.
            అధికారులు సరిగ్గా తనిఖీలు చేయకుండా శిధిల భవనాల్లో స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. కలెక్టర్ సెలవు ప్రకటించినా స్కూల్ ఎందుకు నడుస్తుందో యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ స్కూళ్లే నయమని ఎంతో ఆశతో చదివిస్తున్న తల్లిదండ్రులకు.. అధికారుల నిర్లక్ష్యం తీరని శాపంగా మారింది. 

చంద్ర మహాదశ ఫలితాలు

చంద్ర మహాదశలో పలు శుభఫలితాలు ఉంటాయి. పశు సంపద, తల్లికి సుఖము, శుభకార్యములు, ఉత్సవములు, ఉద్యోగము, భాగ్యవృద్ధి, విద్యాలాభము, నిధినిక్షేపాలు, స్త్రీధనం, సుగంధ ద్రవ్యాలు, పట్టువస్త్రాలు, ఆరోగ్యం, గృహనిర్మాణం, వాహనములు, సత్పురుషులతో సహవాసము, ఇంటిలో కళ్యాణము, ధార్మిక చింతన, ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి, భూమి సంపాదన, పాడి పంటల వృద్ధి మొదలైనవి చంద్ర మహాదశలో చంద్రుడికి పూర్ణబలం ఉన్నప్పుడు శఉభస్థానములలో శుభగ్రహ దృష్టి కలిగి ఉన్నప్పుడు కలుగుతాయి.

              అశుభ ఫలితాల విషయానికొస్తే.. వాతపైత్య సంబంధ రోగములు, ఉదర రోగములు, భార్యకు రోగములు, మాతృవర్గానికి బాథలు, సేవకుల వలన బాథలు, దుష్ట సహవాసము, దుష్టకార్యాల్లో ఆనందం, మందబుద్ధి, రోగబాధలు, ఉద్యోగ బాథలు, ధన నష్టం, సోదరులకు దుఃఖము, శత్రుపీడలు, బంధునాశము, సుఖహీనత, తల్లివలన క్లేశములు, బుద్ధిహీనత, చలి జ్వరము మొదలైనవి చంద్ర మహాదశలో చంద్రుడు పాపులతో కలిసినప్పుడు కలుగుతాయి. క్షీణ చంద్రుడై శుభగ్రహయుతి ఉన్న ఈ బాథలు సాధారణంగానే ఉంటాయి.  

Tuesday, November 24, 2015

అప్రెంటీస్ వ్యవస్థపై సర్కారు మోజు

ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో ప్రవేశపెట్టిన అప్రెంటీస్ వ్యవస్థను మళ్లీ తీసుకురావడానికి ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. డీఎస్సీ పరీక్షలు ముగిసి ఆరు నెలలు గడిచినా తుదిఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. కోర్డు కేసుల నేపథ్యంలో ఆలస్యం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మెరిట్ అభ్యర్థులను విద్యా వలంటీర్లుగా తీసుకోవాలని సర్కారు ఆలోచన చేసినట్లు తెలియడంతో డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
              గతంలో చంద్రబాబు హయాంలో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను రెండేళ్లపాటు వలంటీర్లుగా నియమించేవారు. అప్పుడు వారికి 1200, 1500 రూపాయలు మాత్రమే వేతనం చెల్లించేవారు. అప్రెంటీస్ షిప్ పూర్తిచేసుకున్నవారికే ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చేవారు. అయితే ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పోరాటంతో 2008 డీఎస్సీ నుంచి ఈ వ్యవస్థ రద్దైంది. ఇప్పుడు మళ్లీ అప్రెంటీస్ వ్యవస్థకు పురుడు పోసే ప్రయత్నం సరికాదని డీఎస్సీ అభ్యర్థులు హితవు పలుకుతున్నారు.
            అప్రెంటీస్ షిప్ వద్దంటూ మంత్రి గంటాకు సోషల్ మీడియా ద్వారా వినతులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏకకాలంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడాలని చూస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. కోర్టులో విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో విద్యా వంలటీర్ల ఆలోచన కుట్రేనని మండిపడుతున్నారు. 

నష్టం అపారం.. అరకొరగా పరిహారం

పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా అస్తవ్యస్తం అయింది. జిల్లా వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. అయితే రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు.. కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రులు చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన కుదరదడం లేదంటున్నారు.
             చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల ధాటికి అరవై వేల ఎకరాలు నీట మునిగాయి. ఐదు వేల ఎకరాల్లో ఉద్యానపంటలు నాశనమయ్యాయి. ఆరు వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. ఇంత జరిగినా అధికారులెవరూ క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. కనీసం గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోలేదు. వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్, గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ జల్లడం వంటివి కూడా చేయలేదు.
            చిత్తూరు జిల్లాలో వరదలను సమర్థంగా ఎదుర్కున్నామని కలెక్టర్ ప్రకటిస్తున్నా.. రైతులు మాత్రం తమకు దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందు గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు.. గ్రామాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఎవరికీ ఏమీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చామని చెప్పుకోవడం ఫ్యాషనైపోయిందని మండిపడుతున్నారు. 

అనంత జడ్పీలో స్తబ్ధత

అనూహ్యంగా అనంతపురం జడ్పీ ఛైర్మన్ పదవి దక్కించుకున్న చమన్ కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయన ముళ్లకిరీటం నెత్తిమీద ఉన్నట్లే ఫీలవుతున్నారు. పైగా పార్టీ ఒప్పందం ప్రకారం కేవలం రెండున్నరేళ్లే చమన్ పదవిలో ఉంటారు. ఇప్పటికే పద్దెనిమిది నెలలు గడిచాయి. ఇంకా పన్నెండు నెలలు మాత్రమే వ్యవధి ఉంది. అయితే జడ్పీకి రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో.. ఎవరూ ఏ పనులు అడిగినా చేయలేని పరిస్థితిలో చమన్ ఉన్నారు.
               జడ్పీలకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపేయడంతో.. రాష్ట్రానికి కేటాయించే నిధులను జడ్పీకి మళ్లించాలని చమన్, జిల్లా మంత్రులను కోరారు. ఇంతవరకూ దానికి అతీగతీ లేదు. మొన్న రెండు కోట్ల రూపాయల నిధులు వచ్చినా అవి సిబ్బంది జీతాల ఖర్చుకే సరిపోయాయని అంటున్నారు. మంత్రులెవరూ తనకు సహకరించకపోవడంతో జడ్పీ సమావేశాల్లో ప్రతిపక్షానికి కూడా జవాబు చెప్పుకోలేకపోతున్నామని చమన్ లోలోపల మథనపడుతున్నారు.
            జిల్లా మంత్రి పరిటాల సునీత కూడా చమన్ ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. చమన్ ఎదిగితే చేయి దాటి పోతాడని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన చమన్. సాయం చేయమని సునీతను అడిగినా ఆమె స్పందిండం లేదు. దీంతో మరింత స్తబ్ధుగా మారిన చమన్.. ఎక్కువగా బెంగళూరు, అమరావతిలో రియల్ ఎస్టేట్ చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. అధికార పార్టీ ముఠా తగాదాల్లో జిల్లా ప్రజలకు నష్టం జరుగుతోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Monday, November 23, 2015

రైతులకు సర్కారు వెన్నుపోటు

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కూడా వెన్నుపోటు పొడుస్తోంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొంటామన్న అమాత్యుల హామీలు నీటిమూటలయ్యాయి. రైతుల దగ్గరకు వెళ్లి ఆర్భాటంగా హామీలిచ్చిన మంత్రులు,, ఐకేపీ కేంద్రాలకు మాత్రం ఉత్తర్వులివ్వకుండా చేతులు దులుపుకున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాలు చేతులెత్తేస్తున్నాయి. చేసేది లేక తక్కువ ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు.
              పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో ధాన్యం తడిసిందని అంచనా. జిల్లా మంత్రి పీతల సుజాత, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి సర్కారే కొంటుందని హామీ ఇచ్చారు. సర్కారు లెక్క ప్రకారం బస్తా ధాన్యానికి కామన్ వెరైటీ అయితే 1057 రూపాయలు చెల్లించాలి. అయితే ఐకేపీ గైర్హాజరీలో మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగి కేవలం 810 రూాయలే చెల్లిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు.
           తేమశాతం, వర్షాలను సాకుగా చూపి ధర తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అయితే మిల్లర్లు, దళారులు కుమ్మక్కై కేవలం 15 శాతం తేమ వరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఇష్టం వచ్చిన ధర కడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే అసలు ధాన్యమే కొనమని బెదిరిస్తున్నారు. వేరే దిక్కులేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్భాటపు ప్రకటనలు మాని, పని చేసి చూపించాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాజధాని రైతుల చెవిలో నారాయణ పువ్వు

రాజధాని భూసమీకరణలో హల్చల్ చేసిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తర్వాత పత్తా లేకుండా పోయారు. భూములిస్తే అవిస్తాం.. ఇవిస్తాం అని ఊదరగొట్టి.. ఇప్పుడు కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భూములిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ముప్ఫై లక్షల రూపాయలు ఇప్పిస్తామని నమ్మబలికారని, ఇప్పుడు పైసా విడుదల కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
             చరిత్రలో ఎక్కడా జరగని విధంగా భూసమీకరణ చేశామని గొప్పలు చెప్పుకున్న సర్కారు.. భూములిచ్చిన రైతుల్ని నిండా ముంచింది. భూసమీకరణ జరిగినన్ని రోజులూ రైతుల చుట్టూ తిరిగిన మంత్రులు, అధికారులు ఇప్పుడు వారెవరో తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. భూసమీకరణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రి నారాయణ రేయింబవళ్లు గ్రామాల్లో పర్యటించి రైతులకు అనేక హామీలు ఇచ్చారు.
          రాజధాని ప్రాంతాల్లో అత్యున్నత మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రతి ఇంటికీ ఎల్ ఈడీ బల్బులు అందజేస్తామని ఊదరగొట్టారు. అందర్నీ నమ్మించడం కోసం కొన్నిచోట్ల అప్పటికప్పుడు పనులు చేయించారు. అయితే ఎప్పుడైతే భూసమీకరణ పూర్తైందో.. అప్పట్నుంచి రాజధాని రైతుల్ని పట్టించుకోవడం మానేశారు. అధికారులు కూడా మంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకపోతే వ్యతిరేకత వస్తుందని స్థానిక టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

లేటరైట్ మైనింగ్ అంతా రాంగే

తూర్పుగోదావరి జిల్లా వంతాడ పరిసరాల్లో లేటరైట్ మైనింగ్ పై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మైనింగ్ జరుగుతోందని నిర్థారించారు. గిరిజనులకు సంబంధించిన 94 ఎకరాలపై లీజులు రద్దు చేయాలని కమిటీ అధికారులకు సూచించింది. గతంలో రెండుసార్లు ఆదేశాలిచ్చినా ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
      లేటరైట్ అక్రమ మైనింగ్ తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పీఏసీ గుర్తించింది. లీజుకు తీసుకున్న భూమిలో ప్రభుత్వ అనుమతిప్రకారం 12 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దాన్ని 60 అడుగులకు విస్తరించాలని, అనుమతులకు విరుద్ధంగా ఉన్న రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల సర్వేలో తప్పుల దొర్లాయని, గ్లోబల్ పొజిషనింగ్ విధానం ద్వారా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులకు కమిటీ సూచించింది.
            ఇక లేటరైట్ మైనింగ్ కారణంగా తామంతా కాలుష్యం బారిన పడుతున్నామని స్థానికుల పీఏసీ దృష్టికి తెచ్చారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లేటరైట్ మైనింగ్ కారణంగా రావికంపాడు వద్ద రైల్వేగేటు 18 గంటలపాటు మూసి ఉంచడంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వానికి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కమిటీ హెచ్చరించింది. మరోవైపు లేటరైట్ అక్రమాల వెనుక పచ్చతమ్ముళ్లు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Sunday, November 22, 2015

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించడం కోసం ఏపీలో ఇసుక రీచ్ లు డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరగవని రాష్ట్ర ప్రజలు భావించారు. అయితే డ్వాక్రసంఘాలకు అప్పగించడం వెనుక అధికార పార్టీ నేతల జేబులు నింపే మతలబు ఉందని ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. సాక్షాత్తూ సీఎం అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఇసుక రీచ్ లోనే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
          గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని పెనుమాక రీచ్ లో అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. ఇక వే బిల్లులూ, గీ బిల్లులూ జాన్తానై అంటున్నారు. రాత్రి పూట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారు. పగలైతే దిశమార్చేసి పనులు కానిస్తున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
        డ్వాక్రసంఘాల పేరుతో ఇసుక రీచ్ లు నిర్వహణ ఉత్తర్వులు రాగానే.. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ డ్వాక్రాసంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పేరు డ్వాక్రసంఘాలది, ఆదాయం తమది అనే విధంగా దందా నడిపిస్తున్నారు. ఇసుక సీనరేజ్ ఛార్జీలు, వే బిల్లులకు తిలోదకాలు వదిలి జేబులు నింపుకోవడమే పనిగా పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నారు. సీఎం అధికార నివాసం సమీపంలో భారీ వాహనాలకు భద్రత పేరుతో రాత్రిపూట అనుమతి లేదు. కానీ ఇసుక లారీలకు మాత్రం రాచబాట పరచడం చూస్తుంటే.. ఇందులో పెద్దతలకాయలకు కూడా హస్తముందని అనుమానాలొస్తున్నాయి. 

కొండంత నిర్లక్ష్యం

వడ్డీకాసుల వాడికి నిలువుదోపిడీ సమర్పించే భక్తుల ప్రాణాలకు మాత్రం నిలువ నీడ లేకుండా పోతోంది. టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. తిరుమల రెండో ఘాట్ రోడ్డును ప్రమాదాలకు కేంద్రంగా మార్చింది. ఈ రోడ్డులో ఏడో కిలోమీటర్ నుంచి పదహారో కిలోమీటర్ వరకు తరచుగా కొండరాళ్లు విరిగిపడుతున్నా.. తగిన మరమ్మతులు చేయడంలో అధికారులు అలక్ష్యం ప్రదర్శించారు.
            రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పదిహేనే కిలోమీటర్ దగ్గ భాష్యకార్ల సన్నిధి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డును మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సరిగ్గా కొండచరియలు విరిగిపడిన స్థలంలోనే సరైన రీతిలో మరమ్మతులు చేయాలని గతంలో నిపుణులు సూచించినా అధికారులు పట్టించుకోలేదు.
             2003లో భాష్యకార్ల సన్నిధి వద్ద పటిష్ఠమైన ఘాట్ రోడ్డు  నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. అప్పుడే గ్రౌట్, యాంకరింగ్ పద్ధతుల్లో పనులు చేయాలని నిపుణులు చెప్పినా.. అధికారులు పట్టించుకోలేదు. కోట్ల రూపాయలు ఖర్చౌతుందనే సాకుతో.. పనులుచేయని ఫలితం ఇప్పుడు భక్తులు అనుభవిస్తున్నారు. దేవుడి పేరుతో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న టీటీడీ ఘాట్ రోడ్డు పటిష్ఠతపై చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం కూడా తగిన పర్యవేక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు. 

ఊరూరా బెల్టు షాపులు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో బెల్టుషాపులు రద్దుచేస్తూ సీఎం చంద్రబాబు ఫైల్ పై సంతకం చేశారు. అందుకు తగ్గట్లుగానే తొలినాళ్లలో కాస్త హడావిడి చేసిన ఎక్సైజ్ అధికారులు.. బెల్ట్ షాపులను మూయించేశారు. అయితే క్రమంగా మద్యం దందా పచ్చ తమ్ముళ్ల చేతికి రావడంతో.. మళ్లీ బెల్ట్ షాపుల ప్రవాహం మొదలైంది. అనంతపురం జిల్లాలో కరవున్నా.. మద్యానికి మాత్రం లోటులేకపోవడం అధికార పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
           ఎక్సైజ్ దందాలో అధికారులకు కూడా నెలవారీ మామూళ్లు అందడంతో వారు కూడా చూసీచూడనట్లు పోతున్నారు. ఈ మామూళ్ల దందా కోసం మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల చీప్ లిక్కర్ పై ప్రభుత్వం పన్నులు తగ్గించి.. ఖరీదైన మద్యంపై పెంచింది. అయినా సరే ఎక్కడా చీప్ లిక్కర్ ధర తగ్గించి అమ్మడం లేదు. పాత రేటునే కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
          పల్లెల్లో కూలీనాలీ చేసుకునే జనం పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్లి తాగలేరు. బెల్టుషాపులు రద్దుచేస్తే వీరు మందుపై ఖర్చు మిగిలి, కుటుంబాలకు ఆదా అవుతుంది. ఈ ఉద్దేశంతో బెల్ట్ షాపులు రద్దుచేస్తామని గతంలో చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఊళ్లల్లో మద్యం ఏరులై పారుతోంది. బాబొచ్చినా బెల్టు తీయలేదని సెటైర్లు పడుతున్నాయి.  

Saturday, November 21, 2015

అంగన్ వాడీలను విభజించు పాలించు

ఏపీలో అంగన్ వాడీల ఉద్యమంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్న సర్కారు.. ఇప్పుడు మరో జిత్తులమారి ఎత్తుగడ వేసింది. అంగన్ వాడీల కోసం టీడీపీకి అనుబంధంగా యూనియన్ ఏర్పాటుచేస్తున్నామని ఆపార్టీ కార్యకర్తలు ఊదరగొడుతున్నారు. అంగన్ వాడీల జీతాలు పెంచుతామని ఇప్పటికి రెండుసార్లు ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు.. ఇంతవరకూ జీవో ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని, ఇప్పుడు యూనియన్ పేరుతో చీలికలకు కుట్ర చేస్తున్నారని అంగన్ వాడీలు మండిపడుతున్నారు.
            అంగన్ వాడీలు మొదట్నుంచీ బాబును నమ్మడం లేదు. కారణం ఆయన గత చరిత్రే. 2000వ సంవత్సరంలో బాబు అధికారంలో ఉండగా హైదరాబాద్ లో నిరసన తెలిపిన అంగన్ వాడీలను బూటుకాళ్లతో తొక్కించి, గుర్రాలతో తొక్కించారు. తర్వాత వారిని మదర్స్ కమిటీకి అప్పగిస్తూ.. జీతాలు పెంచకుండా మీనమేషాలు లెక్కబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్ వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వయోపరిమితి అరవై ఏళ్లకు కుదించి అర్థంతరంగా చాలా మందిని పీకి పారేశారు.
            మహిళల పట్ల తమ పార్టీకి మించిన గౌరవం మరెవరికీ లేదని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. సాక్షాత్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సభలో నిరసన తెలిపిన 15 మంది అంగన్ వాడీల ఉద్యోగాలు పీకేశారు. అసెంబ్లీ సాక్షిగా అంగన్ వాడీల జీతాలు పెంచుతామని చెప్పి మాట తప్పారు. దీన్ని బట్టి నేను మారానని చంద్రబాబు చెప్పుకున్న మాటలు బూటకమేనని తేలిపోయిందని అంగన్ వాడీలు భావిస్తున్నారు. యూనియన్ పేరుతో కొత్త కుట్రలకు తెరతీస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. 

ఆమ్యామ్యా ఇస్తేనే అనుమతులు

రాజకీయ చైతన్యం మెండుగా ఉండే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో.. అవినీతి తాండవిస్తోంది. పురపాలక సంఘంలో పైసలిస్తేనే ఫైలు కదిలే పరిస్థితి ఉంది. పదేళ్ల క్రితం బందరు మున్సిపాల్టీలో ఇధ్దరు అధికారులు ఏసీబీకి చిక్కడం సంచలనం సృష్టించగా.. ఇప్పుడు మళ్లీ ఏవో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.
             ఇక మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ అధికారుల రూటే సెపరేటు. అడిగినంత ఆమ్యామ్యా ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా భవనాలకు పర్మిషన్ ఇవ్వడం, లంచం ఇవ్వకపోతే అన్నీ సరిగ్గా ఉన్నా అనుమతులు ఇవ్వకపోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తూ పాలకమండలి సభ్యులతో సిఫారసు చేయించుకున్నా.. లంచం ఇవ్వందే అనుమతులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అయితే ఈ బాగోతంలో అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయనే వాదన ఉంది.
            ఇక జిల్లాలో వెయ్యికి పైగా డ్వాక్రా సంఘాలున్నాయి. డ్వాక్రా సంఘాలకు ఏటా వంద కోట్ల వరకు బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఈ రుణాల మంజూరు చేయాలంటే మెప్మా సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవాలి. లక్షకు వెయ్యి నుంచి పదిహేను వందల చొప్పున పట్టుబట్టి వసూలుచేస్తున్నారు. బందరు మున్సిపాల్టీ అవినీతి బాగోతంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా టీడీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 

చేయూతలో కోత

ఆపదలో అన్నదాతను ఆదుకోవడానికి సర్కారుకు చేతులు రావడం లేదు. కనీసం బీమా సంస్థపై ఒత్తిడి తెచ్చి పరిహారం ఇప్పించడానికి కూడా మనసొప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల దెబ్బకు సర్వం కోల్పోయిన అన్నదాతలకు.. బీమా సంస్థ పరిహారంలో కోత పెడుతోంది. కొన్నిచోట్లైతే అసలు పరిహారమే ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. పరిహారాన్ని నిర్థారించే కమిటీల్లో టీడీపీ నేతలకు చోటు దక్కడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
                సవరించిన పంటల బీమా పథకం ప్రకారం విపత్తుల సమయంలో తక్షణ పరిహారంగా ఇరవై ఐదు శాతం పరిహారం చెల్లించాలి. తర్వాత పూర్తిస్థాయి నిర్థారణ జరిగాక గ్రామం యూనిట్ గా తీసుకున్నప్పుడు.. మిగతా పరిహారాన్ని చెల్లించాలి. ఇవీ ఉన్న మార్గదర్శకాలు. తర్వాత కూడా ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పరిహారం ఇచ్చినా.. రైతు నుంచి తిరిగి వసూలు చేయకూడదని నిబంధనలున్నాయి.
             కానీ బీమా సంస్థలు రైతుల నుంచి వసూలు చేసే ప్రీమియంలు మాత్రం పెంచుతూ.. విపత్తులు వచ్చినప్పుడు ముఖం చాటేస్తున్నాయి. గతంలో నీలం, హుదూద్, హెలెన్ తుపానులప్పుడు 25 శాతం తక్షణ పరిహారాన్ని ఎగ్గొట్టిన సంస్థలు.. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాయి. అదేమంటే పనల మీద ఉండే పంటకు పరిహారం తర్వాత వస్తుందని.. ఇప్పుడు రాదని కుంటిసాకులు చెబుతున్నారు. పరిహార నిర్ధారణ కమిటీలో అధికార పార్టీ నేతలు ఉన్నా.. బీమా సంస్థపై ఒత్తిడి తేవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

Friday, November 20, 2015

మంత్రి రావెలకు రాపిడి ఎక్కువైంది

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుకు గుంటరు జిల్లాలో అసమ్మతి సెగ తగులుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల పరిధిలో మంత్రి వ్యతిరేక వర్గం జోరు పెంచింది. త్వరలో జరగబోయే టీడీపీ జనచైతన్య యాత్రలకు మంత్రి ఎలా వస్తారో చూస్తామని ఎంపీపీ సవాలు విసరడం రావెలపై రాజుకుంటున్న అసమ్మతికి అద్దం పడుతోంది.
              మంత్రి వ్యవహారశైలిపై నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోనూ నిరసన వ్యక్తమౌతోంది. మంత్రికి అనుకూలంగా ఉన్న ఆయన అనచురులు కూడా మంత్రి వైఖరిపై పెదవి విరుస్తున్నారు. ఎన్నికల హామీలేవీ నెరవేర్చడం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే.. అసలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు వ్యతిరేక వర్గం తమకు అనుకూలంగా మంత్రి ఉండటం లేదన్న కోపంతో ఉంది.
             ఎంపీడీవో బదిలీ, మండల పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వంటి అంశాల్లో రావెల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. దీంతో గతంలో జడ్పీటీసీగా ఉండి ఇప్పుడు జడ్పీ ఛైర్మన్ గా జానీమూన్ కూడా మంత్రికి దూరమయ్యారు. జానీమూన్ మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినట్లు వింటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మంత్రి రావెల వచ్చే ఎన్నికల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. 

బొండు ఇసుకనూ బొక్కేస్తున్న తమ్ముళ్లు

ఎందుకూ పనిరాని బొండు ఇసుకతో కూడా కోట్లు సంపాదించవచ్చని తెలుగు తమ్ముళ్లు నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమాలకు తెరతీసిన టీడీపీ నేతలు.. తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర తీరాన్ని కూడా మింగేస్తున్నారు. తీర ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నా.. తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. వీరికి అధికారులు సహకరించడంతో పని తేలికైపోతోంది.
                కోస్తాలో తుఫాన్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో తీరప్రాంత పరిరక్షణ చాలా అవసరం. తీరాన్ని సహజసిద్ధంగా ఉన్న పరిస్థితులకు ఏమాత్రం భంగం కలిగించినా..ముప్పు తప్పదు. కాకినాడ సముద్ర తీరం పరిధిలో యథేచ్ఛగా బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో సముద్రానికి చేరువలో లోతైన గుంటలు ఏర్పడుతున్నాయి. ఈ గుంటలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రమాదకరంగా మారతాయని, అప్పుడు ముంపు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
              నిజానికి బొండు ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. కానీ ప్రస్తుతం ఇసుక రేటు చుక్కలను అంటుతున్న నేపథ్యంలో.. బొండు ఇసుకను పునాదుల్లోనూ, ఇసుక కల్తీ చేయడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. లోడు బొండు ఇసుక ధర 2500 నుంచి 3000 వరకు పలుకుతోంది. దీంతో ఇసుక తవ్వకాల ద్వారాకోట్ల రూపాయలు వెనకేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. 

వరద నష్టంపై సర్కారు కాకిలెక్కలు

వరదను ముందుగా అంచనా వేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమైన సర్కారు.. కనీసం వరదనష్టం అంచనాలు వేయడంలో కూడా విఫలమైంది. ఏపీలో వారం రోజులుగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లా అస్తవ్యస్తమైంది. జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలుగు గంగ కాల్వకు గండిపడి నీరు వృథాగా పోతోంది, పీలేరు నియోజకవర్గంలో మేడిపల్లి జలాశయానికి కూడా గండి పడింది.
             క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను గుర్తించని అధికారులు జిల్లా కేంద్రం చిత్తూరులో కూర్చుని పంటనష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. కనీసం గ్రామాల్లో తిరిగి వివరాలు తీసుకున్న నాథుడే లేడు. ఎకరాకు ముప్ఫై నుంచి ముప్ఫై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు పంట నష్టపోయి లబోదిబోమంటున్నారు. అియితే అధికారులు మాత్రం కాకిలెక్కుల తయారుచేసి సర్కారుకు పంపారు.
                  దెబ్బతిన్న ఇళ్లు, చనిపోయినవాళ్లు, పంటనష్టం ఇలా అన్ని అంశాల్లోనూ వాస్తవానికి విరుద్ధంగా అధికారుల లెక్కలున్నాయి. అధికారుల లెక్కలు చూసిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు సాయం చేయకపోగా.. వచ్చే సాయాన్ని కూడా రానీయకుండా అంచనాలు తారుమారుచేశారని మండిపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పుకోవడమే కానీ, తమ గురించి ఆలోచించేవారెవరూ లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Thursday, November 19, 2015

కమీషన్లు మింగి.. కూలీల కడుపు కొట్టి

పథకం ఏదైనా అది అంతిమంగా అధికార పార్టీకే లబ్ధి చేకూరుస్తోంది. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులే అందుకు ఉదాహరణ. ఉపాధి హామీ పనులను నామినేటెడ్ పద్ధతిలో చేజిక్కించుకున్న నేతలు.. కూలీలతో పనులు చేయించకుండా.. అర్థరాత్రి యంత్రాలతో పని కానిస్తున్నారు. తనిఖీలు జరపాల్సిన పంచాయతీరాజ్ ఇంజినీర్ కూడా వీరితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.
              విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి, కొండలావేరు పంచాయతీ పరిధిలో అరవై లక్షల రూపాయల విలువైన రోడ్డు కాంట్రాక్టును మండల స్థాయి టీడీపీ నేత నామినేటెడ్ పద్ధతిన దక్కించుకున్నారు. మొత్తం టెండర్ విలువలో పదిశాతం కమీషన్ కొట్టేసిన ఈ నేత.. దాన్ని మరో ఇద్దరు గ్రామస్థాయి నేతలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చాడు. దీంతో తక్కువ నిధులతో పని కానిచ్చేద్దామనుకున్న నేతలు కూలీలతో చేయాల్సిన పనులు కూడా యంత్రాలతో చేసేస్తున్నారు.
             మొత్తం బాగోతాన్ని పత్రికలు ఫోటోలతో సహా బయటపెట్టడంతో అధికారులు అప్రమత్తమై పనులు ఆపించేశారు. కూలీల మస్తర్ల నమోదు కానీ, పే ఆర్డర్ జనరేట్ చేయడం కానీ ఏమీ లేకుండానే పనులన్నీ జరిగిపోతున్నాయని విచారణలో తేలింది. ప్రొక్లెయిన్ తో రోడ్డు తవ్విన ఆనవాళ్లు కూడా లభించాయి. దీంతో మరింత లోతుగా విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. అయితే పచ్చతమ్ముళ్ల చేతికి మట్టి అంటకుండా అధికారులే కాపు కాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిధులున్నా నీరసం

మహిళలకు తొలిసారి స్వయంసహాయ సంఘాలను పరిచయం చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో స్త్రీశక్తికి నిరాదరణ దక్కుతోంది. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన స్త్రీశక్తి భవానాల నిర్మాణం నాలుగేళ్లైనా అతీగతీ లేదు. పోనీ కాంగ్రెస్ వాళ్లు అవినీతి చేశారనుకున్నా.. కనీసం తమ హయాంలో అయినా పూర్తవ్వాలి కదా.. అంటే టీడీపీ నేతల దగ్గర సమాధానం లేదు.
                 పశ్చిమగోదావరి జిల్లాలో మండలానికొకటి చొప్పున స్త్రీశక్తి భవనాలు మంజూరయ్యాయి. ముందుగా భవనానికి 25 లక్షల చొప్పున కేటాయించారు. తర్వాత రేట్ల పెరగడంతో.. అదనంగా అన్ని భవనాలకు కలిపి 1.40 కోట్లు విడుదలయ్యాయి. అయితే పుష్కలంగా నిధులున్నా.. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ లోపించడంతో.. వారి ఇష్టారాజ్యం అయిపోయింది.
                ఏపీ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో అవినీతి మరింత పొంగి పొర్లుతోంది. అందర్నీ అవినీతిపరులని తిట్టే తెలుగు తమ్ముళ్లు.. తాము మాత్రం అవినీతి సామ్రాట్టులుగా పేరు తెచ్చుకుంటున్నారు. స్త్రీశక్తి భవనాల్లో సగం చోట్ల తుదిదశలో ఉండగా..  మిగతా చోట్ల మాత్రం పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు మొత్తుకుంటున్నా సర్కారు నిర్లక్ష్యం వహించడంతో.. స్త్రీశక్తి కాగితాలకే పరిమితమౌతోంది. 

కడపలో లిక్కర్ దందా

ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో ఖజానాకు చిల్లు పడటమే కాకుండా.. మద్యప్రియలు జేబుకు కూడా చిల్లు పడుతోంది. ప్రభుత్వ మద్యం షాపులు ఎత్తేసి, ప్రైవేటు వారికి లీజుకు ఇవ్వడంతో.. వారు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎమ్మార్పీ ధరకు అమ్ముతామని చెప్పి, ఆమేరకు పన్నులు కడుతున్న వ్యాపారులు.. మద్యాపాన ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ భారీ లాభాలు కళ్లజూస్తున్నారు.
                 వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే దందా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడక్కడా తూతూమంత్రంగా దాడులు చేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు చేసే దోపిడీతో పోలిస్తే అధికారులు జరిమానాలు పదో వంతు కూడా కాదని సమాచారం.
             ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తేయడం వెనుక పచ్చచొక్కాలు కీలక పాత్ర పోషించిన సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లో కూడా చాలామంది వారి అనుయాయులేనని, అధికారపార్టీతో మనకు గొడవెందుకని అధికారులు కూడా కిమ్మనట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం షరామామూలుగా దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. 

Wednesday, November 18, 2015

సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డుకు గండి

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లకు కూడా గండిపడింది. అయితే కొన్ని రోడ్లకు సహజంగా గండి పడగా.. చాలాచోట్ల అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. గుంటూరు జిల్లా నగరం మండలంలో ఓ రోడ్డుకు పడిన గండి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎప్పుడో వేసిన రోడ్లకు గండి పడిందంటే అర్థముంది కానీ.. రెండు నెలల క్రితం గండి పడటమేమిటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
               నగరం మండల కేంద్రం నుంచి కారంకివారిపాలెం వెళ్లే దారిలో రెండు నెలల క్రితం బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఈరోడ్డు మార్గంలో మూడుచోట్ల మురుగుతూములున్నాయి. ఇవి ఉన్న చోట కల్వర్టులు నిర్మించాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే అధికారులు మాత్రం షరా మామూలుగా వారి సూచనలు పట్టించుకోలేదు. వారం రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండంతో.. బీటీరోడ్డులో మురుగుతూములు ఉన్నచోట.. రోడ్డు కోతకు గురై గండి పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
                   పంటకాలువపై అడ్డంగా చెట్లు వేసి కేవలం పాదచారులు మాత్రమే రాకపోకలు సాగించగలుగుతున్నారు. ఈ రోడ్డులో ఇంకా రెండుచోట్ల తూములున్నాయని, అక్క కూడా రోడ్డు కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ నియంత్రించలేకపోయినా.. కోరి విపత్తులను కొనితెస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 

కోర్టు చొరవతో కదలుతున్న డొంక

తూర్పుగోదావరి జిల్లా తాండవ నదిలో ఇసుకాసురులకు హైకోర్టు ఉత్తర్వులు షాకిచ్చాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇసుక దొంగలంతా గప్ చుప్ గా పరారయ్యారు. తాండవనదీ పరీవాహక ప్రాంతానికి వచ్చిన అధికారులు అక్కడేమీ కనిపించలేదు. అయితే మొత్తం 59 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వినట్లు నిర్థారించారు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు 24 లక్షల రూపాయలు సీనరేజీ చెల్లించాల్సి ఉండగా.. ఏమీ కట్టలేదని తేలింది.
      అయితే తనిఖీలకు వెళ్లిన అధికారులతో పాటు ఇసుక అక్రమాలకు వత్తాసు పలుకుతున్న నేతలు కూడా వెళ్లడం వివాదాస్పదమైంది. హైకోర్టు అధికారులు నివేదిక అడిగిన తరుణంలో.. నేతలు వారిని మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా అధికారులే మేనేజ్ చేయాలని పచ్చచొక్కాలు అధికారులను వేపుకుతింటున్నాయి.
         మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరుపై అధికార వర్గాల్లో నిరసన వ్యక్తమౌతోంది. అటు కోర్టు, ఇటు టీడీపీ నేతలు మధ్యలో తాము చస్తున్నామని మొత్తుకుంటున్నారు. గత కాంగ్రెస్ హయాం అవినీతి మయం అని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. హస్తం నేతలకే దిమ్మ తిరిగేలా ఇసుక దోచుకున్నారని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇసుకతో ఈరేంజ్ లో బిజినెస్ చేయొచ్చని అన్ని పార్టీలకు టీడీపీ నేతలు మార్గనిర్దేశం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

అనంతలో అంతులేని అవినీతి

నిప్పులాంటి మనిషిని అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాటలు ఒట్టిమాటలే అని తేలిపోతోంది. అనంతపురం జిల్లాలో అవినీతి జలగలు తాండవిస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. బాధ్యులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారుల అవినీతికి, పచ్చ చొక్కాల పర్సంటేజీలు తోడవడంతో వ్యవహారం గప్ చుప్ గా సాగిపోతోంది.
     అనంతపురం కార్పొరేషన్ డబ్బులో ప్రజాప్రతినిధులకు డీజిల్ పోయించినా, కస్తూర్బా స్కూళ్లలో వసతులు సరిగా లేవని ఫిర్యాదులు వచ్చినా, ఎంపీ నిధులతో షెడ్డు నిర్మించి కార్పొరేషన్ అధికారులు సొమ్ము చేసుకున్నా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో కుంభకోణాలు జరిగినా, వీటన్నింటికీ పక్కా సాక్ష్యాలున్నా తమ్ముళ్లు లైట్ తీసుకుంటున్నారు. సర్కారు కూడా ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది.
           కరవు జిల్లాగా పేరుబడ్డ అనంతపురంలోనే ఈ స్థాయి అవినీతి జరుగుతుంటే.. ఇక మిగిలిన జిల్లాల పరిస్థితేంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.ప్రజోపయోగ కార్యక్రమాలకు డబ్బుల్లేవని బీద అరుపులు అరిచే ప్రభుత్వం.. అవినీతిని మాత్రం ఇష్టారాజ్యంగా ప్రోత్సాహిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

Tuesday, November 17, 2015

తెలుగు తమ్ముళ్ల రూటేవేరు

టీడీపీ సర్కారు హయాంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలపై కూడా ఆగడాలు మితిమీరుతున్నాయి. తప్పులు చేసిన అధికార పార్టీ నేతలను వెనకేసుకొస్తున్న సర్కారు.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమంగా రోడ్డు వేయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యల్లేవు కానీ, ప్రజల పక్షాన పోరాడుతున్న ఎమ్మెల్యేలు కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
         గుడివాడ వైసీపీ ఆఫీస్ సివిల్ వివాదంలో తలదూర్చిన పోలీసులు కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కొడాలి నానికి ఆఫీస్ ఓనర్ ఇచ్చిన గడువు ఇంకా ఉన్నప్పటికీ.. పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల ప్రోద్బలం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
             పేర్నినాని కూడా రాజధాని భూసేకరణ విషయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో తెలుగు తమ్ముళ్లపై ఆయన్ను టార్గెట్ చేశారు. మచిలీపట్నంలో మద్యం షాపుల్లో తనిఖీలకు వెళ్లిన అధికారులు.. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో నానిని అరెస్ట్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ సభల్లో భూసేకరణపై ఆందోళన చేయిస్తున్నారని పేర్నినానిపై కక్ష పెంచుకున్నారని వైసీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. 

బాక్సైట్ జీవో రద్దు తాత్కాలికమా..? శాశ్వతమా..?

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వాకలను నిలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా జీవో రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వకపోవడంతో పాటు.. పనులు ఆపేయాలని మాత్రమే సీఎం అన్నట్లు వార్తలు రావడంతో.. సందేహాలు మొదలయ్యాయి. జీవో రద్దు తాత్కాలికమా, శాశ్వతమా అని ఉద్యమకారులు చర్చించుకుంటున్నారు. 
                   ప్రస్తుతానికి పనులు ఆపేయాలని సీఎం ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యమ విజయమేనని, అయితే టీడీపీ సర్కారును నమ్మడానికి వీల్లేదని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఉద్యమ కమిటీ తీర్మానించింది. పైకి జీవో రద్దు చేశామని చెప్పి, ఏ అర్థరాత్రో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపే అవకాశం ఉందని అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తీర్మానించారు. 
                   ఏజెన్సీలో ఉన్న విలువైన బాక్సైట్ గనులపై కన్నేసిన బడాబాబులు సర్కారుపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారు. వీరికి కొందరు ప్రభుత్వపెద్దలు కూడా వత్తాసు పలుకుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉద్యమవేడి కారణంగా తవ్వకాలు నిలిపేసినా, పరిస్థితి సద్దుమణిగాక చూసుకుందామనే ధోరణిలో బడాబాబులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆక్వాపార్కుకు పోలీసుల వత్తాసు

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాపార్కు వద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఆందోళన చేస్తున్న కే.బేతపూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. పోలీసులతో గ్రామస్తులు తగాదాకు దిగడంతో.. ఎస్సై వచ్చి కానిస్టేబుళ్లను తీసుకెళ్లారు.
                 సామాన్యులను కాపాడాల్సిన పోలీసులు ఆక్వాపార్కు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ.. గ్రామంలో భయాందోళనలు కలిగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పకుండా.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇదంతా ఆక్వాపార్కు యాజమాన్యం ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు.
                  మరోవైపు ఆక్వాపార్కు నిర్మాణంపై ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు వివరణ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి కాలుష్య సమస్య రాదని నమ్మించే ప్రయత్నం చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే సీఎం రాలేదని చెప్పుకొచ్చారు. స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్తున్నారని, టీడీపీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్లు వస్తున్నాయి. 

Monday, November 16, 2015

సీఎం హామీలు నీటిమూటలే..!

ఎన్నికల్లో అవి చేస్తాం.. ఇవి చేస్తాం అని హామీ ఇవ్వడం.. గెలిచాక వాటిని మర్చిపోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ విద్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగాకులు ఎక్కువే చదివారు. తాను రాయలసీమ బిడ్డనని, ఆ గడ్డకు అన్యాయం చేయనని చెప్పుకునే చంద్రబాబు.. సీమకు ముఖద్వారం లాంటి కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోతోంది. ఇప్పటికి ఏడుసార్లు కర్నూల్లో పర్యటించిన సీఎం.. మొత్తం 51 హామీలు ఇవ్వగా.. కేవలం నాలుగు హామీలు మాత్రమే కార్యరూపం దాల్చడంపై విస్మయం వ్యక్తమౌతోంది.
                     కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, పరిశ్రమలు పెడతామని, పంచాయతీ రోడ్లు వేయిస్తామని, ఇలా నోటికొచ్చిన హామీలన్నీ బాబు ఇచ్చేశారు. అయితే కనీసం పంచాయతీ రోడ్లకు కూడా దిక్కులేదని కర్నూలు వాసులు లబోదిబోమంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయిన కర్నూలుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని నేతలు మొత్తుకుంటున్నా.. సర్కారులో మాత్రం చలనం రావడం లేదు.
             సీఎం హామీలకు అనుగుణంగా కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం, అక్కడ అవి పెండింగ్ పడటం రొటీనైపోయింది. కనీసం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నిధుల విడుదల చేయకపోవడంతో.. ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు మాత్రం హామీలు అమలుచేస్తున్నామని ఆత్మవంచన చేసుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. 

తోకముడిచిన తాండవాసురులు

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఇసుకాసురులు తోక ముడిచారు. తాండవ నదీగర్భంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజా క్షేత్రస్థాయి తవ్వకాలపై సాక్ష్యాలు ఇవ్వడంతో.. నివేదిక ఇవ్వాల్సిందిగా హైకోర్టు అధికారులను ఆదేశించింది. తనిఖీల కోసం అధికారులు వస్తున్నారని సమాచారం తెలిసిన ఇసుకాసురులు అక్కడ్నుంచి జారుకున్నారు.
                తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని రూరల్, తుని పట్టణ పరిధిలో తాండవ నది ప్రవహిస్తోంది. తాండవ నది రిజర్వాయర్ నుంచి అరవై ఐదు వేల మంది ప్రజలకు నీళ్లు అందుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి, పంటభూములు కోతకు గురవుతున్నాయి. అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో.. దాడిశెట్టి రాజా నేరుగా కోర్టును ఆశ్రయించారు.
             విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ ప్రాజెక్టు నుంచి తుని మీదుగా పెంటకోన వరకు తాండవ నది ప్రవహిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాండవ నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిందని చెబుతున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న పచ్చ చొక్కాలు.. సహజవనరులను కూడా వదలడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

తుంగభద్రకు సర్కారు తూట్లు

అనంతపురం జిల్లాకు వరప్రదాయిని అయిన తుంగభద్రా నది నీళ్లు తేవడంలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు. పెన్నహోబిలం డ్యామ్ నుంచి అదనపు వాటా సాధించడంలో విపలమైన జిల్లా టీడీపీ నేతలు.. హంద్రీ - నీవా ద్వారా వచ్చిన 2.3 టీఎంసీలతోనే జిల్లాలో చెరువులన్నీ నింపాలని అధికారులకు హుకుం జారీ చేశారు. అయితే జిల్లాలో మొత్తం 49 నుంచి 60 వరకు చెరువులున్నాయని, వీటన్నింటినీ నింపాలంటే కనీసం 5 టీఎంసీలు నీళ్లు కావాలని అధికారులు అంటున్నారు.
                   దివంగత నేత వైఎస్ హయాంలో పెన్నహోబిలం డ్యామ్ నుంచి అనంతపురం జిల్లాకు పది టీఎంసీల నీళ్లు అదనంగా కేటాయించారు. అయితే చంద్రబాబు సర్కారు వైఎస్ ఇచ్చిన జీవోకు తూట్లు పొడిచి అనంతకు మొండిచేయి చూపింది. దీంతో హంద్రీ నీవా ద్వారా వచ్చే అరకొర నీటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడలేని అధికార పార్టీ పెద్దలు.. తమపై ఒత్తిడి తెస్తున్నారని అధికారులు వాపోతున్నారు.
              గతంలో ఓసారి 4.5 టీఎంసీలు ఇచ్చినా కూడా కేవలం 60 శాతం చెరువులే నిండాయి. అలాంటిది ఇప్పుడు 2.3 టీఎంసీల నీటితో అన్ని చెరువులు నింపడం సాధ్య కాదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లాలోనే టీడీపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. అయితే అధికార పార్టీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తోంది జనం మండిపడుతున్నారు. 

Sunday, November 15, 2015

చిలకలూరిపేటలో రేషన్ బియ్యం మాఫియా

రేషన్ పంపిణీలో అవకతవలకలు చెక్ పెడతామని ఈపాస్ విధానాన్ని అమలుచేస్తున్నఏపీ  సర్కారు.. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కితగ్గడం లేదు. పైగా ఈపాస్ విధానం వచ్చాక ఖజానాకు బోలెడు డబ్బు ఆదా అవుతోందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఇదంతా బూటకమేనని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడుతున్న అక్రమ బియ్యం నిల్వలు సర్కారును వేలెత్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బియ్యం మాఫియాకు కేంద్రస్థానంగా మారింది. 
               పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు... ఇలా జిల్లా ఏదైనా.. ఎక్కడ అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నా.. సరుకు మాత్రం చిలకలూరిపేట వ్యాపారులదే అని తేలుతోంది. ముందు కోస్తాలోని నాలుగు జిల్లాలకే పరిమితమన రేషన్ బియ్యం మాఫియా అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారుల అండతో.. రాయలసీమ జిల్లాలకు కూడా విస్తరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
                    చిలకలూరిపేటలో బియ్యం దందా నడుస్తోందని, దీనికి టీడీపీ నేతల దన్ను ఉందని రెవెన్యూ అధికారులకు తెలిసినా.. ఏమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారని విమర్శలున్నాయి. కొంతమంది అధికారులు కూడా నేతలతో చేతులు కలిపి పర్సంటేజీలకు అలవాటు పడటంతో.. ఇక దళారులు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి కొనసాగుతోంది. త్వరలో బియ్యం ధరలు పెరుగుతాయని హెచ్చరికలు వస్తున్నా.. సర్కారు మాత్రం అక్రమ రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయకుండా చోద్యం చూస్తోంది. 

అన్నమో రామచంద్రా..!

మధ్యాహ్న భోజన పథకం నిధుల కొరతతో అలమటిస్తోంది. మెనూ ప్రకారం భోజనం పెట్టలేమని ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మే నుంచి బిల్లులు విడుదల కాలేదని, పైగా పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా డబ్బులు పెంచలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నిధులు ఇచ్చినప్పుడే కొన్నిచోట్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడి పిల్లలను పస్తులించిన సందర్భాలున్నాయి. ఇక ఐదు నెలల నుంచి బిల్లులే రాకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది.
             సర్కారు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో పప్పు, సాంబారు తప్పనిసరి. అయితే ధరలు పెరిగిపోవడంతో.. నిర్వాహకులు బెల్లం అన్నం, పెరుగన్నంతో సరిపెడుతున్నారు. ఇక వారానికి రెండుసార్లు గుడ్డు వడ్డించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ గుడ్డు ధర కొండెక్కి ఐదు రూపాయలకు చేరుకోవడంతో.. ప్రస్తుతం నెలకు రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు.
                 బిల్లుల విడుదల, ధరల పెరుగుదల గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతమంది పిల్లల్ని బడి మానిపించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శలు వస్తున్నాయి.  

సర్కారు సౌజన్యంతో సంక్షేమ హాస్టళ్లు ఖాళీ

పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సర్కారు.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చేరకపోయినా పట్టించుకోవడం లేదు. కనీసం విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపించడం లేదో ఆరా తీసే తీరిక కూడా సీఎంకు గానీ, మంత్రులకు కానీ లేదు. అదేమంటే వాళ్లే చేరకపోతే మేమేం చేస్తామని అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు అధ్వాన్నంగా ఉండటమే కారణమని విద్యార్థులు చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
               సాధారణంగా సంక్షేమ హాస్టళ్ల సంఖ్య పంచాలని ఎప్పుడూ నిరసనలు జరుగుతూ ఉండేవి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పరిమితికి మించి ఉన్నారని కూడా గతంలో వార్తలు రావడం మామూలే. చాలా సందర్భాల్లో అధికారులు తామిక చేర్చుకోలేమని చేతులెత్తేశారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కరవు జిల్లా అనంతపురంలో పనుల్లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నా.. పిల్లల్ని మాత్రం వసతిగృహాల్లో చేర్చేందుకు ముందుకు రావడం లేదు.
                 వసతి గృహాల్లో పిల్లల చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపడం లేదని నిరసన వ్యక్తమౌతోంది. వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నా, చదువుకోకపోయినా ఒక్కటే అనేంతగా నాసిరకమైన ప్రమాణాలున్నాయి. విద్యార్థుల చదువులపై అధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఆ మాత్రం దానికి తమ పిల్లల్ని ఎక్కడో దూరంలో ఉండే హాస్టళ్లలో చేర్పించడం ఎందుకని తల్లిదండ్రులు భావిస్తున్నారు.                 

Saturday, November 14, 2015

జీవీఎంసీలో మిత్రభేదం

ఏరు దాటే దాకా ఏరు మల్లన్న.. ఏరు దాడాక ఓడ మల్లన్న. ఇది ఓ సామెత. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో తెలుగు తమ్ముళ్ల తీరు చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఇప్పటిదాకా బీజేపీతో అంటకాగి, కీలకమైన విశాఖ ఎంపీ సీటును కూడా బీజేపీకి కట్టబెట్టి.. అదేమంటే మిత్రధర్మమని గొప్పలు చెపుకున్న టీడీపీ.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు బీజేపీకి కట్టబెట్టాలని కొంతకాలంగా ఆందోళన చెందుతోంది. అయితే బీహార్ ఎన్నికలు టీడీపీ నెత్తిన పాలు పోశాయి.
            బీహార్ ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో.. మిగతా తెలుగు తమ్ముళ్ల సంగతి ఏమోకానీ.. గ్రేటర్ విశాఖ టీడీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటివరకు జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు బీజేపీకి ఇవ్వాలని చర్చలు జరిపిన నేతలు.. సీట్ల సంఖ్య బాగా తగ్గించేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువ మాట్లాడితే అసలు పొత్తే వద్దని కూడా మొండికేస్తున్నారు.
               టీడీపీ నేతల తీరును గమనిస్తున్న బీజేపీ.. అన్నీ తెలిసినా ఏమీ చేయలని స్థితిలో పడిపోయింది. అవసరమైతే తాము కూడా ఒంటరిగా పోటీ చేస్తామని అంతర్గతంగా కమలదళం మాట్లాడుకుంటున్నా.. విశాఖలో తమది వాపే కానీ బలుపు కాదని వారికీ తెలుసు. అవసరమైతే జాతీయ నేతలతో చంద్రబాబుకు చెప్పించి.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేయాలని, తెలుగు తమ్ముళ్ల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కమలదళం భావిస్తోంది. 

పశ్చిమలో ఆక్వా సెగలు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ తలపెట్టిన ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జనం గొంతెత్తారు. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా భీమవరం మండల జొన్నలగరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు.. భారీగా తరలివచ్చారు. అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ.. చంద్రబాబును ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేయనీయమని తేల్చి చెబుతున్నారు.
             ఎక్కడో నివాసాలకు దూరంగా, సముద్రతీరంలో ఏర్పాటుచేయాల్సిన ఆక్వా ఫుడ్ పార్కును, నివాసప్రాంతాలు, పొలాల మధ్యలో ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమౌతోంది. ఆక్వా ఫుడ్ పార్క్ లో భారీగా అమ్మోనియం వాడతారని, దీని కారణంగా సమీప ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు విషపూరితమై, వ్యర్థాలన్నీ గొంతేరు డ్రైయిన్లో కలిసి.. సమీప గ్రామాల ప్రజలు రోగాల బారిన పడతారని ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ఆందోళన చెందుతోంది.
              ఈ నెల 17న శంకు స్థాపనకు వస్తున్న చంద్రబాబును అడ్డుకుంటామని స్థానిక మహిళలు చెబుతున్నారు. సీఎం తమ ఊరు వస్తే మంచి చేయడానికి రావాలని, అంతేగానీ అందరూ తాగే మంచినీళ్లను విషపూరితం చేస్తామంటే ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లూ తెలుగుదేశానికి ఇచ్చింది.. అభివృద్ధి చేస్తారనే గానీ.. తమ పొలాలు నాశనం చేయడానికి కాదని దెప్పిపొడుస్తున్నారు. 

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే తనయుడి ఘనకార్యం

ఇతరులకు శ్రీరంగనీతులు చెబుతారు కానీ.. తనయుడు వేస్తున్న రోడ్డులో లోపాలు కనిపించడం లేదా.. అని  మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి మండిపడ్డారు. ప్రొద్దుటూరు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరదరాజుల రెడ్డి తనయుడు కొండారెడ్డి కాంట్రాక్టు తీసుకుని రోడ్డు వేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణం నాసిరకంగా ఉంటోందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు రాచమల్లు ప్రసాదరెడ్డి రంగంలోగి దిగారు. 
            క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డును పరిశీలించిన వైసీపీ నేతలకు.. స్థానికులు చేస్తున్న ఫిర్యాదులు చాలా తక్కువని తేలింది. అసలు రోడ్డు నిర్మాణంలో ఎవరైనా తారు వాడతారు. కానీ కొండారెడ్డి మాత్రం తారే వాడటం లేదన్న విషయం నేతల దృష్టికి వచ్చింది. కంకరకు నల్లరంగు వేసి మాయ చేస్తున్నారని, తారు కంటే ఆయిల్ ధర తక్కువగా ఉండటమే దీనికి కారణమని పరిశీలనలో తేలింది. 
               అధికార పార్టీ నేతలు రోడ్లు కాంట్రాక్టుకు తీసుకుంటే పనులు ఇలాగే ఉంటాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఈ విధంగా దోచుకుతింటున్నారని విమర్శించారు. వరదరాజులరెడ్డికి దమ్ముంటే తనయుడికి బుద్ధి చెప్పి నాణ్యమైన రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. నిప్పులాంటి మనిషినని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రొద్దుటూరు రోడ్డు చూసి అవినీతి జరగలేదని గుండె మీద చేయ్యేసుకుని చెప్పగలరా అని సవాల్ విసిరారు. 

Friday, November 13, 2015

అంగన్ వాడీ కేంద్రాలకు సర్కారు కోతలు

మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషించే అంగన్ వాడీ కేంద్రాల విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రకరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు అంగన్ వాడీలే అన్ని అవసరాలు తీరుస్తుంటారు. అలాంటి అంగన్ వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా సర్కారు సగానికి సైతం కోత విధించింది. అదేమంటే పెరిగిన పప్పుల ధరలను కారణంగా చూపింది. సర్కారు నిర్ణయంతో తూర్పుగోదావరి జిల్లాలోని చిన్నారులు ఆకలితో అలమటిస్తారని ఆందోళన వ్యక్తమౌతోంది.
         అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం ఇస్తారు. మూడేళ్ల వరకు చిన్నారులకు మూడు కేజీల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చుకుని విద్యాబుద్ధులు నేరతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తారు. అయితే ఇప్పుడు కందిపప్పు ధర పెరిగిందనే సాకుతో అరకేజీ కోత విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
             విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రేపటి పౌరులను బలహీనులుగా తయారుచేస్తున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు అన్నం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు బీదఅరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ టూర్లు, ప్రత్యేక విమానాలు అంటూ అనవసర ఖర్చు చేసే చంద్రబాబు.. చిన్నారుల నోటి దగ్గర కూడు లాగేయడం దౌర్భాగ్యమని విమర్శిస్తున్నారు.

ప్రైవేటు ప్రతిభకే పట్టం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి విద్యార్థుల్ని ఆకర్షించాల్సిన ప్రభుత్వం.. ప్రతిభా అవార్డులకు కూడా కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులను ఎంపిక చేసి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని అవమానిస్తోంది. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, స్వయంకృషి, పట్టుదలతో మంచి మార్కులు సాధించే విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ప్రతిభ అవార్డుల్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఆ అవార్డుల ఎంపికలో కూడా కార్పొరేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్ని చిన్నచూపు చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
           స్వయంగా సొంత జిల్లా చిత్తూరులో మూడో వంతు ప్రతిభా అవార్డులు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల విద్యార్థులకే దక్కడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా అధికారులు పంపించిన జాబితాను తనిఖీ చేయాల్సిన పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా మొద్దునిద్ర పోతున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి ప్రతిభా అవార్డులతో ఏ ఉపయోగం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
          చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ప్రతిభా అవార్డుల్లో చాలావరకు ప్రైవేట్ విద్యార్థులకే ఇచ్చిన అధికారులు.. ఉన్న కొంతమంది ప్రభుత్వ విద్యార్థులకు కూడా సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యం వహించారు. ప్రతిభా అవార్డుకు అర్హత ఉన్న ఓ విద్యార్థి తండ్రి డీఈవో కార్యాలయానికి వచ్చి అవార్డు గురించి వాకబు చేసినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. ఆయన నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రతిభా అవార్డులు ఇస్తూ ప్రైవేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తే ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఇన్ పుట్ సబ్సిడీకి దిక్కులేదు

ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలు పండించే రైతుల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోగా.. తర్వాతి పంటకు విడుదలైన ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. జిల్లాలకు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. అధికారులు మాత్రం సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు.
            అనంతపురం జిల్లా ఇన్ పుట్ సబ్సిడీ కోసం రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తే.. మీకేం ఇబ్బందని నిలదీశారు. వారం రోజుల్లో ఇస్తామని జాయింట్ డైరక్టర్ చెప్పినా.. ఇలా చాలాసార్లు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అధికారులు రైతుల్ని మభ్యపెట్టడంలో చంద్రబాబును మించిపోయారని మండిపడ్డారు. రైతులపై ఎలాగో సర్కారుకు చిన్నచుపే కాబట్టి.. ఇచ్చినా.. ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు.
            అనంతపురం జిల్లాలకు 500 కోట్ల పైచిలుకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైందని, దీన్ని రైతుల ఖాతాల్లో ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు అధికారులు నీళ్లు నమిలారు. చివరకు కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లో వేస్తామని తూతు మంత్రపు హామీ ఇచ్చారు. వారం రోజుల తర్వాతైనా రైతు ఎకౌంట్లో డబ్బు పడుతుందో లేదో అనుమానమేనని రైతు సంఘాలు నేతలు చెబుతున్నారు. 

Thursday, November 12, 2015

రెయిన్ గన్ రాజకీయం

సర్కారు నిధులు స్వాహా చేయడానికి అధికార పార్టీ నేతలు కొత్తదారులు వెతుకున్నారు. రైతుల పేరు చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయం మొదలుపెట్టారు. స్వయంగా సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రెయిన్ గన్లపై ఆసక్తి చూపకపోయినా.. ప్రత్తిపాటి మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రెయిన్ గన్లు రైతులకు సరఫరా చేస్తామని, దీంతో వర్షాభావం ఉన్నా మంచి దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
          ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. వరికి, పత్తికి ప్రస్తుత దశలో రెయిన్ గన్లతో ఉపయోగం లేదని, పైగా ఇప్పటికే పొట్ట దశలో ఉన్న వరి పంటపై రెయిన్ గన్లు ఉపయోగిస్తే.. రంగు మారి గిట్టుబాటు ధర కూడా రాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి అన్నీ తెలిసినా సదరు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడానికే హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
         ఆరు నెలల క్రితం ఇదే తరహాలో వరి బాగా పండించే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు డయ్యర్లు సరఫరా చేశారు. ధాన్యం ఎండబెట్టే యంత్రాలు అప్పట్లో ఉపయోగపడవని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా ప్రభుత్వంతో సబ్సిడీ కూడా ఇప్పించారు. అయినా రైతులు ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో సంబంధిత కంపెనీ నష్టపోతోందని చెప్పి.. వాటిని మార్కెట్ కమిటీలతో కొనిపించారు. ఇప్పటికి అవి అలంకార ప్రాయంగానే ఉన్నాయి. రెయిన్ గన్ల వెనుక కూడా ఇలాంటి రాజకీయమే ఉందని అధికారులు గుసగుసలాడుతున్నారు.  

పంతుళ్ల కడుపులు మాడుస్తున్న సర్కారు

అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారి జీతాలకే ఎసరుపెట్టారు. విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలు గడిచినా.. కేవలం ఒకటిన్నర నెల జీతం మాత్రమే ఇచ్చి అధ్యాపకుల  కుటుంబాలను పస్తులుంచుతున్నారు. సమస్యను ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా, ధర్నాలు చేసినా ఫలితం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
            2000వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం లోకి వచ్చాక వారి మాట మరిచిపోయారు. నాలుగు నెలల తర్వాత మంత్రులు గంటా, యనమల, పల్లె, కామినేనితో సబ్ కమిటీ ఏర్పాటు చేసి.. కాంట్రాక్టు అధ్యాపకులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
             అయితే కమిటీ ఏర్పాటై సంవత్సరం గడిచినా ఇంతవరకూ అతీగతీ లేదు. ఎవర్నడిగినా సరిగా స్పందించడం లేదని, తమ పొట్టకొట్టడం న్యాయం కాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ చేసినా, చేయకపోయినా కనీసం తమ జీతాలైనా ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. చిత్తూరు పర్యటనకు వస్తున్న చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని చెబుతున్నారు.

అధికార పార్టీ లిక్కర్ దందా

 మద్యం టెండర్ల విషయంలో పచ్చ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. మద్యం వ్యాపారులను బెదిరించి కొన్ని దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యేలా చేశారు. ఇక సిండికేట్ అయిన మద్యం వ్యాపారుల నుంచి తమ వంతు మామూళ్లు వసూలు చేస్తున్నారు. లిక్కర్ ను నియంత్రిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఊరూ వాడా ఊదరగొడుతున్న చంద్రబాబు.. తమ పార్టీ నేతలు లిక్కర్ దందా కొనసాగిస్తూనే.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు.
          అనంతపురం జిల్లాలో మద్యం టెండర్ల వ్యవహారం గమనిస్తే అధికార పార్టీ నేతల బాగోతం బయటపడుతుంది. జిల్లాలో మొత్తం 29 దుకాణాలకు టెండర్లు పిలవగా.. ఎనిమిది దుకాణాలకు ఒక్క టెండర్ కూడా రాలేదు. ఈ షాపుల వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని అందరూ భావిస్తున్నారు. టెండర్లు వేయడానికి వచ్చిన వ్యాపారులను బెదిరించి వెనక్కుపంపినట్లు ఆరోపణలున్నాయి.
        అధికార పార్టీ నేతల అక్రమాలకు అధికారులు కూడా అండగా నిలవడంతో.. మద్యం టెండర్లు దాదాపుగా ఏకపక్షంగా ముగిశాయి. మద్యం నుంచే ఖజానాకు భారీ ఆదాయం వస్తోందని చెప్పుకుంటున్న సర్కారు.. మద్యం టెండర్లలో అక్రమాలు జరిగి ఖజానాకు చిల్లు పడుతున్నా.. మనవాళ్లే కదా అని చూసీచూడనట్లు పోతోంది. పచ్చ తమ్ముళ్ల దోపిడీ ఇలాగే సాగితే.. ఖజానాకు పెద్ద చిల్లు పడుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు.

Wednesday, November 11, 2015

మన్యంలో బాక్సైట్ సెగలు

బాక్సైట్ తవ్వకానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ మన్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే ఐక్య ఉద్యమం దిశగా గిరిజనులు సంఘటితమవుతుంటే.. వారికి మద్దతుగా ఏయూలో విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. ఏయూలో విద్యార్థుల దీక్షలకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా గిరిజనుల పొట్ట కొట్టడానికి సర్కారు కంకణం కట్టుకుందని విమర్శలు వస్తున్నాయి.
             ప్రతిపక్షంలో ఉండగా గిరిజనులపై కపట ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు అసలు రంగు బయటపెట్టారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మన్సంలో బాక్సైట్ తవ్వకాలు జరగనీయమని వారు తేల్చిచెప్పారు. గిరినులను మన్యం నుంచి తరిమివేసే లక్ష్యంతో సర్కారు చర్యలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
             గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతితో వారి మనుగడనే ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు గిరిజన సలహా మండలి అనుమతులు అవసరం ఉండగా.. సర్కారు ఏకపక్షంగా జీవో జారీ చేసిందని ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతోందని, రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 

సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం

ఆరుకోట్ల రూపాయలు ఖర్చుచేసి వేసిన మంచి నీటి పైపులైన్లు.. కనీసం సంవత్సరమైనా పనిచేయాలి కదా. కానీ మన హైటెక్ సీఎం చంద్రబాబు హయాంలో మాత్రం ఐదు నెలలకే నీటి పైపులైన్లకు తూట్లు పడ్డాయి. పుష్కరనిధులతో ఆర్భాటంగా వేసిన పైపులైన్లకు అప్పుడే లీకేజీలు రావడం చూసి జనం విస్తుబోతున్నారు. ఈ చోద్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాల్టీలో జరిగింది.
           అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. పుష్కరాలకు ఇష్టానుసారంగా నిధులు ఖర్చుపెట్టిన సర్కారు.. వాటి అజమాయిషీ సరిగా చేయలేదనడానికి ఈ పనులే నిదర్శనమంటున్నారు. అనవసరంగా ఖర్చు పెట్టడం, డబ్బులు వృథా చేయడం, అంతా అయిపోయాక నిధుల్లేవంటూ చేతులెత్తేయడం సర్కారుకు అలవాటుగా మారిందన్న విమర్శలున్నాయి.
         మంచినీటి పైపులైన్లు నరసాపురం మున్సిపాల్టీ పరిధిలో వేసినా.. మున్సిపాల్టీ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఇంజినీర్లు కూడా పరిశీలించాల్సి ఉంది. పుష్కరాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వమే కాబట్టి.. నిధులు సద్వినియోగం అయ్యాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతిసారీ లోటు బడ్జెట్ అంటూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు సర్కారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా తమ వంతు అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. 

సర్కారు పుణ్యంతో దీపావళికి పస్తు

ఔట్ సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం. ఇది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వల్లించిన చిలక పలుకులు. కానీ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఇవన్నీ మరిచిపోయారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్నవారని కూడా ఊడపీకుతున్నారు. కొంతమందిని తీసేయడం కుదరకపోతే.. వారికి జీతాలు ఇవ్వకుండా నానా పాట్లకు గురిచేస్తున్నారు.
              కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్ వాడీలు, ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. వీరి జీతాలు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల లోపే ఉన్నా.. సర్కారు మాత్రం బడ్జెట్ లేదంటూ కుంటిసాకులు చెబుతోంది.
             వందల కోట్లతో అమరావతి శంకుస్థాపన ఆర్భాటంగా నిర్వహించిన ప్రభుత్వానికి తమ ఆకలి తీర్చడానికి చేతులు రావడం లేదని అంగన్ వాడీలు మండిపడుతున్నారు. నెలకు ఐదు వేల రూపాయలతో బతకడమే కష్టమని, అలాంటిది ఆరు నెలలుగా జీతాలు రాకపోతే మనుషులు ఎలా బతుకుతారన్న కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి పొట్ట గొడుతున్న సర్కారు.. తమను పండగ రోజు కూడా పస్తు పడుకోబెట్టిందని మండిపడుతున్నారు. 

Tuesday, November 10, 2015

గుంటూరు సాక్షిగా మిత్రభేదం

ఏపీలో టీడీపీ, బీజేపీ మైత్రి మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మొదట్లో కేంద్రంపై నమ్మకంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు ప్రతిపక్షాల విమర్శల్ని కూడా లెక్కచేయకుండా మోడీని వెనకేసుకొచ్చారు. అయితే శంకుస్థాపనకు వచ్చి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇవ్వడం అవమానకరమని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా గుంటూరు తమ్ముళ్లు బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
     ఎన్నికలు పూర్తయ్యాక మొదటిగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివిధ కార్యక్రమాల్లో టీడీపీ సర్కారుపై విమర్శలు చేశారు. తర్వాత తెలుగుదేశం నేతలు కూడా దీటుగా స్పందించారు. అయితే మిగతా జిల్లాల నేతల సంగతి ఎలా ఉన్నా.. గుంటూరు నేతలు మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు. గల్లా జయదేవ్ ప్రధాని పర్యటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, నర్సరావుపేట ఎంపీ రాయపాటి ఏకంగా ప్రధానిపై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.
        బీహార్ ఫలితాల తర్వాత వినుకొండలో పర్యటించిన రాయపాటి.. ఏపీ ప్రజల ఉసురు తగిలే బీజేపీ మట్టిగొట్టుకుపోయిందని ఆరోపించారు. బీహార్, కశ్మీర్ కు ప్యాకేజీ ఇచ్చి, ఏపీకి మట్టి, నీళ్లు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని రాయపాటి పరోక్షంగా క్లాస్ పీకారు. రాయపాటి కామెంట్లు టీడీపీలో కలకలం రేపాయి. బీజేపీ నేతల స్పందనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. మొత్తానికి గుంటూరు మిర్చి ఘాటు మరిగిన తమ్ముళ్లు.. ఎక్కువకాలం బీజేపీని ఉపేక్షించరనడానికి.. రాయపాటి వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మిల్లర్లతో బాబు మిలాఖత్

రైస్ మిల్లర్లో సీఎం చంద్రబాబు మిలాఖత్ అయ్యారని వైసీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్ర ఆరోపించారు. లెవీ ఎత్తివేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, వ్యాపారులు యథేచ్ఛగా దోచుకుంటున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనే నాథుడే లేడని, రవాణా ఖర్చులు కూడా రైతులే చెల్లించాల్సిన దుస్థితి ఉందని నెహ్రూ మండిపడ్డారు.
        రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు విదేశాలకు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. రాజధాని మత్తులో ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారించాలనే ఆలోచన చేయడం లేదన్నారు. రుణమాఫీ పేరుతో ఊరూరా గొప్పలు చెప్పుకుంటూ.. ఇప్పటికి కేవలం 9 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, రైతులు పద్నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తూ నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయని, రైతులు కష్టాలు పడుతున్నారని, సీఎం స్పందించకపోతే తగిన గుణపాఠం తప్పదని వైసీపీ నేతలు హెచ్చరించారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాతైనా బాబుకు కనునిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు కూడా మోడీ తరహాలో నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.

స్కూళ్ల నిధులు లాక్కున్న సర్కారు

అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని చోద్యం జరిగింది. స్కూళ్లకు మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు.. తేరగా వాటి నిధులే మింగేసింది. పైగా నిధులు ఖర్చుచేయలేదని కుంటిసాకులు చెబుతోంది. సర్కారు ఇచ్చిన నిధులతో పాటు, వాటిపై వచ్చిన వడ్డీ కూడా లాగేసుకోవడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. ఆర్భాటంగా ప్రకటనలు చేసే ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి దివాలాకోరు పద్ధతులకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
        ప్రతి స్కూలుకు స్కూల్ ఖర్చులు, కరెంట్ బిల్లు, సిబ్బంది జీతాల కోసం సర్కారు రెండు గ్రాంటులు ఇస్తోంది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు ఇచ్చారు. అయితే చాలా పాఠశాలలు ఇంకా ఈ నిధులను వాడుకోలేదు. ఇదే అదనుగా భావించిన స్కూళ్లకు సమాచారం లేకుండా స్కూల్ ఖాతాలో ఉన్న నిధులను వెనక్కితీసుకుని, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారి ఖాతాకు జమ చేసింది. ఈ విషయం తమకు కూడా తెలియదని ఎస్ఎస్ఏ అధికారి చెప్పడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
       అధికారులకు కూడా తెలియకుండా నేరుగా బ్యాంకులతో మాట్లాడి 25 కోట్ల నిధులు వెనక్కుతీసుకోవడంపై జిల్లాలో నిరసన వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా స్కూళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి పంపులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని చెబుతుంటే.. వాటి కోసం ఇచ్చిన నిధులను కూడా లాక్కోవడమేంటని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే కనునిప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Monday, November 9, 2015

పచ్చ ప్రభుత్వానికి బాక్సైట్ పంచ్

ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు పోరాటాలు చేసిన చంద్రబాబు.. సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు వచ్చేలా చేయడంపై మన్యంలో ఉద్యమం రాజుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యమకారులు.. గతంలో మాదిరిగా ఉధ్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. అటు బాక్సైట్ ఉద్యమానికి మావోయిస్టులు కూడా మద్దతు పలకడంతో.. వేడి మరింతగా రాజుకుంటోంది.
             బాక్సైట్ తవ్వకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తమ అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోవడం లేదని.. మన్యంలో తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ముందుకెళితే తాము పార్టీని వీడాల్సి వస్తుందని చెప్పినా.. చంద్రబాబు మొండి పట్టు పట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల బాక్సైట్ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షం అండగా నిలుస్తోంది. వైసీపీకి మన్యంలో లభించిన అపూర్వ స్వాగతం.. బాక్సైట్ విషయంలో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చాటిచెబుతోంది. 

రాజధానిలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం గాలికి..!

రాజధానికి త్వరగా తరలిరావాలని ఉద్యోగులను తొందరపెడుతున్న చంద్రబాబు సర్కారు.. వారికి మౌలికవసతులు కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉద్యోగుల నివాసానికి కీలకమైన ఇళ్ల నిర్మాణంపై సర్కారు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.  ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో.. ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
    పరిశ్రమలు, అస్మదీయులకు వేలాది ఎకరాలు దోచిపెడుతున్న చంద్రబాబు.. స్థలం లేదన్న సాగుతో పది వేల ఇళ్లు రద్దు చేసేశారు. ఇక కరకట్టపై అక్రమనిర్మాణాలు కడుతున్నారనే సాకుతో మరికొన్ని ఇళ్లు రద్దుచేశారు. అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు మాత్రం.. అదే కృష్ణా కరకట్టపై ప్రభుత్వమే అక్రమ నిర్మాణంగా నిర్థారించిన భవనానికి మరమ్మతు చేయించుకుని మరీ దర్జా ఒలకబోస్తున్నారు. సామాన్యుడికి నివాసాలు దూరం చేస్తూ సర్కారు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

ఒక ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన

రాయలసీమకు వరప్రదాయిని అయిన హంద్రీ-నీవా ప్రాజెక్టుపై టీడీపీ సర్కారు శీతకన్నేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఈ ప్రాజెక్టుకు రెండుసార్లు పునాదిరాళ్లు వేసిన చంద్రబాబు.. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం కాలువ పనులు పూర్తిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దివంగత నేత వైఎస్ హయాంలో మూడొంతుల పనులు పూర్తిచేసినా... చంద్రబాబు మాత్రం మాటలతో పొద్దుపొచ్చుతూ అనంత జిల్లా రైతాంగాన్ని మభ్యపెడుతున్నారు.
      గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా టీడీపీకి బ్రహ్మరథం పట్టింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లా పచ్చపార్టీని బాగానే ఆదరిస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం అనంత జిల్లాకు చెప్పుకోదగ్గ మేలు చేసిన పాపాన పోలేదు. అనంత ఎన్టీఆర్ కు ఇష్టమైన జిల్లా అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు.. ఇరవై ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకుండా లోటు బడ్జెట్ సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. బాబు తీరుపై స్థానిక టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Sunday, November 8, 2015

చింతమనేనిపై అవ్యాజ ప్రేమ

అంగబలం, అర్థబలానికి తోడు అధికార బలం కూడా తోడుగా ఉంటే.. ఇక నేరం చేస్తే మాత్రం కేసులేముంటాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో పోలీసుల వ్యవహారశైలి ఇలాగే ఉంది. అభయారణ్యంలో అక్రమంగా రోడ్డు వేశారని రుజువైన, అదేమని ప్రశ్నించిన అధికారులపై చేయి చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చినా.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తే పరిశీలనలో ఉందని సమాధానం చెబుతున్నారు.
             చింతమేనిపై కేసు పెట్టకపోగా.. పోలీసులు వింత వాదన వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో కూడా అటవీ చట్టం కింద కేసు నమోదైందని, ఇప్పుడు కూడా అదే చట్టం కింద ఫిర్యాదు చేశారని, ఒకే చట్టం కింద రెండు కేసులెందుకనే ఆలోచనలో ఉన్నామని.. ఖాకీలు చట్టానికే కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రస్తుతం విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, వారు చెప్పినట్లుగా నడుచుకుంటామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
              ఇక చింతమనేని విషయంలో అటవీ, పోలీస్ అధికారుల తీరు మొదట్నుంచీ అనుమానాస్పదంగా ఉంది. చింతమేని కోమటిలంక రోడ్డుపై కన్నేశారని తెలిసినా, ఆయన అర్థరాత్రి వస్తారని తెలిసినా.. డీఆర్వో, పోలీసులు మౌనం వహించారు. అటవీ సిబ్బంది ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అధికారంలో ఉన్నవారికి మడుగులు వత్తితే.. అధికారులు కూడా శిక్ష అనుభవించక తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ముద్రగడ ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, కాపు సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి కాపు నేతలు సంఘీభావం తెలిపారు. కోనసీమతో పాటు పలు ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహానికి భారీగా కాపులు తరలివచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు సాధించుకోలేకపోతే భవిష్యత్తులో కాపులు దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముద్రగడ ఆందోళన వ్యక్తం చేశారు.
  ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని ముద్రగడ హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు మోసపూరిత హామీలిచ్చారని, ఈసారి వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాపు కార్పోరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి,, కేవలం వంద కోట్లే విదిలించారని ముద్రగడ గుర్తుచేశారు. కాపులపై చంద్రబాబు కపటప్రేమను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
   కాపు ఉద్యమ కార్యాచరణను నిర్ణయించడానికి జనవరి 31న భారీ బహిరగం సభ ఏర్పాటుచేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సభకు కాపులంతా పెద్దఎత్తున తరలివచ్చి.. ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని కోరారు.

రైతుల దెబ్బకు మంత్రి పరార్..!

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీరు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు మీదుగా పెదనందిపాడు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు, ప్రజలు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలిసిన మంత్రి కాన్వాయ్ ను మినీ బైపాస్ మీదుగా దారి మళ్లించారు
     పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది నియోజకవర్గంలో కొంతకాలంగా పంటలకు సాగునీరు, తాగడానికి తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, మంత్రిని నిలదీద్దామనుకుంటే పోలీసులు కూడా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై రైతులున్నారని తెలిసి కూడా మంత్రి దొడ్డిదారిన వెళ్లడం. ఇలాంటి నేతలను గెలిపించడం తమ దౌర్బాగ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
        పంటలు పండక, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు కూడా సరిగా జరగడం లేదని నిరసన తెలిపారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడం సబబు కాదన్న పోలీసులతో.. రైతులకు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న రైతులు.. అక్కడ్నుంచి వెనుదిరిగారు.