Monday, December 28, 2015

అనంతలో జలగరళం

మినరల్ వాటర్ పేరుతో అనంతపురం జిల్లాలో విక్రయిస్తున్న నీటిపై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిలో కరిగిన ఘన పదార్ధాల శాతం చాలా తక్కువగా ఉంటోందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులతో పాటు రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో పది మినహా మిగతా ప్లాంటులనన్నీ బీఐఎస్ అనుమతి లేకుండా వెలసినవే కావడంతో.. యథేచ్ఛగా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నాయి.

తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘనపదార్ధాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఉపయోగకరమైన పదార్ధాలను మనం నీటిద్వారానే గ్రహిస్తుంటాం. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ నేపథ్యంలో భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయి. సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికరమైన పదార్థాలు నీటిలో కలుస్తున్నాయి. హానికారకాలను తొలగించే ప్రక్రియలో వాడే ఫిల్టర్లు టీడీఎస్ లను నామమాత్రపు స్థాయికి తగ్గింస్తుండటం కొత్త సమస్యకు దారితీస్తోంది.

పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటికి వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం రసాయనాలు కలుపుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో ప్రయోగశాల ఉండాలని నిబంధనలు చెబుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పబ్లిక్ హెల్త్ అధికారులకు అన్నీ తెలిసినా.. చోద్యం చూస్తున్నారు. 

No comments:

Post a Comment