Monday, December 14, 2015

కాకినాడ సెజ్ కు నిరసన సెగ



తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ పై నిరసన సెగలు రేగుతున్నాయి. తమ అనుమతి లేకుండా సెజ్ ఏర్పాటుచేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానిక రైతులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ఆత్మహత్యలకు కూడా వెనుకాడమని బెదిరిస్తున్నారు. పదేళ్లుగా తమ భూములకు సరైన పరిహారం ఇవ్వలేదని, పునరావాసం సంగతి పట్టించుకోకుండా సెజ్ పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం రమణక్కపేటలో సెజ్ పనులను అడ్డుకున్నారు.

సెజ్ వ్యతిరేక పోరాట సమితి నేతలతో కలిసి రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో భూముల్లో సమావేశమయ్యారు. పోలీసులు వచ్చి రైతులు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే తమ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయకూడదని. తమ పునరావాసం సంగతి తేల్చాకే.. సెజ్ పనులు చేపట్టాలని రైతులు కరాఖండిగా చెప్పారు. పోలీసులు కొందరు రైతుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో.. ఉద్రిక్తత నెలకొంది.

సెజ్ కు భూములిచ్చిన రైతులకు.. ఎకరానికి పది లక్షలు చెల్లించాలని, జాబ్ కార్డులు, పింఛన్లు, ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని.. సెజ్ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. రైతులతో కాకుండా దళారులతో సమావేశాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ఇప్పటికైనా సెజ్ యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. 

No comments:

Post a Comment