Thursday, December 24, 2015

తొలగింపుపై తిరుగుబాటు

జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వటంపై ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  ఆధ్వర్యాన  మౌన నిరసన చేపట్టారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని విజయవాడ లెనిన్ సెంటర్‌లో ప్రదర్శన చేశారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఉద్యమాలను నీరుగార్చేందుకు టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.

గత ఆరు నెలలుగా వేతనాలు, బిల్లులు సక్రమంగా రాకపోయినా తాము అప్పులు చేసి మరీ సెంటర్లను నిర్వహిస్తున్నామని అంగన్ వాడీలు చెప్పారు. చాలీచాలని వేతనాలతో అవస్థలు పడుతున్న తాము కనీస వేతనాల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తమపై పోలీసులతో దాడి చేయించటమే కాకుండా ధర్నాలో పాల్గొన్నవారిని ఉద్యోగాలు నుంచి తొలగించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, ధర్నాలు ఉద్యమాలు ఎందుకు చేశారని  ప్రశ్నించారు.

అసెంబ్లీలో రాత్రంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి చర్చించిన టీడీపీ సర్కారు తమ సమస్యల గురించి పట్టించుకోకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలపై మాట్లాడుతున్న రోజాను సస్పెండ్ చేయటమేకాక నగరంలో టీడీపీ నాయకులు రోజా దిష్టిబొమ్మను దహనం చేయటం వారి నైజాన్ని తెలియజేస్తోందన్నారు.


 

No comments:

Post a Comment