Wednesday, December 16, 2015

ఖాళీ చేయండి.. కొల్లగొట్టేస్తాం!



విశాఖ ఉక్కు భూములను దక్కించుకునేందుకు అధికార టీడీపీ పెద్దల యత్నాలు చాపకింద నీరులా చకచకా సాగిపోతున్నాయి. వారి నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్లకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం క్రమంగా లొంగిపోతోంది. నగరంలోని సీతమ్మధారలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉక్కు క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం ఈ తతంగాన్ని ధ్రువపరుస్తోంది.

స్టీల్‌ప్లాంట్ భూ ములను ప్రభుత్వ పెద్దలకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ రెడీ అవుతోంది. దశలవారీగా భూములు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం రూపొందించిన ప్రణాళికకు తూట్లు పొడుస్తూ స్టీల్‌ప్లాంట్ భూములను లాక్కోవాలని చూస్తున్నారు. స్టీల్‌ప్లాంట్  ఉద్యోగులకు శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మాణానికి  రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు సీతమ్మధారలోని ప్లాంట్ క్వార్టర్లను ఖాళీ చేయమని యాజమాన్యం తమ సిబ్బందికి నోటీసులు ఇచ్చింది. తాజా పరిణామాలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.


ఒప్పందం ప్రకారం స్టీల్‌ప్లాంట్ భూముల్లో ఉద్యోగులకు టౌన్‌షిప్ నిర్మించాలి. ఆ మేరకు అగనంపూడిలోని సుమారు 200 ఎకరాల  ప్లాంట్ భూముల్లో టౌన్‌షిప్ నిర్మించాలని ప్రతిపాదించారు. అవి ప్లాంట్ భూములే అయినప్పటికీ టౌన్‌షిప్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ సర్కారు పచ్చజెండా ఊపడంలేదు. ప్రభుత్వ ముఖ్యుడి కుటుంబ సభ్యులతోపాటు జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆ భూములపై కన్నేయడమే దీని వెనుకనున్న ఆంతర్యం.  సుమారు రూ.వెయ్యి కోట్లు మార్కెట్ ధర ఉన్న ఆ భూములను నామమాత్రపు ధరతో 99 ఏళ్ల లీజుకు తీసుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం.

No comments:

Post a Comment