Sunday, December 27, 2015

సర్దుబాట్లపై స్పష్టతేదీ?

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది.

 సర్దుబాటు బదిలీలకు సంబంధించి కృష్ణా జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది.  ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

 ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment