Wednesday, December 2, 2015

సాగునీరు గోవిందా..!

తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నేతలు లీలలు చూపిస్తున్నారు. రెండో పంటకు సాగునీటి అక్కర్లేదని రైతుల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సాగునీటి సంఘాలతో తీర్మానాలు చేయించారు. రైతులకు సాగునీటికి కొదవలేదని ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటే.. మరోవైపు చాపకింద నీరులా టీడీపీ నేతల ప్రయత్నాలు చూసి రైతులు విస్తుబోతున్నారు. నీరు-చెట్టు పథకాన్ని సర్కారు ఒకందుకు ప్రటిస్తే.. పచ్చతమ్ముళ్లు మరొకందుకు ఉపయోగించుకుంటున్నారు.
         తూర్పుగోదావరి జిల్లాలో ఖరీప్ పంటలో నష్టపోయిన రైతులు రబీలో అయినా తేరుకుందామని భావిస్తుంటే.. వారి ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లుతున్నారు. జిల్లాలో ఎక్కడైతే పెద్ద  చెరువులున్నాయో ఆయా ప్రాంతాల్లో రెండో పంటకు నీరు ఇవ్వక్కర్లేదని సాగునీటి సంఘాలతో తీర్మానాలు చేయిస్తున్నారు. పిఠాపురం పరిధిలోని ఇలాంటి గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉంది.
           నీరు-చెట్టు పథకం కింద చెరువుల్లో పూడిక తీసి మట్టిని అమ్ముకోవడానికి టీడీపీ నేతలు సరికొత్త స్కెచ్ వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రైతుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నీరివ్వక్కర్లేదని ఎలా చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం సాగునీటి సంఘాల తీర్మానాలనే పరిగణనలోకి తీసుకుంటామని తేల్చిచెబుతున్నారు.

No comments:

Post a Comment