Wednesday, December 16, 2015

స్కూల్ యూనిఫాం అడ్రస్ ఏదీ?


ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాల విద్యార్థులకు ఏటా ఇచ్చే యూనిఫాం పంపిణీ మొక్కుబడి తంతే అవుతోంది. పాఠశాలలు తెరచుకుని ఆరు నెలలు పూర్తయినా అవి అందకపోవడంలో వీరి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ ఐటీడీఏ స్కూళ్లలో చదివే వారిలో పేదలే అధికంగా ఉన్నందున ఒకటి నుంచి 8వ తరగతుల వారికి సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా  ఏటా ఉచితంగా రెండు యూనిఫాం ఇస్తోంది.

ఈ సంవత్సరం జిల్లాలో 2,36,218 మంది పిల్లలకు రెండు జతల చొప్పున 4,72,436 యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి బడులు తెరిచిన కొద్దిరోజులకే వీటిని పంపిణీ చేయాలి. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వారికే కుట్టు పనులు దక్కించుకోవాలని పట్టుపట్టడంతో ఇన్నాళ్లూ యూనిఫాం ప్రక్రియ నిలిచిపోయింది.

  గత ఏడాది ఇలా కొందరు ప్రజాప్రతినిధులు బల్క్‌గా తమ అనుయాయులకు చేజిక్కించుకున్నారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద ప్రభుత్వం రూ.40 చెల్లిస్తుంది. ఇందులో జతకు రూ.5 వరకు కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ సంవత్సరం కూడా అదే తీరులో వ్యవహారం నడపాలని చూశారు. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు. చివరకు నవంబర్ 28న సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రాజకీయాలకు అతీతంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, హెడ్మాస్టర్లు అభీష్టం మేరకు టైలర్లకు ఇవ్వవచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో యూనిఫాంపై కదలిక వచ్చి ఆప్కో వస్త్రాలను ఆయా స్కూళ్లకు పంపడం మొదలెట్టారు. ఇప్పటిదాకా 70 శాతం వస్త్రాల పంపిణీ జరిగింది. మిగిలింది పంపిణీకి కనీసం మరో 15 రోజులైనా పడుతుంది. యూనిఫాం అందజేయకపోవడంతో చాలామంది సివిల్ డ్రెస్‌తో రోజు స్కూలుకు వెళ్లి వస్తున్నారు.

No comments:

Post a Comment