Wednesday, December 23, 2015

అంగన్ వాడీల్లో భయం భయం

చాలీచాలని జీతాలతో భారంగా బతుకీడుస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో వేతనాల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో అంగన్‌వాడీలు ఈనెల 18వతేదీన ‘ఛలో విజయవాడ కార్యక్రమం’  నిర్వహించారు.
ఇందుకోసం 13 జిల్లాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.  ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా అంగన్‌వాడీలపై దాడికి దిగారు. దీంతో శాంతియుత ప్రదర్శన కాస్తా.. ఖాకీల క్రౌర్యంతో రక్తసిక్తమైన సంగతి తెలిసింది. ఆ తర్వాత జీతాలను పెంచుతున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించినా జీవో మాత్రం జారీ చేయలేదు. పైగా అంగన్‌వాడీలపై కక్షసాధించే విధంగా.. ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను తొలగించాలని ప్రభుత్వం 21 వతేదీన స్పెషల్ ఆఫీసర్  కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి పేరుతో సర్క్యులర్ జారీ చేసింది.

చలో విజయవాడ కార్యక్రమానికి హాజరైన అంగన్‌వాడీలను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన ధర్నా ఫొటోలున్న సీడీలను ప్రాజెక్టు డెరైక్టర్‌కు పంపారు. ప్రాజెక్టు డెరైక్టర్ వాటిని సంబంధిత సీడీపీవోలకు పంపి జిల్లాకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఏవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఫొటోలో గుర్తించిన వారిని తొలగించాలని సంబంధిత కలెక్టర్‌ను స్పష్టంగా ఆదేశించారు. ఈ మేరకు ఫొటోల్లో ఉన్న జిల్లా కార్యకర్తలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

No comments:

Post a Comment