Monday, December 28, 2015

రొయ్యకు రోగం

 గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏపీలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు.

రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. అధికారులు కూడా సరిగ్గా సహకరించడం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. 

No comments:

Post a Comment