Monday, December 28, 2015

మట్టిని కొల్లగొడుతున్నారు

గ్రావెల్ తవ్వకాలు నెల్లూరు జిల్లా కావలి అడ్డాగా మారింది. మొన్న దగదర్తి. నేడు అల్లూరులో అక్రమతవ్వకాలు వెలుగుచూశాయి. కౌరుగుంటలో టీడీపీ నేతలు అక్రమాలు బయటపడటంతో.. విజిలెన్స్ అధికారులు స్పందించారు. వాహనాలను సీజ్ చేసి,  అక్రమ తవ్వకాలకు అట్టుకట్ట వేశారు. తాజాగా అల్లూరు మండలం నార్త్ ఆమలూరులో జరుగుతున్న భారీ అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వాణిజ్య అవసరాలకు గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోరంత అనుమతులు అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో అటవీ, రైల్వే స్థలాల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.

సింగంపేట, బట్రకాగొల్లు మీదుగా నార్త్ ఆమలూరుకు వెళ్లే దారిపొడవునా 20 అడుగుల లోతులో భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. రోజుకు 200 నుంచి 300 ట్రిప్పర్లు గ్రావెల్ తరలిస్తున్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో రోజుకు 600 ట్రిప్పర్ల గ్రావెల్ కూడా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో టిప్పర్ కు నాలుగు యూనిట్ల గ్రావెల్ నింపుతున్నారు. ఈ లెక్కన రోజుకు 1200 నుంచి 2400 యూనిట్ల గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. గ్రావెల్ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతల హస్తం ఉండటంతో.. అధికారులు కూడా చూసీచూడనట్లు పోతున్నారు.

No comments:

Post a Comment