Thursday, December 10, 2015

విషజ్వరాలకు జనం విలవిల

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనం విషజ్వరాలతో బెంబేలెత్తుతున్నారు. నవంబర్ లో వరదలకు కొట్టుకుపోయిన దోమ లార్వాలు.. వరదలు తగ్గగానే మళ్లీ కుంటల్లోకి చేరుకున్నాయి. దోమల దండయాత్ర పెరగడంతో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగాలకు తోడు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం జనాన్ని పీల్చి పిప్పిచేస్తోంది.
      నెల్లూరు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ఆస్పత్రులున్నా.. అజమాయిషీ చేసే వారే కరువయ్యారు. కనీసం రోగులకు కనీస వైద్యం అందించడంలో కూడా విఫలమౌతున్నారు. ప్లేట్ లెట్ కిట్లకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తప్పుడు రిపోర్టులు సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏకంగా గవర్నమెంట్ టీచర్ కే ప్లేట్ లెట్లు పడిపోయాయని తప్పుడు రిపోర్డులు ఇచ్చిన డాక్టర్లు.. కిట్లు ఎక్కువకు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి.
      ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ మాత్రం చోద్యం చూస్తోంది. అధికారులు సర్వేలు, సమీక్షలతో సరిపెడుతూ ఆస్పత్రుల తనిఖీల సంగతి గాలికొదిలేశారు. ఆసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతమంది విషజ్వరాలతో అడ్మిట్ అయ్యారు. ఎంత మందికి సరైన చికిత్స అందింది అనే గణాంకాలు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులు మేల్కోకపోతే జిల్లాలో విషజ్వరాలు విస్తరించడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment