Monday, December 21, 2015

అన్నల దూకుడు

పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఊపిరిపీల్చుకున్న యంత్రాంగానికి తెరవెనుక మావోయిస్టుల వ్యూహాలు ఆందోళన కలిగించగా తాజాగా నిరసన వారం మొదటిరోజే ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హతమార్చడం సంచలనమైంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నిరసన వారం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన మావోయిస్టులు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవరిస్తున్నాడనే నెపంతో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో వంతాల సత్యారావు అనే గిరిజనుడిని గొడ్డళ్లతో అతి కిరాతంగా నరికి చంపారు.
తమకు వ్యతిరేకంగా ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే భయాందోళనలు గిరిజనుల్లో కల్పించే ప్రయత్నం చేశారు. బాక్సైట్ ప్రభావిత అమ్మవారి ధారకొండ, జర్రెల, గాలికొండ, మొండిగడ్డ పంచాయతీల్లో మావోయిస్టులు నాలుగు గ్రూపులుగా విడిపోయి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వాటిలో కొన్ని గ్రూపులు బాక్సైట్ ఉద్యమాన్ని ఉధృతం చేయడంపై దృష్టి సారించగా, మిగతా గ్రూపులు కాఫీ తోటల ధ్వంసం, వాటిని గిరిజనులకు అప్పగించడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గ్రామాల్లో తిరుగుతూ గిరిజనుల మద్దతు కూడగడుతున్నారు.

మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు  కిరణ్ అలియాస్ కొండమంచి సువర్ణరాజు తాజా హత్యోదంతంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతనితోపాటు 30మంది సాయుధ దళ సభ్యులు గ్రామం నుంచి కొందరు గిరిజనులను వెంటబెట్టుకుని వచ్చి సత్యారావును తీసుకువెళ్లినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కిరణ్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కమిటీల్లో పనిచేసి ఐదేళ్ల క్రితం విశాఖలో అడుగుపెట్టాడు. ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి. కిరణ్‌ను పట్టిస్తే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందంటే అతను ఎంతటి మోస్ట్‌వాంటెడ్ సభ్యుడో అర్ధం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment