Wednesday, December 16, 2015

నిరసన ఫ్లెక్సీలతో మంత్రికి స్వాగతం



ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం కల్పించేందుకు గ్రామాల్లో జరుగుతున్న జనచైతన్య యాత్రల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినూత్న రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయి. భూసేకరణ నోటిఫికేషన్‌పై గుర్రుమీదున్న పలు గ్రామాల రైతులు ఈ యాత్రల వైపు కన్నెత్తి చూడడం లేదు.

భూసేకరణ నోటిఫికేషన్ నిర్ణయంపై తిరగబడి.. ప్రభుత్వంపై పలుమార్లు పోరాటాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పొట్లపాలెం గ్రామస్తులు ఇంటింటికీ నిరసన ఫ్లెక్సీలను వేలాడదీసి జనచైతన్య యాత్రలను బహిష్కరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్ మార్గంలో చెట్లకు ఫ్లెక్సీలను వేలాడదీసి గ్రామస్తులు నిరసన స్వాగతం పలికారు.

నిరసనల నుంచి తప్పించుకోవడానికి.. పోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌ను త్వరలోనే రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే రైతుల నుంచి భూములు తీసుకుంటామని చెప్పినా.. అనుకున్నంత స్పందన కనిపించలేదు. మొత్తం మీద రైతులంతా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న విషయం స్పష్టంగా అర్థమౌతోంది.



No comments:

Post a Comment