Sunday, December 20, 2015

నీటి వృథా పట్టదా..?

గోదావరి డెల్టాలో రబీ ఆరంభానికి ముందే నీటి కరవు వచ్చిపడింది. ప్రతి చుక్క పొదుపుగా వాడాలని ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులకు చెబుతున్నారు. అయితే అన్నదాతలకు ఉచిత సలహాలిస్తున్న అధికారులు బ్యారేజీ నుంచి నీరు లీకౌతున్నా పట్టించుకోవడం లేదు. రబీలో 12 టీఎంసీల నీటి కొరత ఉందని అధికారులు ముందే చెప్పారు. సహజ జలాల రాక తగ్గడంతో కొరత మరింత పెరిగింది.
    ఇటీవలే బ్యారేజీకి ఆధునీకరణ పనులు చేపట్టారు. అయితే పనులు నాసిరకంగా చేయడంతో.. బ్యారేజీ నుంచి రోజూ 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. అధికారులు తెలిసినా చూసీచూడన్లు వదిలేస్తున్నారు. కేవలం బ్యారేజీ నుంచే కాక.. ప్రధాన పంట కాలువల నుంచి కూడా నీళ్లు లీకౌతున్నాయి. గేట్ల కింద, పక్కన ఉండే రబ్బరు సీలు పోవడంతో.. నీళ్లు వృథా అవుతున్నాయి.
      కాలువల శివారు నుంచి మురుగునీటి కాల్వల వద్ద కూడా మరో 200 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. మొత్తం మీద ఈ సీజన్లో రోజుకు 500 క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ సీజన్లో మొత్తం నాలుగు టీఎంసీల నీళ్లు వృథా కాగా.. వీటితో 44 వేల ఎకరాలు పండించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇఫ్పటికైనా కళ్లు తెరచి, అధికారులతో పనులు చేయించాలని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment