Tuesday, December 29, 2015

ఏంటా యాపారం ?

ఏంటీ ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ ప్రాజెక్టు? ఆ వ్యాపారం మతలబేంటి?  ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి చేసిన ఫిర్యాదు వెనక సీరియసేంటి? అందులో ఎమ్మెల్యే కేఏ నాయుడు పాత్రేంటి? వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడిదే చర్చ విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిపై శ్రీకాకుళం ఎస్పీకి ఛాయాకుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఈ జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. ఇప్పటికే చెక్‌బౌన్స్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజా కేసు ఇరుకున పెట్టేదిలా కనిపిస్తోంది.

విజయనగరం జిల్లాలో చాలా దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేగా కె.ఎ.నాయుడిపై ముద్ర ఉంది. అంగన్వాడీ నియామకాలు... విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో ఆయనదే పైచేయి. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాల్లోనూ ఆయన హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. దారికి తెచ్చుకునే వ్యూహంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జెడ్పీ సమావేశాల్లో గళమెత్తుతారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఆయనపై చెక్‌బౌన్స్ కేసులున్నాయి. కొంతకాలం నుంచి ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి.

టీడీపీ గ్రూపు రాజకీయాల్లోనూ ఆయనది కీలకపాత్రే. ఇలా...అన్నింటికీ కేంద్రబిందువు అవుతున్న ఆయనపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీకి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఇందులోనూ ఈయన హస్తముందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పినందునే రెండు విడతలుగా  రూ. 10లక్షలు వరకు బ్యాంకు ఖాతాలో వేశానని, ఆయనతో పలు పర్యాయాలు ఫోన్‌లో మాట్లాడానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనడంపై ఎంతమేరకు నిజముందో తెలీదుగానీ, విషయం విన్న అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

No comments:

Post a Comment