Sunday, December 20, 2015

కర్నూలులో వసూల్ రాజాలు

కర్నూలు జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు వసూల్ రాజాల అవతారమెత్తారు. ఓబుళాపురం తర్వాత నాణ్యమైన ఖనిజాలకు ఖిల్లా అయిన ఈ ప్రాంతంలో.. మైనింగ్ నిర్వాహకుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోకుండా.. కోట్లు వెనకేస్తున్నారు.
          ఈ బాగోతంలో పోలీస్ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉండటంతో వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఇటీవలే అధికార పార్టీ పెద్దన్న అండతో ఈ ప్రాంతానికి బదిలీ అయి వచ్చిన.. యువ పోలీస్ అధికారి కూడా మామూళ్లకు తెరతీశారు. మైనింగ్ మామూళ్ల కోసం ఏకంగా ఓ కానిస్టేబుల్, హోంగార్డునే నియమించుకోవడం చర్చనీయంశమైంది.
       హంద్రీనీవా తీర ప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వేస్తున్నా చూసీచూడనట్లు పోతున్నారు. ట్రిప్పులతో సంబంధం లేకుండా ఒక్కో ట్రాక్టర్ కు నెలకు 12వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మైనింగ్ పైనా అధికారుల కన్ను పడింది. బేతంచెర్ల నుంచి రామళ్లకోట మీదుగా ఎమ్మిగనూరు, ఆదోనికి తరలుతున్న రాయల్టీ లేని ఐరన్ ఓర్ పై కన్నేశారు. నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని ఖజానాకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ పెద్దన్న అండతో మామూళ్ల దందా మూడు పువ్వులు ఆరుకాయలన్న చందంగా సాగుతోంది.

No comments:

Post a Comment