Friday, November 27, 2015

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని

ఏపీ సర్కారు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఓవైపు రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తామని మాటలు చెబుతుంటారు. మరోవైపు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు మాత్రం పూర్తిచేయరు. నెల్లూరు జిల్లాలో భారీవర్షాలు కురిసినా ఆ జిల్లాకు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి ఉంది. సర్కారుకు, అధికారులకు ముందుచూపు లేకపోవడంతో యాభై టీఎంసీల నీరు సముద్రం పాలైంది.
       నెల్లూరు జిల్లాలో పది రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరో అల్పపీడనం రెడీగా ఉంది. జిల్లాలో స్వర్ణముఖి, సంగం, పెన్నా బ్యారేజీలు ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో ఏది పూర్తైనా కనీసం 15 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అయితే పదేళ్లుగా నడుస్తున్న సంగం బ్యారేజీ పనులు కూడా పూర్తికాకపోవడం పాలకుల నిర్యక్ష్యమేనని బహిరంగ విమర్శలు వస్తున్నాయి.
         కనీసం ప్రాజెక్టులు పూర్తికాకపోయినా.. తొలివిడత వరదను బట్టి నీళ్లు నిల్వచేయాలనే ఆలోచన కూడా అధికారులు చేయలేదు. ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అడ్డుపట్టి రింగ్ బండ్ లు ఏర్పాటుచేస్తే కనీసం కొంతైనా నీరు నిల్వ ఉండేది. అయితే అధికారులు మాత్రం ఇసుక బస్తాల మాటే మరిచిపోయారు. మొత్తం మీద సర్కారు, అధికారులు కలిసికట్టుగా భారీ వర్షాల వల్ల నెెల్లూరుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా జాగ్రత్తపడ్డారు. 

No comments:

Post a Comment