Sunday, November 22, 2015

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించడం కోసం ఏపీలో ఇసుక రీచ్ లు డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరగవని రాష్ట్ర ప్రజలు భావించారు. అయితే డ్వాక్రసంఘాలకు అప్పగించడం వెనుక అధికార పార్టీ నేతల జేబులు నింపే మతలబు ఉందని ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. సాక్షాత్తూ సీఎం అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఇసుక రీచ్ లోనే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
          గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని పెనుమాక రీచ్ లో అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. ఇక వే బిల్లులూ, గీ బిల్లులూ జాన్తానై అంటున్నారు. రాత్రి పూట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారు. పగలైతే దిశమార్చేసి పనులు కానిస్తున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
        డ్వాక్రసంఘాల పేరుతో ఇసుక రీచ్ లు నిర్వహణ ఉత్తర్వులు రాగానే.. అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ డ్వాక్రాసంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పేరు డ్వాక్రసంఘాలది, ఆదాయం తమది అనే విధంగా దందా నడిపిస్తున్నారు. ఇసుక సీనరేజ్ ఛార్జీలు, వే బిల్లులకు తిలోదకాలు వదిలి జేబులు నింపుకోవడమే పనిగా పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నారు. సీఎం అధికార నివాసం సమీపంలో భారీ వాహనాలకు భద్రత పేరుతో రాత్రిపూట అనుమతి లేదు. కానీ ఇసుక లారీలకు మాత్రం రాచబాట పరచడం చూస్తుంటే.. ఇందులో పెద్దతలకాయలకు కూడా హస్తముందని అనుమానాలొస్తున్నాయి. 

No comments:

Post a Comment