Friday, November 20, 2015

బొండు ఇసుకనూ బొక్కేస్తున్న తమ్ముళ్లు

ఎందుకూ పనిరాని బొండు ఇసుకతో కూడా కోట్లు సంపాదించవచ్చని తెలుగు తమ్ముళ్లు నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఇసుక అక్రమాలకు తెరతీసిన టీడీపీ నేతలు.. తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర తీరాన్ని కూడా మింగేస్తున్నారు. తీర ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నా.. తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. వీరికి అధికారులు సహకరించడంతో పని తేలికైపోతోంది.
                కోస్తాలో తుఫాన్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో తీరప్రాంత పరిరక్షణ చాలా అవసరం. తీరాన్ని సహజసిద్ధంగా ఉన్న పరిస్థితులకు ఏమాత్రం భంగం కలిగించినా..ముప్పు తప్పదు. కాకినాడ సముద్ర తీరం పరిధిలో యథేచ్ఛగా బొండు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో సముద్రానికి చేరువలో లోతైన గుంటలు ఏర్పడుతున్నాయి. ఈ గుంటలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రమాదకరంగా మారతాయని, అప్పుడు ముంపు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
              నిజానికి బొండు ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. కానీ ప్రస్తుతం ఇసుక రేటు చుక్కలను అంటుతున్న నేపథ్యంలో.. బొండు ఇసుకను పునాదుల్లోనూ, ఇసుక కల్తీ చేయడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. లోడు బొండు ఇసుక ధర 2500 నుంచి 3000 వరకు పలుకుతోంది. దీంతో ఇసుక తవ్వకాల ద్వారాకోట్ల రూపాయలు వెనకేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించకుండా ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. 

No comments:

Post a Comment