Saturday, November 21, 2015

అంగన్ వాడీలను విభజించు పాలించు

ఏపీలో అంగన్ వాడీల ఉద్యమంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్న సర్కారు.. ఇప్పుడు మరో జిత్తులమారి ఎత్తుగడ వేసింది. అంగన్ వాడీల కోసం టీడీపీకి అనుబంధంగా యూనియన్ ఏర్పాటుచేస్తున్నామని ఆపార్టీ కార్యకర్తలు ఊదరగొడుతున్నారు. అంగన్ వాడీల జీతాలు పెంచుతామని ఇప్పటికి రెండుసార్లు ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు.. ఇంతవరకూ జీవో ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని, ఇప్పుడు యూనియన్ పేరుతో చీలికలకు కుట్ర చేస్తున్నారని అంగన్ వాడీలు మండిపడుతున్నారు.
            అంగన్ వాడీలు మొదట్నుంచీ బాబును నమ్మడం లేదు. కారణం ఆయన గత చరిత్రే. 2000వ సంవత్సరంలో బాబు అధికారంలో ఉండగా హైదరాబాద్ లో నిరసన తెలిపిన అంగన్ వాడీలను బూటుకాళ్లతో తొక్కించి, గుర్రాలతో తొక్కించారు. తర్వాత వారిని మదర్స్ కమిటీకి అప్పగిస్తూ.. జీతాలు పెంచకుండా మీనమేషాలు లెక్కబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్ వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వయోపరిమితి అరవై ఏళ్లకు కుదించి అర్థంతరంగా చాలా మందిని పీకి పారేశారు.
            మహిళల పట్ల తమ పార్టీకి మించిన గౌరవం మరెవరికీ లేదని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. సాక్షాత్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సభలో నిరసన తెలిపిన 15 మంది అంగన్ వాడీల ఉద్యోగాలు పీకేశారు. అసెంబ్లీ సాక్షిగా అంగన్ వాడీల జీతాలు పెంచుతామని చెప్పి మాట తప్పారు. దీన్ని బట్టి నేను మారానని చంద్రబాబు చెప్పుకున్న మాటలు బూటకమేనని తేలిపోయిందని అంగన్ వాడీలు భావిస్తున్నారు. యూనియన్ పేరుతో కొత్త కుట్రలకు తెరతీస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. 

No comments:

Post a Comment