Thursday, November 19, 2015

కమీషన్లు మింగి.. కూలీల కడుపు కొట్టి

పథకం ఏదైనా అది అంతిమంగా అధికార పార్టీకే లబ్ధి చేకూరుస్తోంది. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులే అందుకు ఉదాహరణ. ఉపాధి హామీ పనులను నామినేటెడ్ పద్ధతిలో చేజిక్కించుకున్న నేతలు.. కూలీలతో పనులు చేయించకుండా.. అర్థరాత్రి యంత్రాలతో పని కానిస్తున్నారు. తనిఖీలు జరపాల్సిన పంచాయతీరాజ్ ఇంజినీర్ కూడా వీరితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.
              విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి, కొండలావేరు పంచాయతీ పరిధిలో అరవై లక్షల రూపాయల విలువైన రోడ్డు కాంట్రాక్టును మండల స్థాయి టీడీపీ నేత నామినేటెడ్ పద్ధతిన దక్కించుకున్నారు. మొత్తం టెండర్ విలువలో పదిశాతం కమీషన్ కొట్టేసిన ఈ నేత.. దాన్ని మరో ఇద్దరు గ్రామస్థాయి నేతలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చాడు. దీంతో తక్కువ నిధులతో పని కానిచ్చేద్దామనుకున్న నేతలు కూలీలతో చేయాల్సిన పనులు కూడా యంత్రాలతో చేసేస్తున్నారు.
             మొత్తం బాగోతాన్ని పత్రికలు ఫోటోలతో సహా బయటపెట్టడంతో అధికారులు అప్రమత్తమై పనులు ఆపించేశారు. కూలీల మస్తర్ల నమోదు కానీ, పే ఆర్డర్ జనరేట్ చేయడం కానీ ఏమీ లేకుండానే పనులన్నీ జరిగిపోతున్నాయని విచారణలో తేలింది. ప్రొక్లెయిన్ తో రోడ్డు తవ్విన ఆనవాళ్లు కూడా లభించాయి. దీంతో మరింత లోతుగా విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. అయితే పచ్చతమ్ముళ్ల చేతికి మట్టి అంటకుండా అధికారులే కాపు కాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments:

Post a Comment