Wednesday, November 18, 2015

కోర్టు చొరవతో కదలుతున్న డొంక

తూర్పుగోదావరి జిల్లా తాండవ నదిలో ఇసుకాసురులకు హైకోర్టు ఉత్తర్వులు షాకిచ్చాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇసుక దొంగలంతా గప్ చుప్ గా పరారయ్యారు. తాండవనదీ పరీవాహక ప్రాంతానికి వచ్చిన అధికారులు అక్కడేమీ కనిపించలేదు. అయితే మొత్తం 59 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వినట్లు నిర్థారించారు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు 24 లక్షల రూపాయలు సీనరేజీ చెల్లించాల్సి ఉండగా.. ఏమీ కట్టలేదని తేలింది.
      అయితే తనిఖీలకు వెళ్లిన అధికారులతో పాటు ఇసుక అక్రమాలకు వత్తాసు పలుకుతున్న నేతలు కూడా వెళ్లడం వివాదాస్పదమైంది. హైకోర్టు అధికారులు నివేదిక అడిగిన తరుణంలో.. నేతలు వారిని మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా అధికారులే మేనేజ్ చేయాలని పచ్చచొక్కాలు అధికారులను వేపుకుతింటున్నాయి.
         మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరుపై అధికార వర్గాల్లో నిరసన వ్యక్తమౌతోంది. అటు కోర్టు, ఇటు టీడీపీ నేతలు మధ్యలో తాము చస్తున్నామని మొత్తుకుంటున్నారు. గత కాంగ్రెస్ హయాం అవినీతి మయం అని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. హస్తం నేతలకే దిమ్మ తిరిగేలా ఇసుక దోచుకున్నారని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇసుకతో ఈరేంజ్ లో బిజినెస్ చేయొచ్చని అన్ని పార్టీలకు టీడీపీ నేతలు మార్గనిర్దేశం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

No comments:

Post a Comment