Sunday, November 22, 2015

ఊరూరా బెల్టు షాపులు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో బెల్టుషాపులు రద్దుచేస్తూ సీఎం చంద్రబాబు ఫైల్ పై సంతకం చేశారు. అందుకు తగ్గట్లుగానే తొలినాళ్లలో కాస్త హడావిడి చేసిన ఎక్సైజ్ అధికారులు.. బెల్ట్ షాపులను మూయించేశారు. అయితే క్రమంగా మద్యం దందా పచ్చ తమ్ముళ్ల చేతికి రావడంతో.. మళ్లీ బెల్ట్ షాపుల ప్రవాహం మొదలైంది. అనంతపురం జిల్లాలో కరవున్నా.. మద్యానికి మాత్రం లోటులేకపోవడం అధికార పార్టీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
           ఎక్సైజ్ దందాలో అధికారులకు కూడా నెలవారీ మామూళ్లు అందడంతో వారు కూడా చూసీచూడనట్లు పోతున్నారు. ఈ మామూళ్ల దందా కోసం మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల చీప్ లిక్కర్ పై ప్రభుత్వం పన్నులు తగ్గించి.. ఖరీదైన మద్యంపై పెంచింది. అయినా సరే ఎక్కడా చీప్ లిక్కర్ ధర తగ్గించి అమ్మడం లేదు. పాత రేటునే కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
          పల్లెల్లో కూలీనాలీ చేసుకునే జనం పట్టణాలు, మండల కేంద్రాలకు వెళ్లి తాగలేరు. బెల్టుషాపులు రద్దుచేస్తే వీరు మందుపై ఖర్చు మిగిలి, కుటుంబాలకు ఆదా అవుతుంది. ఈ ఉద్దేశంతో బెల్ట్ షాపులు రద్దుచేస్తామని గతంలో చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఊళ్లల్లో మద్యం ఏరులై పారుతోంది. బాబొచ్చినా బెల్టు తీయలేదని సెటైర్లు పడుతున్నాయి.  

No comments:

Post a Comment