Monday, November 23, 2015

రైతులకు సర్కారు వెన్నుపోటు

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కూడా వెన్నుపోటు పొడుస్తోంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొంటామన్న అమాత్యుల హామీలు నీటిమూటలయ్యాయి. రైతుల దగ్గరకు వెళ్లి ఆర్భాటంగా హామీలిచ్చిన మంత్రులు,, ఐకేపీ కేంద్రాలకు మాత్రం ఉత్తర్వులివ్వకుండా చేతులు దులుపుకున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాలు చేతులెత్తేస్తున్నాయి. చేసేది లేక తక్కువ ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు.
              పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో ధాన్యం తడిసిందని అంచనా. జిల్లా మంత్రి పీతల సుజాత, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి సర్కారే కొంటుందని హామీ ఇచ్చారు. సర్కారు లెక్క ప్రకారం బస్తా ధాన్యానికి కామన్ వెరైటీ అయితే 1057 రూపాయలు చెల్లించాలి. అయితే ఐకేపీ గైర్హాజరీలో మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగి కేవలం 810 రూాయలే చెల్లిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు.
           తేమశాతం, వర్షాలను సాకుగా చూపి ధర తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అయితే మిల్లర్లు, దళారులు కుమ్మక్కై కేవలం 15 శాతం తేమ వరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఇష్టం వచ్చిన ధర కడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే అసలు ధాన్యమే కొనమని బెదిరిస్తున్నారు. వేరే దిక్కులేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్భాటపు ప్రకటనలు మాని, పని చేసి చూపించాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment