Wednesday, November 11, 2015

మన్యంలో బాక్సైట్ సెగలు

బాక్సైట్ తవ్వకానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ మన్యంలో నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే ఐక్య ఉద్యమం దిశగా గిరిజనులు సంఘటితమవుతుంటే.. వారికి మద్దతుగా ఏయూలో విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. ఏయూలో విద్యార్థుల దీక్షలకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా గిరిజనుల పొట్ట కొట్టడానికి సర్కారు కంకణం కట్టుకుందని విమర్శలు వస్తున్నాయి.
             ప్రతిపక్షంలో ఉండగా గిరిజనులపై కపట ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు అసలు రంగు బయటపెట్టారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మన్సంలో బాక్సైట్ తవ్వకాలు జరగనీయమని వారు తేల్చిచెప్పారు. గిరినులను మన్యం నుంచి తరిమివేసే లక్ష్యంతో సర్కారు చర్యలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
             గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు.. బాక్సైట్ తవ్వకాలకు అనుమతితో వారి మనుగడనే ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు గిరిజన సలహా మండలి అనుమతులు అవసరం ఉండగా.. సర్కారు ఏకపక్షంగా జీవో జారీ చేసిందని ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతోందని, రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విద్యార్థులు, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment