Wednesday, November 11, 2015

సర్కారు పుణ్యంతో దీపావళికి పస్తు

ఔట్ సోర్సింగ్ కార్మికులను, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం. ఇది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వల్లించిన చిలక పలుకులు. కానీ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఇవన్నీ మరిచిపోయారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్నవారని కూడా ఊడపీకుతున్నారు. కొంతమందిని తీసేయడం కుదరకపోతే.. వారికి జీతాలు ఇవ్వకుండా నానా పాట్లకు గురిచేస్తున్నారు.
              కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్ వాడీలు, ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. వీరి జీతాలు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల లోపే ఉన్నా.. సర్కారు మాత్రం బడ్జెట్ లేదంటూ కుంటిసాకులు చెబుతోంది.
             వందల కోట్లతో అమరావతి శంకుస్థాపన ఆర్భాటంగా నిర్వహించిన ప్రభుత్వానికి తమ ఆకలి తీర్చడానికి చేతులు రావడం లేదని అంగన్ వాడీలు మండిపడుతున్నారు. నెలకు ఐదు వేల రూపాయలతో బతకడమే కష్టమని, అలాంటిది ఆరు నెలలుగా జీతాలు రాకపోతే మనుషులు ఎలా బతుకుతారన్న కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి పొట్ట గొడుతున్న సర్కారు.. తమను పండగ రోజు కూడా పస్తు పడుకోబెట్టిందని మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment