Thursday, November 12, 2015

రెయిన్ గన్ రాజకీయం

సర్కారు నిధులు స్వాహా చేయడానికి అధికార పార్టీ నేతలు కొత్తదారులు వెతుకున్నారు. రైతుల పేరు చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయం మొదలుపెట్టారు. స్వయంగా సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రెయిన్ గన్లపై ఆసక్తి చూపకపోయినా.. ప్రత్తిపాటి మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రెయిన్ గన్లు రైతులకు సరఫరా చేస్తామని, దీంతో వర్షాభావం ఉన్నా మంచి దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
          ప్రత్తిపాటి రెయిన్ గన్ రాజకీయంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. వరికి, పత్తికి ప్రస్తుత దశలో రెయిన్ గన్లతో ఉపయోగం లేదని, పైగా ఇప్పటికే పొట్ట దశలో ఉన్న వరి పంటపై రెయిన్ గన్లు ఉపయోగిస్తే.. రంగు మారి గిట్టుబాటు ధర కూడా రాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి అన్నీ తెలిసినా సదరు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడానికే హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
         ఆరు నెలల క్రితం ఇదే తరహాలో వరి బాగా పండించే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు డయ్యర్లు సరఫరా చేశారు. ధాన్యం ఎండబెట్టే యంత్రాలు అప్పట్లో ఉపయోగపడవని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా ప్రభుత్వంతో సబ్సిడీ కూడా ఇప్పించారు. అయినా రైతులు ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో సంబంధిత కంపెనీ నష్టపోతోందని చెప్పి.. వాటిని మార్కెట్ కమిటీలతో కొనిపించారు. ఇప్పటికి అవి అలంకార ప్రాయంగానే ఉన్నాయి. రెయిన్ గన్ల వెనుక కూడా ఇలాంటి రాజకీయమే ఉందని అధికారులు గుసగుసలాడుతున్నారు.  

No comments:

Post a Comment