Friday, November 13, 2015

ప్రైవేటు ప్రతిభకే పట్టం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి విద్యార్థుల్ని ఆకర్షించాల్సిన ప్రభుత్వం.. ప్రతిభా అవార్డులకు కూడా కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులను ఎంపిక చేసి.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని అవమానిస్తోంది. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, స్వయంకృషి, పట్టుదలతో మంచి మార్కులు సాధించే విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ప్రతిభ అవార్డుల్ని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఆ అవార్డుల ఎంపికలో కూడా కార్పొరేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్ని చిన్నచూపు చూడటంపై విమర్శలు వస్తున్నాయి.
           స్వయంగా సొంత జిల్లా చిత్తూరులో మూడో వంతు ప్రతిభా అవార్డులు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల విద్యార్థులకే దక్కడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా అధికారులు పంపించిన జాబితాను తనిఖీ చేయాల్సిన పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా మొద్దునిద్ర పోతున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఇలాంటి ప్రతిభా అవార్డులతో ఏ ఉపయోగం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
          చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ప్రతిభా అవార్డుల్లో చాలావరకు ప్రైవేట్ విద్యార్థులకే ఇచ్చిన అధికారులు.. ఉన్న కొంతమంది ప్రభుత్వ విద్యార్థులకు కూడా సమాచారం చేరవేయడంలో నిర్లక్ష్యం వహించారు. ప్రతిభా అవార్డుకు అర్హత ఉన్న ఓ విద్యార్థి తండ్రి డీఈవో కార్యాలయానికి వచ్చి అవార్డు గురించి వాకబు చేసినా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. ఆయన నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రతిభా అవార్డులు ఇస్తూ ప్రైవేట్ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తే ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment