Saturday, November 14, 2015

జీవీఎంసీలో మిత్రభేదం

ఏరు దాటే దాకా ఏరు మల్లన్న.. ఏరు దాడాక ఓడ మల్లన్న. ఇది ఓ సామెత. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో తెలుగు తమ్ముళ్ల తీరు చూస్తుంటే అచ్చం అలాగే ఉంది. ఇప్పటిదాకా బీజేపీతో అంటకాగి, కీలకమైన విశాఖ ఎంపీ సీటును కూడా బీజేపీకి కట్టబెట్టి.. అదేమంటే మిత్రధర్మమని గొప్పలు చెపుకున్న టీడీపీ.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు బీజేపీకి కట్టబెట్టాలని కొంతకాలంగా ఆందోళన చెందుతోంది. అయితే బీహార్ ఎన్నికలు టీడీపీ నెత్తిన పాలు పోశాయి.
            బీహార్ ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో.. మిగతా తెలుగు తమ్ముళ్ల సంగతి ఏమోకానీ.. గ్రేటర్ విశాఖ టీడీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటివరకు జీవీఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు బీజేపీకి ఇవ్వాలని చర్చలు జరిపిన నేతలు.. సీట్ల సంఖ్య బాగా తగ్గించేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కువ మాట్లాడితే అసలు పొత్తే వద్దని కూడా మొండికేస్తున్నారు.
               టీడీపీ నేతల తీరును గమనిస్తున్న బీజేపీ.. అన్నీ తెలిసినా ఏమీ చేయలని స్థితిలో పడిపోయింది. అవసరమైతే తాము కూడా ఒంటరిగా పోటీ చేస్తామని అంతర్గతంగా కమలదళం మాట్లాడుకుంటున్నా.. విశాఖలో తమది వాపే కానీ బలుపు కాదని వారికీ తెలుసు. అవసరమైతే జాతీయ నేతలతో చంద్రబాబుకు చెప్పించి.. జీవీఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేయాలని, తెలుగు తమ్ముళ్ల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కమలదళం భావిస్తోంది. 

No comments:

Post a Comment