Thursday, November 12, 2015

పంతుళ్ల కడుపులు మాడుస్తున్న సర్కారు

అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారి జీతాలకే ఎసరుపెట్టారు. విద్యా సంవత్సరం మొదలై ఐదు నెలలు గడిచినా.. కేవలం ఒకటిన్నర నెల జీతం మాత్రమే ఇచ్చి అధ్యాపకుల  కుటుంబాలను పస్తులుంచుతున్నారు. సమస్యను ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా, ధర్నాలు చేసినా ఫలితం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
            2000వ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం లోకి వచ్చాక వారి మాట మరిచిపోయారు. నాలుగు నెలల తర్వాత మంత్రులు గంటా, యనమల, పల్లె, కామినేనితో సబ్ కమిటీ ఏర్పాటు చేసి.. కాంట్రాక్టు అధ్యాపకులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
             అయితే కమిటీ ఏర్పాటై సంవత్సరం గడిచినా ఇంతవరకూ అతీగతీ లేదు. ఎవర్నడిగినా సరిగా స్పందించడం లేదని, తమ పొట్టకొట్టడం న్యాయం కాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ చేసినా, చేయకపోయినా కనీసం తమ జీతాలైనా ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. చిత్తూరు పర్యటనకు వస్తున్న చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని చెబుతున్నారు.

No comments:

Post a Comment