Friday, November 27, 2015

క్యాష్ బ్యాక్.. సర్కారు సరికొత్త ఆఫర్

ప్రభుత్వ పాఠశాలలకు ఏపీ సర్కారు సరికొత్త స్కీమ్ ప్రకటించింది. పాఠశాలల్లో వాడని డబ్బులు ఉంటే వెనక్కిచ్చేయాలని కోరింది. ఏటా నిధులివ్వాల్సిన సర్కారు డబ్బులివ్వకపోగా.. ఉన్న నిధులు వెనక్కిచ్చేయమంటోందేమిటని ప్రధానోపాద్యాయులు లబోదిబోమంటున్నారు. సంక్షేమ రాజ్యం తెస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏలుబడిలో ఇలాంటి చోద్యాలకు కొదవేలేదు.
            ప్రభుత్వ పాఠశాలలకు మాధ్యమిక శిక్ష అభియాన్ కింద ఏటా యాభై వేల రూపాల నగదు ఇవ్వాలి. అయితే గత సంవత్సరం కేవలం నలభై ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. యాభై వేల రూపాయల్లోకూడా 75 శాతం కేంద్రనిధులు కాగా.. 25 శాతం నిధులు రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంది. స్కూళ్లకు డబ్బులు ఎగ్గొట్టిన సర్కారు.. గత ఏడాది నిధులను చాలా పాఠశాలల వాడుకోలేదని గమనించి అవి ఇచ్చేయమని కోరుతోంది.
              ఇచ్చిన నిధుల్లో ఇరవై ఐదు వేలు ప్రయోగశాలలకు, పరికరాలకు ఉపయోగించుకోవాలి. పదివేలు పత్రికలు, లైబ్రరీపుస్తకాలకు ఉపయోగించాలి. మరో పదిహేను వేలు మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించాలి. అయితే చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఏమీ చేయకుండా నిధుల్ని మురగబెడుతున్నారు. దీంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్టవేశాయి. ఇప్పుడు సర్కారుకు కూడా అలాంటివారిని ప్రోత్సహిస్తూ నిధులు వెనక్కివ్వమనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments:

Post a Comment