Tuesday, November 24, 2015

నష్టం అపారం.. అరకొరగా పరిహారం

పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా అస్తవ్యస్తం అయింది. జిల్లా వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. అయితే రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు.. కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రులు చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన కుదరదడం లేదంటున్నారు.
             చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల ధాటికి అరవై వేల ఎకరాలు నీట మునిగాయి. ఐదు వేల ఎకరాల్లో ఉద్యానపంటలు నాశనమయ్యాయి. ఆరు వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. ఇంత జరిగినా అధికారులెవరూ క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. కనీసం గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోలేదు. వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్, గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ జల్లడం వంటివి కూడా చేయలేదు.
            చిత్తూరు జిల్లాలో వరదలను సమర్థంగా ఎదుర్కున్నామని కలెక్టర్ ప్రకటిస్తున్నా.. రైతులు మాత్రం తమకు దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందు గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు.. గ్రామాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఎవరికీ ఏమీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చామని చెప్పుకోవడం ఫ్యాషనైపోయిందని మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment