Sunday, November 8, 2015

చింతమనేనిపై అవ్యాజ ప్రేమ

అంగబలం, అర్థబలానికి తోడు అధికార బలం కూడా తోడుగా ఉంటే.. ఇక నేరం చేస్తే మాత్రం కేసులేముంటాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో పోలీసుల వ్యవహారశైలి ఇలాగే ఉంది. అభయారణ్యంలో అక్రమంగా రోడ్డు వేశారని రుజువైన, అదేమని ప్రశ్నించిన అధికారులపై చేయి చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చినా.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తే పరిశీలనలో ఉందని సమాధానం చెబుతున్నారు.
             చింతమేనిపై కేసు పెట్టకపోగా.. పోలీసులు వింత వాదన వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో కూడా అటవీ చట్టం కింద కేసు నమోదైందని, ఇప్పుడు కూడా అదే చట్టం కింద ఫిర్యాదు చేశారని, ఒకే చట్టం కింద రెండు కేసులెందుకనే ఆలోచనలో ఉన్నామని.. ఖాకీలు చట్టానికే కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రస్తుతం విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని, వారు చెప్పినట్లుగా నడుచుకుంటామని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
              ఇక చింతమనేని విషయంలో అటవీ, పోలీస్ అధికారుల తీరు మొదట్నుంచీ అనుమానాస్పదంగా ఉంది. చింతమేని కోమటిలంక రోడ్డుపై కన్నేశారని తెలిసినా, ఆయన అర్థరాత్రి వస్తారని తెలిసినా.. డీఆర్వో, పోలీసులు మౌనం వహించారు. అటవీ సిబ్బంది ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అధికారంలో ఉన్నవారికి మడుగులు వత్తితే.. అధికారులు కూడా శిక్ష అనుభవించక తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment