Tuesday, November 24, 2015

అప్రెంటీస్ వ్యవస్థపై సర్కారు మోజు

ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో ప్రవేశపెట్టిన అప్రెంటీస్ వ్యవస్థను మళ్లీ తీసుకురావడానికి ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. డీఎస్సీ పరీక్షలు ముగిసి ఆరు నెలలు గడిచినా తుదిఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. కోర్డు కేసుల నేపథ్యంలో ఆలస్యం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మెరిట్ అభ్యర్థులను విద్యా వలంటీర్లుగా తీసుకోవాలని సర్కారు ఆలోచన చేసినట్లు తెలియడంతో డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
              గతంలో చంద్రబాబు హయాంలో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను రెండేళ్లపాటు వలంటీర్లుగా నియమించేవారు. అప్పుడు వారికి 1200, 1500 రూపాయలు మాత్రమే వేతనం చెల్లించేవారు. అప్రెంటీస్ షిప్ పూర్తిచేసుకున్నవారికే ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చేవారు. అయితే ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పోరాటంతో 2008 డీఎస్సీ నుంచి ఈ వ్యవస్థ రద్దైంది. ఇప్పుడు మళ్లీ అప్రెంటీస్ వ్యవస్థకు పురుడు పోసే ప్రయత్నం సరికాదని డీఎస్సీ అభ్యర్థులు హితవు పలుకుతున్నారు.
            అప్రెంటీస్ షిప్ వద్దంటూ మంత్రి గంటాకు సోషల్ మీడియా ద్వారా వినతులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏకకాలంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడాలని చూస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. కోర్టులో విచారణ తుది దశకు వచ్చిన నేపథ్యంలో విద్యా వంలటీర్ల ఆలోచన కుట్రేనని మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment