Wednesday, November 25, 2015

టెన్త్ విద్యార్థులకు ఆన్ లైన్ తిప్పలు

సంక్షేమ పథకాల అమలులో అట్టడుగున ఉన్న ఏపీ సర్కారు.. విద్యార్థులను మాత్రం పీడిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆన్ లైన్లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని నిబంధన పెట్టింది. అయితే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు లేవు. కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో వీరంతా నెట్ సెంటర్ల ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు భారం అని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
           ఆన్ లైన్ అప్లికేషన్ కు ప్రతి స్కూల్ కు ఇచ్చిన యూజర్ నేమ్ నే పాస్ వర్డ్ గా ఇచ్చి వెబ్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. అయితే బయట ఇంటర్నెట్ సెంటర్లో.. అప్లికేషన్ కు పది రూపాయలు, ఫోటో, సైన్ స్కానింగ్ కు ఇరవై రూపాయలు చొప్పున మొత్తం ముప్ఫై రూపాయలు ఖర్చవుతోంది. అయితే ఇదే అదనుగా కొంతమంది టీచర్లు అదనపు మొత్తం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
       ఇంటర్నెట్ సెంటర్లు పట్టణాల్లోనే ఉన్నాయి. పల్లెల్లో అరకొరగా ఉన్నా.. అక్కడ నెట్ కనెక్ట్ అవదు. అయినా ఎప్పుడు పనిచేస్తుందో దేవుడికే తెలియాలి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులే ఉంటారు కాబట్టి.. వీరికి ఆన్ లైన్ భారంగా మారింది. అయితే ఆఫ్ లైన్లోనూ అప్లికేషన్లు ఇవ్వచ్చని అధికారులు చెబుతున్నా.. దీనిపై ప్రచారం మాత్రం చేయడం లేదు. మొత్తం మీద ఈసారి టెన్త్ విద్యార్థులకు పరీక్షలు రాయకముందే చుక్కలు కనిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment