Friday, November 20, 2015

మంత్రి రావెలకు రాపిడి ఎక్కువైంది

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుకు గుంటరు జిల్లాలో అసమ్మతి సెగ తగులుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల పరిధిలో మంత్రి వ్యతిరేక వర్గం జోరు పెంచింది. త్వరలో జరగబోయే టీడీపీ జనచైతన్య యాత్రలకు మంత్రి ఎలా వస్తారో చూస్తామని ఎంపీపీ సవాలు విసరడం రావెలపై రాజుకుంటున్న అసమ్మతికి అద్దం పడుతోంది.
              మంత్రి వ్యవహారశైలిపై నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోనూ నిరసన వ్యక్తమౌతోంది. మంత్రికి అనుకూలంగా ఉన్న ఆయన అనచురులు కూడా మంత్రి వైఖరిపై పెదవి విరుస్తున్నారు. ఎన్నికల హామీలేవీ నెరవేర్చడం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే.. అసలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు వ్యతిరేక వర్గం తమకు అనుకూలంగా మంత్రి ఉండటం లేదన్న కోపంతో ఉంది.
             ఎంపీడీవో బదిలీ, మండల పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వంటి అంశాల్లో రావెల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. దీంతో గతంలో జడ్పీటీసీగా ఉండి ఇప్పుడు జడ్పీ ఛైర్మన్ గా జానీమూన్ కూడా మంత్రికి దూరమయ్యారు. జానీమూన్ మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినట్లు వింటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మంత్రి రావెల వచ్చే ఎన్నికల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. 

No comments:

Post a Comment