Sunday, November 22, 2015

కొండంత నిర్లక్ష్యం

వడ్డీకాసుల వాడికి నిలువుదోపిడీ సమర్పించే భక్తుల ప్రాణాలకు మాత్రం నిలువ నీడ లేకుండా పోతోంది. టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. తిరుమల రెండో ఘాట్ రోడ్డును ప్రమాదాలకు కేంద్రంగా మార్చింది. ఈ రోడ్డులో ఏడో కిలోమీటర్ నుంచి పదహారో కిలోమీటర్ వరకు తరచుగా కొండరాళ్లు విరిగిపడుతున్నా.. తగిన మరమ్మతులు చేయడంలో అధికారులు అలక్ష్యం ప్రదర్శించారు.
            రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పదిహేనే కిలోమీటర్ దగ్గ భాష్యకార్ల సన్నిధి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డును మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సరిగ్గా కొండచరియలు విరిగిపడిన స్థలంలోనే సరైన రీతిలో మరమ్మతులు చేయాలని గతంలో నిపుణులు సూచించినా అధికారులు పట్టించుకోలేదు.
             2003లో భాష్యకార్ల సన్నిధి వద్ద పటిష్ఠమైన ఘాట్ రోడ్డు  నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. అప్పుడే గ్రౌట్, యాంకరింగ్ పద్ధతుల్లో పనులు చేయాలని నిపుణులు చెప్పినా.. అధికారులు పట్టించుకోలేదు. కోట్ల రూపాయలు ఖర్చౌతుందనే సాకుతో.. పనులుచేయని ఫలితం ఇప్పుడు భక్తులు అనుభవిస్తున్నారు. దేవుడి పేరుతో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న టీటీడీ ఘాట్ రోడ్డు పటిష్ఠతపై చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం కూడా తగిన పర్యవేక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు. 

No comments:

Post a Comment