Friday, November 27, 2015

ఒంగోలులో అవినీతి మొక్కలు

నీరు చెట్టు కార్యక్రమం కింద మొక్కలు పెంచమని సర్కారు చెబితే.. అధికారులు మాత్రం అవినీతి మొక్కలను బాగా పెంచారు. పరిపాలనపరమైన అనుమతులకు, వచ్చిన మొక్కలకు పొంతన లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారుల బాగోతం.. ఇప్పుడు ఎంపీడీవోల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
        ప్రకాశం జిల్లాలో నీరుచెట్టు కార్యక్రమం కింద భారీగా మొక్కలు కొనుగోలు చేశారు. అన్నీ కడియం నర్సరీల నుంచి టెండర్ల ద్వారా తీసుకున్నారు. అయితే రైతు కడియం వెళ్లి మొక్క తెచ్చుకుంటే రవాణా ఛార్జీలతో కలిపి.. పదకొండు రూపాయలే అవుతుండగా.. అధికారులు మాత్రం ప్రతి మొక్కకూ పదమూడు రూపాయలు చెల్లిస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడిన అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎక్కువధర చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
         ఆరేళ్ల క్రితం జరిగిన వనమహోత్సవంలో అవినీతి బయటపడటంతో.. విజిలెన్స్ విచారణ జరిగి ఎంపీడీవోలకు ఛార్జ్ మెమోలు ఇచ్చారు. ఉపాధి హామీ ఫీల్డ్ స్టాఫ్ ను తొలగించారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటౌతుందని ఎంపీడీవోలు తలపట్టుకుంటున్నారు. అధికారులు రాజకీయ నేతల అండతో తప్పించుకుంటారని, ఏ అండా లేని తామే బలవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment