Saturday, November 21, 2015

ఆమ్యామ్యా ఇస్తేనే అనుమతులు

రాజకీయ చైతన్యం మెండుగా ఉండే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో.. అవినీతి తాండవిస్తోంది. పురపాలక సంఘంలో పైసలిస్తేనే ఫైలు కదిలే పరిస్థితి ఉంది. పదేళ్ల క్రితం బందరు మున్సిపాల్టీలో ఇధ్దరు అధికారులు ఏసీబీకి చిక్కడం సంచలనం సృష్టించగా.. ఇప్పుడు మళ్లీ ఏవో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి.
             ఇక మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ అధికారుల రూటే సెపరేటు. అడిగినంత ఆమ్యామ్యా ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా భవనాలకు పర్మిషన్ ఇవ్వడం, లంచం ఇవ్వకపోతే అన్నీ సరిగ్గా ఉన్నా అనుమతులు ఇవ్వకపోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తూ పాలకమండలి సభ్యులతో సిఫారసు చేయించుకున్నా.. లంచం ఇవ్వందే అనుమతులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అయితే ఈ బాగోతంలో అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయనే వాదన ఉంది.
            ఇక జిల్లాలో వెయ్యికి పైగా డ్వాక్రా సంఘాలున్నాయి. డ్వాక్రా సంఘాలకు ఏటా వంద కోట్ల వరకు బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఈ రుణాల మంజూరు చేయాలంటే మెప్మా సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవాలి. లక్షకు వెయ్యి నుంచి పదిహేను వందల చొప్పున పట్టుబట్టి వసూలుచేస్తున్నారు. బందరు మున్సిపాల్టీ అవినీతి బాగోతంపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా టీడీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment