Wednesday, November 11, 2015

సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం

ఆరుకోట్ల రూపాయలు ఖర్చుచేసి వేసిన మంచి నీటి పైపులైన్లు.. కనీసం సంవత్సరమైనా పనిచేయాలి కదా. కానీ మన హైటెక్ సీఎం చంద్రబాబు హయాంలో మాత్రం ఐదు నెలలకే నీటి పైపులైన్లకు తూట్లు పడ్డాయి. పుష్కరనిధులతో ఆర్భాటంగా వేసిన పైపులైన్లకు అప్పుడే లీకేజీలు రావడం చూసి జనం విస్తుబోతున్నారు. ఈ చోద్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాల్టీలో జరిగింది.
           అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. పుష్కరాలకు ఇష్టానుసారంగా నిధులు ఖర్చుపెట్టిన సర్కారు.. వాటి అజమాయిషీ సరిగా చేయలేదనడానికి ఈ పనులే నిదర్శనమంటున్నారు. అనవసరంగా ఖర్చు పెట్టడం, డబ్బులు వృథా చేయడం, అంతా అయిపోయాక నిధుల్లేవంటూ చేతులెత్తేయడం సర్కారుకు అలవాటుగా మారిందన్న విమర్శలున్నాయి.
         మంచినీటి పైపులైన్లు నరసాపురం మున్సిపాల్టీ పరిధిలో వేసినా.. మున్సిపాల్టీ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఇంజినీర్లు కూడా పరిశీలించాల్సి ఉంది. పుష్కరాలకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వమే కాబట్టి.. నిధులు సద్వినియోగం అయ్యాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతిసారీ లోటు బడ్జెట్ అంటూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు సర్కారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా తమ వంతు అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. 

No comments:

Post a Comment